HYD | అరగంటలో వరుణుడి బీభత్సం..
HYD | అరగంటలో వరుణుడి బీభత్సం..
- ఓల్డ్ సిటీలో కూలిన ఛత్తా బజార్ కమాన్
- కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు మృతి
- లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. అయితే ఈ వర్షం పాతబస్తీలో ఓ విషాదకర ఘటనకు కారణమైంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఛత్తా బజార్ కమాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కమాన్ భారీ వర్షాల ధాటికి తట్టుకోలేక సాయంత్రం సమయంలో కూలిపోయింది. నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో… ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో కమాన్ కూలిపోవడంతో.. పెద్ద సంఖ్యలో స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు నిర్వహించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
కరెంట్ షాక్‌తో ఇద్దరు మృతి
ఇదిలా ఉండగా, భారీ వర్షాల కారణంగా పాతబస్తీలో మరో విషాదం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన జాఫర్ (25), అబూ (16) అనే ఇద్దరు యువకులు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందారు. రోడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగలను గమనించకుండా ఆటో నుంచి దిగిన సమయంలో వారికి ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
భారీ వర్షాల ప్రభావంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బండ్లగూడ జాగీర్, నూరీనగర్, ప్రశాంత్‌నగర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు రెండు గంటలకుపైగా విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా విద్యుత్ శాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి.
వర్షం ఆగి గంటకు పైగానే అయినా కరెంట్ రాలేదు, తరచూ విద్యుత్ అంతరాయాలు ఎదురవుతున్నాయి, ఫిర్యాదులకు స్పందించడం లేదు అంటూ పలువురు వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. భారీ వర్షాల కారణంగా విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
మరోవైపు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్ నగర్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గాలు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. ఇళ్లలోకి ప్రవేశిస్తున్న వర్షపు నీటిని బకెట్లు, బిందెల సాయంతో బయటకు తోడుతూ కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులతో ఉన్న కుటుంబాలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. “అరగంట వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే.. పూర్తి స్థాయి వర్షాకాలంలో మా పరిస్థితి ఎలా ఉంటుందో?” అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
