దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా ల‌క్ష్యంగా సర్‌..

దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా ల‌క్ష్యంగా సర్‌..

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు ఆరోగ్య‌క‌ర ఓట‌ర్ల జాబితా కీల‌కం
ప్ర‌క్రియ‌లో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోల పాత్ర ముఖ్యం
స‌ర్ స్ఫూర్తికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది నిబ‌ద్ధ‌త‌తో సేవ‌లందించాలి
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌త‌కు దోష ర‌హిత ఓట‌ర్ల జాబితా కీల‌క‌మ‌ని.. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు, సిబ్బంది ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ విధులు నిర్వ‌ర్తించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ సూచించారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని డా. బీఆర్ అంబేద్క‌ర్ క‌ళావేదిక‌లో స‌ర్ ప్ర‌క్రియ‌పై జిల్లాస్థాయి శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూప‌ర్‌వైజ‌ర్లు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్, జిల్లా ఎన్నిక‌ల అధికారి ల‌క్ష్మీశ‌.. విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎంతో క‌లిసి పాల్గొన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా స‌ర్ ప్ర‌క్రియ‌లోని అయిదు ద‌శ‌లు, ఎన్యూమ‌రేష‌న్ ఫారాల అంద‌జేత‌, స్వీక‌ర‌ణ, ఫారాల డిజిటైజేష‌న్, పూర్తి షెడ్యూల్ త‌దిత‌ర వివ‌రాల‌ను వివ‌రించారు.

ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణకు సంబంధించి ఈ నెల 14వ తేదీ వ‌ర‌కు స‌న్న‌ద్ధ‌త కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయ‌ని.. ఆపై జూన్ 15 నుంచి జులై 14 వ‌ర‌కు బీఎల్‌వోల ద్వారా ఇంటింటి స‌ర్వే జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. జులై 21న ముసాయిదా ఓట‌ర్ల జాబితా ప్ర‌చుర‌ణ అనంత‌రం జులై 21 నుంచి ఆగ‌స్టు 20 వ‌ర‌కు క్లెయిమ్‌లు, అబ్జెక్ష‌న్ల స్వీక‌ర‌ణ ఉంటుంద‌ని.. ఆ త‌ర్వాత వీటిని ప‌రిష్క‌రించి ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 22న తుది జాబితాను ప్ర‌చురించ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. అధికారులు, క్షేత్ర‌స్థాయి సిబ్బంది ప్ర‌తి ద‌శ‌లోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. ఎక్క‌డా ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా విధులు నిర్వ‌ర్తించాల‌ని సూచించారు.

అర్హుల‌ను ఓట‌రు జాబితాలో ఉండేలా చేయ‌డంతోపాటు అన‌ర్హులు, మృతులు, శాశ్వ‌తంగా వ‌ల‌స‌వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండ‌టం వంటి వారి ఓట్ల‌ను తొల‌గించి స్వ‌చ్ఛ‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ఓట‌ర్ల జాబితా ల‌క్ష్యంగా స‌ర్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. ఇందుకు సంబంధించి పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రాజ‌కీయ పార్టీలు, భాగ‌స్వామ్య ప‌క్షాల స‌హ‌కారంతో ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌డంలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌న్నారు. ​బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమ‌రేష‌న్ ఫారాల‌ను పంపిణీ, స్వీక‌ర‌ణ‌, డిజిటైజేష‌న్ ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తిచేయ‌ల‌ని స్ప‌ష్టం చేశారు.

ఈసీఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటించాల‌న్నారు. స‌ర్ చాలా కీలకమైన ప్రక్రియ అని, ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌పై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిబ‌ద్ధ‌త‌తో భాగస్వామ్యులై కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు. శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, విజ‌య‌వాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, బీఎల్‌వో సూప‌ర్‌వైజ‌ర్లు పాల్గొన్నారు.

Leave a Reply