హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో రాజీ లేదు..

హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో రాజీ లేదు..

  • విద్యార్థులు చేరేలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
  • బీసీ విద్యార్థులకు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాలు
  • ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తప్పవు
  • అధికారులకు మంత్రి సవిత హెచ్చరిక

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల నిర్వహణలో ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా అధికారులు పనిచేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశించారు. చేనేత కార్మికులు, హస్తకళాకారులకు నిరంతర ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్‌లో మంగళవారం బీసీ సంక్షేమ, ఆప్కో, లేపాక్షి శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి శాఖల పనితీరును సమీక్షించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు హాస్టళ్లలో చేరేలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. తరగతి గదులు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, స్నానాల గదులను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. హాస్టళ్లు, గురుకులాల పరిసరాలను పరిశుభ్రంగా నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ
బీసీ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా విశాఖపట్నం, టేకులోడు ఎంజేపీ విద్యాసంస్థల్లో రెండు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. హాస్టళ్లు, గురుకులాల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ఏడాది బీసీ హాస్టళ్ల నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన మంత్రి సవిత, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. హాస్టళ్లు, గురుకులాల నిర్వహణపై ఫిర్యాదులు వస్తే సంబంధిత వార్డెన్లు, ప్రిన్సిపాళ్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. త్వరలో మెస్ ఛార్జీలు పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ఆప్కో, లేపాక్షి షోరూమ్‌ల పనితీరుపై సమీక్ష
అనంతరం చేనేత, హస్తకళల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆప్కో, లేపాక్షి షోరూమ్‌ల పనితీరును మంత్రి సమీక్షించారు. అమ్మకాలు పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేపాక్షి షోరూమ్‌ల నిర్వహణ కోసం తరంగా యాప్ ఆధారిత వ్యవస్థను సిద్ధం చేసినట్లు తెలిపారు. రోజువారీ అమ్మకాలపై పర్యవేక్షణ పెంచి చేనేత కార్మికులు, హస్తకళాకారులకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని సూచించారు. తిరుపతి పర్యటన సందర్భంగా పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు మంత్రి సవితను కలిసి సత్కరించారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి భరత్ రెడ్డి, చేనేత, జౌళి శాఖ అధికారులు, లేపాక్షి ప్రతినిధులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply