ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం..
ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం..
- విద్యుత్ మిగులు దేశంగా భారత్
- 280 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్
- పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచ అగ్రదేశాల్లో ఒకటి
- 25 కోట్ల మందికి పైగా పేదరికం నుంచి విముక్తి
- తిరుపతిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మంగళవారం ఆయన తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “విశ్వాసానికి, అభివృద్ధికి, జనకళ్యాణానికి 12 సంవత్సరాలు” కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల్లో దేశాన్ని విద్యుత్ కొరత నుంచి విద్యుత్ మిగులు దేశంగా మార్చిందని చెప్పారు.
అగ్రస్థానాల్లో భారత్
2014కు ముందు దేశంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 123 గిగావాట్లు మాత్రమే ఉండేదని, ఆ సమయంలో దేశంలోని పలు ప్రాంతాలు విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని, ఈ ఏడాది మే 23న నమోదైన 280 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించగలిగామని తెలిపారు. దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 538 గిగావాట్లకు చేరుకుందని, అందులో 33 శాతం విద్యుత్ పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే ఉత్పత్తి అవుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో 290 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో భారత్ అమెరికాను అధిగమించిందని, సౌరశక్తి, పవనశక్తి రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థానాల్లో నిలిచిందని పేర్కొన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
గత 12 సంవత్సరాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా బలోపేతమైందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, దాని ఫలితంగా పెట్టుబడులు పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తరించాయని అన్నారు. గత 11 సంవత్సరాల్లో 60 వేల కిలోమీటర్లకు పైగా కొత్త రహదారులు, హైస్పీడ్ కారిడార్లు నిర్మించినట్లు వెల్లడించారు. సెమీకాన్ ఇండియా కార్యక్రమం ద్వారా రూ.1.69 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, ఎలక్ట్రానిక్స్ తయారీ 28 రెట్లు పెరిగిందని చెప్పారు. మొబైల్ ఫోన్ ఎగుమతులు 163 రెట్లు పెరిగి దేశ ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాయని వివరించారు.
ప్రతి వ్యక్తికి అభివృద్ధి ఫలాలు
అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తికి చేరేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు అధ్యయనాల ప్రకారం దేశంలో బహుముఖ పేదరికం 2013-14లో 29.17 శాతం ఉండగా ప్రస్తుతం 11.28 శాతానికి తగ్గిందని తెలిపారు. దీంతో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో అన్ని రాష్ట్రాల అభివృద్ధి కీలకమని చెప్పారు.
ఏపీ అభివృద్ధికి సహకారం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంట్, దక్షిణ తీర రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం గణనీయమైన మద్దతు అందించిందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన అభినందించారు. అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులకు సంతాపం ప్రకటిస్తూ, బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించిన మోదీ ప్రభుత్వ 12 సంవత్సరాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పుస్తకాలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆవిష్కరించారు.
