Revanth Reddy | మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతాం..

Revanth Reddy | మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతాం..

  • 553 బస్సులకు గ్రీన్ సిగ్నల్..
  • త్వ‌ర‌లోనే ఇందిర‌మ్మ చీర‌లు
  • మహిళాశక్తి సభలో కీలక ప్రకటనలు
  • బీజేపీ, బీఆర్ఎస్ మహిళలకు ఏం చేశాయి?
  • మహిళాశక్తి సభలో బీజేపీ, బీఆర్ఎస్‌పై రేవంత్ ఫైర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం జరిగిన ఇందిరా మహిళా శక్తి మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వర్షంలో తడుస్తూనే సభా వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు చెందిన 553 ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన సీఎం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని సీఎం అన్నారు. తెలంగాణ గడ్డపై చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలమ్మ, మల్లు స్వరాజ్యం వంటి మహిళా యోధులు జన్మించారని గుర్తు చేశారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన ఘనత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూదేనని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కును ఆడబిడ్డలకు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని, పలువురు మహిళా ముఖ్యమంత్రులను అందించిన ఘనత కూడా కాంగ్రెస్‌కే దక్కుతుందని చెప్పారు.

మహిళల గురించి మాట్లాడే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆచరణలో ఏమి చేశాయని సీఎం ప్రశ్నించారు. బీజేపీకి 40-50 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఆ పార్టీ మహిళను జాతీయ అధ్యక్షురాలిగా చేసిందా? అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా మహిళలను పార్టీ అధ్యక్షులుగా చేయలేదని, ఐదేళ్ల పాటు మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానించిందని విమర్శించారు. కానీ, ఇందిరమ్మ స్పూర్తితో, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ద‌న‌స‌రి సీతక్క, కొండా సురేఖలను మంత్రులుగా చేసి పాలనలో భాగస్వాములను చేశాం అని రేవంత్ రెడ్డి అన్నారు.

మహిళలకు ఆదాయ మార్గాలు…

గతంలో పెట్రోల్ బంకులు అధానీ, అంబాని వంటి కొద్దిమంది కార్పొరేట్ సంస్థల చేతుల్లోనే ఉండేవని, కానీ ఇప్పుడు నారాయణపేటలో మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8 వేల స్త్రీశక్తి భవనాలు నిర్మిస్తున్నామని ప్రకటించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి వంటి కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేస్తున్నట్లు తెలిపారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. ఉచిత బస్సు పథకాన్ని నిలిపివేయాలనే ఉద్దేశంతో కొన్ని రాజ‌కీయ పార్టీలు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ధర్నాలు చేయించారని ఆరోపించారు. అయితే మహిళలు తిరగబడటంతో అలాంటి రాజకీయ కుట్రలు చేసినవారు వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల విద్యార్థినుల డ్రాప్‌అవుట్స్ గణనీయంగా తగ్గాయని వెల్ల‌డించారు సీఎం రేవంత్.

వ్యవసాయ రంగానికి మహిళలే ప్రాణవాయువులని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. కేవలం వరి, మొక్కజొన్న పంటలకే పరిమితం కాకుండా పప్పుధాన్యాలు, నూనెగింజలు, పండ్ల తోటలు, ఉద్యాన పంటల సాగు వైపు కూడా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో పంట మార్పిడి విస్తృతంగా అమలు కావాలంటే మహిళా రైతులు ముందుండాలని కోరారు. పంట మార్పిడి వల్ల భూమి సారవంతం కావడంతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని చెప్పారు. ఈ విషయాలను కుటుంబంలోని పురుషులకు వివరించి, వ్యవసాయంలో కొత్త మార్పులకు మహిళలే నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలతో పెట్టుకున్నోళ్లు ఎవరైనా బాగుపడతారా? అంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు.

కోటీశ్వరులుగా చేసే వరకు విశ్రాంతి లేదు

రాష్ట్రంలోని ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే వరకు తమ ప్రభుత్వం విశ్రమించదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళలకు అవసరమైన ప్రతి సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేర్లపైనే ఇస్తున్నామని, మహిళా సమాఖ్యల కోసం భవిష్యత్తులో 3 వేల బస్సులను కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే త్వరలోనే రాష్ట్రంలోని మహిళలందరికీ చిలకపచ్చ చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. మహిళల ఆశీర్వాదం, సంపూర్ణ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతూ ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మిస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply