అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా కాంగ్రెస్ పనిచేస్తోంది: మంత్రి పొంగులేటి
అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్లుగా కాంగ్రెస్ పనిచేస్తోంది: మంత్రి పొంగులేటి
దమ్మపేట, ఆంధ్రప్రభ: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.
దమ్మపేట మండలంలో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు.
తొలుత ఆదివాసీ కొండరెడ్డి గిరిజన గ్రామాలైన పూసుగూడెం, కట్కూరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. కట్కూరు గ్రామంలో అందరికీ ఇళ్లు రాలేదని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా, రెండో విడతలో అందరికీ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు.
పూసుగూడెం గ్రామస్తులు వినతులు అందించగా, స్పందించిన మంత్రి సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, పోడు రైతుల సమస్యలపై రెవెన్యూ, అటవీ శాఖలతో జాయింట్ సర్వే నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. అలాగే పూసుగూడెం రహదారి పనులు వేగవంతం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు.
అనంతరం పట్వారిగూడెం నుంచి పాకలగూడెం వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రైతు వేదికలో రాచూరుపల్లి, మల్లారం, లచ్చాపురం గ్రామాలకు చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. ఆ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 1.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లతో పాటు హైదరాబాద్ నగరానికి ప్రత్యేకంగా లక్ష ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. రైతు భరోసా, రుణమాఫీ అమలు చేస్తున్నామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలు అమలులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

