Dy-Cm-Pk-Solace : బాధ సరే Andhra Prabha Top News
Dy-Cm-Pk-Solace : బాధ సరే Andhra Prabha Top News
- ఇది మళ్లీ జరగకూడదు
- 36 ఏళ్ల చరిత్రలోనే..
- ఇది మహా ఉపద్రవం
- బాధితులకు అండగా ఉంటాం
- మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం
- ఒకరికి ప్లాంట్ లో ఉద్యోగం
- క్షతగాత్రులకు రూ.10 లక్షల తక్షణ సాయం
- వైద్య ఖర్చులన్నీ ప్లాంట్ యాజమాన్యమే భరిస్తుంది
- ప్రమాదంపై త్రిసభ్య కమిటీతో దర్యాప్తు
- నివేదిక అనంతరం తదుపరి చర్యలు
- కార్మికుల సమస్యలపై త్వరలోనే సమావేశం
- విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
( ఆంధ్రప్రభ , విశాఖపట్నం బ్యూరో )

‘విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మరణించడం, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడటం అత్యంత బాధాకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కార్మికుని కుటుంబానికి రూ. 25 లక్షల చొప్పున తక్షణ పరిహారంతోపాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్లాంట్‌లో ఉద్యోగం కల్పిస్తాం. తీవ్రంగా గాయపడి ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కార్మికులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శాశ్వత ఉద్యోగులకు ఉద్యోగ విరమణ ప్రయోజనాల కింద రూ. 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ. 45.75 లక్షలు అందిస్తామని, క్షతగాత్రుల వైద్యానికి అయ్యే మొత్తం ఖర్చులను ప్లాంట్ యాజమాన్యమే పూర్తిగా భరిస్తుందని తెలిపారు.
Dy-Cm-Pk-Solace : నివేదిక ఆధారంగా చర్యలు

ప్రమాద ఘటనపై బొకారో స్టీల్ ప్లాంట్ కు చెందిన త్రిసభ్య కమిటీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనా స్థలిని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, అలాగే తీవ్రంగా గాయపడ్డ ప్రతి ఒక్క కార్మికుడి కుటుంబానికి కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూస్తాం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ప్రస్తుతం ఏ విధంగా సాగుతున్నాయో, మరణించిన కార్మికుల పిల్లల చదువులు కూడా అదే విధంగా కొనసాగుతాయి. ప్రమాదంలో మరణించిన ఉద్యోగికి పదవీ విరమణ వయస్సు వచ్చేంత వరకు, వారి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఉంటున్న స్టీల్ ప్లాంట్ క్వార్టర్లలోనే ఉచితంగా కొనసాగవచ్చు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట అద్దె ఇళ్లలో నివసిస్తున్న బాధిత కుటుంబాలు ఒకవేళ ప్లాంట్ క్వార్టర్లలోకి మారాలని అనుకుంటే, వారికి కూడా టౌన్షిప్ లోపల క్వార్టర్లను కేటాయిస్తారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయి. ఒక కోణంలో కాదు.. అన్ని వైపులా వివరాలు సేకరిస్తే విషయం తెలుస్తుంది. ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడటం కాదు.. పునరావృతం కాకుండా చూడాలి. అని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
Dy-Cm-Pk-Solace : అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు

ఘటన స్థలంలో కార్మికులతో మాట్లాడాను. సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్‌ను ఆధునీకరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని, దశాబ్దాల నాటి పాత పరికరాలు, యంత్రాలను మార్చకుండా వాడటం వల్లే ఇలాంటి పెను ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. నాకున్న సమాచారం ప్రకారం గత 36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ కార్యాచరణ చరిత్రలో ద్రవ ఉక్కును మోసుకెళ్లే ల్యాడిల్ బకెట్ ఈ స్థాయిలో పేలిపోయి, ఇంత మంది ప్రాణాలు బలిగొన్న సంఘటన ఎప్పుడూ జరగలేదు. గతంలో చిన్నపాటి లీకేజీలు, ఆక్సిజన్ ప్లాంట్‌లో ఇతర ప్రమాదాలు జరిగినప్పటికీ, ఒక ల్యాడిల్ బకెట్ పేలిపోవడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. చైనా, ఫ్రాన్స్ వంటి విదేశీ ఉక్కు కర్మాగారాల్లో గతంలో కొన్ని పారిశ్రామిక ప్రమాదాలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ, అక్కడ కూడా ఇంత భారీ ఎత్తున మరుగుతున్న ద్రవ ఉక్కు బకెట్ పేలిపోయిన సంఘటనలు నమోదు కాలేదు.

ఈ రకమైన పేలుడు అత్యంత అరుదైనది. త్రిసభ్య కమిటీ త్వరలోనే విశాఖపట్నం చేరుకుంటుంది. వారు ప్రమాదం జరిగిన స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగాన్ని స్వయంగా పరిశీలిస్తారు. ద్రవ ఉక్కును తరలించే లాడెల్ బకెట్ స్లైడ్ గేట్ తెరవకముందే అసలు పేలుడు ఎందుకు సంభవించింది? ఇది సాంకేతిక లోపమా? ఇకేదైనా సమస్య? ఇలా అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అని డప్యూటీ సీఎం వివరించారు.
Dy-Cm-Pk-Solace : త్వరలో రౌండ్ టేబుల్ సమావేశం

స్టీల్ ప్లాంట్‌లో నెలకొన్న కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకేతికపరమైన ఇబ్బందులను సమగ్రంగా తెలుసుకోవడానికి త్వరలోనే కార్మిక సంఘాల ప్రతినిధులతో స్వయంగా ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. ప్లాంట్‌లో అసలు ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మిక సంఘాల నేతలతో మాట్లాడతాను. నిరంతరం పర్యవేక్షించాల్సిన అధికారులు ఎక్కడ నిర్లక్ష్యం వహించారు? సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎందుకు పాటించలేదు? అనే అంశాలను ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తాను. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాదని, స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలన్నదే తమ ప్రభుత్వ గట్టి ఆకాంక్ష. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమర్థవంతమైన నాయకత్వంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని, దానికి కావాల్సిన అన్ని రకాల కేంద్ర సహాయ సహకారాలు అందుతాయని తాము బలంగా ఆశిస్తున్నాం, అని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Dy-Cm-Pk-Solace : ఈ ప్లాంట్ ప్రాంతాలకు అతీతం

గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తే తాము రోడ్లపైకి వచ్చి కొట్లాడాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది త్యాగాల పునాదులపై ఏర్పడింది. ఈ ప్లాంట్ సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేవలం ఆంధ్రప్రదేశ్ వారే కాకుండా, తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా తమ ప్రాణాలను అర్పించారు. దీనికి ప్రాంతాలకు అతీతమైన చారిత్రక నేపథ్యం ఉంది. అని పవన్ కళ్యాణ్ వివరించారు.
Dy-Cm-Pk-Solace : ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాలేదు

స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరడానికి, ఆ సమస్యపై కేంద్ర పెద్దలతో మాట్లాడటానికి ఢిల్లీ వెళ్దాం రండి అని తాను పిలుపునిస్తే ఆ రోజు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా పని చేసినప్పుడే కార్మికులకు నిజమైన న్యాయం జరుగుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తులో అద్భుతంగా వర్ధిల్లాలని, మళ్లీ ఎన్నడూ ఇలాంటి ఘోరమైన ప్రమాదాలు జరగకూడదన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లా ఇంచార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి , శాసనసభ్యులు పంచకర్ల రమేశ్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, విశాఖ డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
Dy-Cm-Pk-Solace : బాధితులకు పరామర్శ

స్టీల్ ప్లాంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు శ్రీ పైడిరాజు, శ్రీ సూరిబాబు, శ్రీ శ్రీనివాస్ లను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ALSO READ : Nara-Lokesh-Assures : అండగా ఉంటాం Andhra Prabha Top News
