ఓటరు జాబితా సవరణలో తప్పులకు తావులేదు..

ఓటరు జాబితా సవరణలో తప్పులకు తావులేదు..

బీఎల్‌ఓలకు కలెక్టర్ రాజకుమారి గణియా స్పష్టమైన ఆదేశాలు!

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి..

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026) కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) సూచించారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని బీఎల్‌ఓలకు మార్గదర్శకాలు అందించారు. ఓటర్ల నమోదు ప్రక్రియ, ఎన్యుమరేషన్ ఫారాల భర్తీ, క్షేత్రస్థాయి ధృవీకరణ విధానాలు, ఓటరు జాబితా సవరణకు సంబంధించిన నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హుల పేర్లు జాబితాలో చేరకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని బీఎల్‌ఓలకు ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో ప్రతి వివరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన సమాచారంతో ఓటరు జాబితాను రూపొందించాలని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 ప్రకారం ఓటరు జాబితాల రూపకల్పన, ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఎన్నికల నిర్వహణ జరుగుతుందని వివరించారు.

ఓటర్లు తప్పుడు వివరాలతో డిక్లరేషన్ సమర్పిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్–31 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. అలాగే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం లేదా అధికారిక విధుల ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై సెక్షన్–32 ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరించి డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. జూలై 21న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్‌ను ప్రచురిస్తామని తెలిపారు. అనంతరం క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఫారం–6 ద్వారా కొత్త ఓటరు నమోదు, ఫారం–7 ద్వారా పేరు తొలగింపు, ఫారం–8 ద్వారా వివరాల సవరణ లేదా నియోజకవర్గ మార్పులు చేసుకోవచ్చని వివరించారు. ఎన్యుమరేషన్ ఫారాలతో పాటు ఆధార్, రేషన్ కార్డు, పాత ఎపిక్ కార్డు వంటి పత్రాల జిరాక్స్ కాపీలు సేకరించవద్దని బీఎల్‌ఓలకు సూచించారు.

ఏఈఆర్‌ఓలు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి, ఎన్నికల హెల్ప్‌లైన్ నంబర్ 1950ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, ఆత్మకూరు ఆర్డీఓ వెంకట శివ, నందికొట్కూరు, మిడుతూరు, పాములపాడు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా, పగిడ్యాల మండలాల బీఎల్‌ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్‌ఓలు పాల్గొన్నారు.

Leave a Reply