Paddy Procurement | 72 లక్షల టన్నుల ధాన్యం సేకరణ..
Paddy Procurement | 72 లక్షల టన్నుల ధాన్యం సేకరణ..
రైతుల ఖాతాల్లో రూ.14 వేల కోట్లు జమ
Paddy Procurement | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం, విద్యుత్, సాగునీటి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
రైతులు పండించిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నామని భట్టి తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 72 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, రైతుల ఖాతాల్లో రూ.14 వేల కోట్లు జమ చేసిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో సేకరించిన మొక్కజొన్నను కూడా కేంద్రం కొనుగోలు చేయాలని కోరారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి తెలిపారు. రాష్ట్రంలోని 30 లక్షల పంపుసెట్లకు సంబంధించిన విద్యుత్ బిల్లుల కింద డిస్కమ్‌లకు రూ.14 వేల కోట్లు చెల్లిస్తున్నామని చెప్పారు. అలాగే 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు.
దేవాదుల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన భట్టి.. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, ఇప్పటికే రూ.22 వేల కోట్ల రైతు రుణమాఫీ అమలు చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
