యాప్ ద్వారానే యూరియా విక్రయాలు జరపాలి

యాప్ ద్వారానే యూరియా విక్రయాలు జరపాలి

పరకాల, ఆంధ్రప్రభ: పరకాల డివిజన్ పరిధిలోని విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల డీలర్లకు వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించి సమాయత్త కార్యక్రమం పరకాలలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై డీలర్లకు పలు సూచనలు చేశారు. ఫర్టిలైజర్ డీలర్లు యూరియాను ప్రభుత్వ యాప్ ద్వారానే విక్రయించాలని, తమ వద్ద ఉన్న స్టాక్ వివరాలను యాప్‌లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.

యాప్ ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో యూరియా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ చంద్ర హెచ్చరించారు. లైసెన్స్‌లో పేర్కొన్న ప్రదేశంలో కాకుండా వేరే చోట వ్యాపారం నిర్వహిస్తే స్టాక్‌ను సీజ్ చేసి క్రిమినల్ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఎక్స్‌పైరీ ఉత్పత్తులను విక్రయించరాదని, విత్తనాల అమ్మకాలలో లాట్ నంబర్ నమోదు తప్పనిసరి అని తెలిపారు.

పరకాల సహాయ వ్యవసాయ సంచాలకులు ఇన్‌చార్జ్ ఆది రెడ్డి మాట్లాడుతూ.. డీలర్లు చట్ట ప్రకారం వ్యాపారం చేస్తూ రైతులకు సేవలు అందించాలని సూచించారు. స్టాక్ బుక్కులు, స్టాక్ బోర్డు, అమ్మకపు బిల్లులు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పరకాల డివిజన్ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

Leave a Reply