సింహాచలంలో పైడితల్లి అమ్మవారి మహోత్సవం..

సింహాచలంలో పైడితల్లి అమ్మవారి మహోత్సవం..

భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం!

వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించిన గంట్ల దంపతులు

సింహాచలం, ఆంధ్రప్రభ: సింహాద్రినాథుడి సోదరి, ఏడు గ్రామాల ప్రజల ఇలవేల్పుగా కొలిచే శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది జూన్ రెండో వారంలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈసారి కూడా సింహాచలం దేవస్థానం, పూజారి వంశీయులు లండవారు, గ్రామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపించారు.

తెల్లవారుజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పరిసర గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

పైడితల్లి అమ్మవారితో పాటు ఆమె సోదరి బంగారమ్మవారిని కూడా భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సింహాచలం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

పండుగ మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్తెమ్మతల్లి, మరిడిమాంబ అమ్మవారి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, ప్రత్యేక ఆహ్వానితుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు పైడితల్లమ్మ, బంగారమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణతో పాటు శీతల పానీయాలు పంపిణీ చేశారు. సంఘం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

భక్తుల రద్దీ, ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలతో పైడితల్లి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Leave a Reply