ఉస్మానియా యూనివర్సిటీకి భారీ విరాళం
ఉస్మానియా యూనివర్సిటీకి భారీ విరాళం
మధిర, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి తేళ్ల గోపాల్రావు ఓయూకు భారీ విరాళం అందజేశారు. మంగళవారం ఆయన యూనివర్సిటీకి 1,10,000 అమెరికన్ డాలర్లను వితరణగా ఇచ్చారు.
1960లో ఉస్మానియా యూనివర్సిటీ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తేళ్ల గోపాల్రావు, మైనింగ్ ఇంజనీరింగ్ ప్రయోగశాలల ఆధునీకరణ, ఏఐ, ఎంఎల్ ఆధారిత పరిశోధన కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 1,00,000 అమెరికన్ డాలర్లను విరాళంగా అందించారు.
అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మరో 10,000 అమెరికన్ డాలర్లను వితరణగా ఇచ్చారు.
విద్యారంగానికి సేవలందిస్తున్న తేళ్ల గోపాల్రావు గతంలో మధిరలో తేళ్ల గోపాల్రావు ప్రభుత్వ పాఠశాలను నిర్మించి, అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
