Ebola Virus | 550 దాటిన కేసులు..
Ebola Virus | 550 దాటిన కేసులు..
Ebola Virus | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ప్రాణాంతక ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 550కిపైగా ఎబోలా కేసులు నమోదయ్యాయని, 101 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కాంగో ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒక్కరోజే 35 కొత్త కేసులు నమోదవగా, 10 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి ప్రస్తుతం ఆందోళనకర స్థాయిలో ఉందని, ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర ఆరోగ్య చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎబోలా వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, బాధితులను గుర్తించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు.
ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, మరికొన్ని రోజుల తర్వాత వ్యాప్తి తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు. ఎబోలా వైరస్ తీవ్రమైన జ్వరంతో పాటు రక్తస్రావ లక్షణాలకు దారితీసే ప్రమాదకర వ్యాధి. బాధితులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే మరణాల రేటు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.
