పోక్సో కేసులో సంచలన తీర్పు
పోక్సో కేసులో సంచలన తీర్పు
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా
సిరిసిల్ల, ఆంధ్రప్రభ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను గోరింటాల గ్రామానికి చెందిన కోటగిరి శ్రీనివాస్ వేధింపులకు గురిచేశాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, అప్పటి సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల 15 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.
ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదనలు వినిపించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువుకావడంతో నిందితుడు కోటగిరి శ్రీనివాస్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు.
సమాజంలో నేరం చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రస్తుత డీఎస్పీ నాగేంద్రచారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సీఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పోక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెలలను జిల్లా ఎస్పీ అభినందించారు.
