Zojila Tunnel | మేఘా బ్రేక్‌త్రూ విజయవంతం
Zojila Tunnel | మేఘా బ్రేక్‌త్రూ విజయవంతం
Zojila Tunnel | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటైన జోజిలా టన్నెల్ నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో ‘బ్రేక్‌త్రూ’ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. దీంతో జమ్మూ-కాశ్మీర్‌లోని శ్రీనగర్, లడక్ ప్రాంతాల మధ్య ఏడాది పొడవునా నిరంతర రవాణా సౌకర్యం కల్పించే దిశగా మరో కీలక అడుగు పడింది.

ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ-కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొన్నారు. అలాగే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పీ.వి. కృష్ణారెడ్డి, డైరెక్టర్ సీహెచ్ సుబ్బయ్య తదితర ప్రముఖులు హాజరయ్యారు.

జోజిలా టన్నెల్ పూర్తయిన అనంతరం శ్రీనగర్-లడక్ మార్గంలో శీతాకాలంలోనూ రాకపోకలు నిరంతరంగా కొనసాగేందుకు వీలు కలగనుంది. ప్రస్తుతం మంచు కారణంగా ఏడాదిలో పలుమాసాలు మూతపడే ఈ మార్గం, టన్నెల్ అందుబాటులోకి రావడంతో అన్ని కాలాల్లో ప్రయాణానికి అనుకూలంగా మారనుంది.


