చంద్రబాబు పాలనపై వైసీపీ నిరసన..
చంద్రబాబు పాలనపై వైసీపీ నిరసన..
ఈనెల 12న 5 వేల మందితో భారీ నిరసన ర్యాలీ
మామిడి రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ
తిరుపతి, ఆంధ్రప్రభ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూమన అభినయ్ రెడ్డి, మాజీ మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పద్మావతిపురంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.
భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతి నుంచి వైసీపీ చేపట్టిన పోరాటాల ఫలితంగానే కొన్ని సర్వీసుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సి వచ్చిందన్నారు. ఈ నెల 12న “వెన్నుపోటు దినం”గా నిర్వహిస్తూ ఐదు వేల మందితో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ర్యాలీ అధికార పార్టీని ఆందోళనకు గురిచేసే స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.
వ్యవసాయం దండగ అని గతంలో వ్యాఖ్యానించిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లాలో సుమారు 50 వేల మంది మామిడి రైతులు కనీస మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
జ్యూస్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో కూటమి నాయకులు కుమ్మక్కై మామిడి రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
