ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి

ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి

చల్లపల్లి, ఆంధ్రప్రభ: ప్రజా ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు అడ్డాడ ప్రసాద్ బాబు, హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ పిలుపునిచ్చారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా చల్లపల్లి ప్రధాన సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన వామపక్ష పార్టీలు పోరాటాలు నిర్వహిస్తున్నాయని, ప్రజలు కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

మోదీ ప్రభుత్వం మే నెలలోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న దుర్మార్గపు చర్యలను ప్రజలు వ్యతిరేకించకపోతే పాలకులు దిగిరారని పేర్కొన్నారు. వామపక్ష ఉద్యమాల్లో ప్రజలు భాగస్వాములై తమ గళం వినిపించాలని పిలుపునిచ్చారు.

బీజేపీ ప్రభుత్వం తన పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని సాకుగా చూపి ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. పొదుపు పేరుతో సంక్షేమ పథకాలను, ఉపాధి హామీ పథకానికి ఇచ్చే నిధులను, రైతులకు ఇస్తున్న ఎరువులు, విత్తనాల సబ్సిడీలను రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 11 రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఘనత మోదీ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పెనుమత్స రాజారత్నం, సిద్దాబత్తుల బాలయ్య, కొల్లూరి శ్రీధర్, కొర్రపాటి ముఖర్జీ, దాసరి గోపాలకృష్ణ, గోగినేని రత్తయ్య, సీపీఎం నాయకులు యద్దనపూడి మధు, వెనిగళ్ల వసంతరావు, మహమ్మద్ కరీముల్లా, రైతు కూలి సంఘం నాయకులు జన్ను జగన్, సీపీఐ ఎంఎల్ నాయకులు పరుచూరి జనార్దన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీర్ రిజ్వన్, జగ్గవరపు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply