9thJunechintana | బాహ్యరూపం కాదు.. గుణగణాలే అసలు విలువ
9thJunechintana | బాహ్యరూపం కాదు.. గుణగణాలే అసలు విలువ
9thJunechintana | అడ్డంకులను దాటే ఆత్మవిశ్వాసం
పరోపకారమే జీవిత పరమార్థం
కష్టాలను తట్టుకునే సహనమే బలం
దగ్గర వాళ్లతోనే వచ్చే ప్రమాదాలపై హెచ్చరిక
9thJunechintana | ఎవరు ఎక్కడ ఏ తీపి వంటకం చేయాలన్నా పంచదారో లేక బెల్లమో తప్పనిసరి. ఆ రెండు పదార్థాలూ చెరకు నుంచే తయారైనవే. లోకానికి తీపితో పాటు కొన్ని నిత్య సత్యాలను కూడా చెరకు తెలియజేస్తోంది. ఔషధం చేదుగా ఉన్నా వ్యాధి నయమవ్వాలంటే దానిని స్వీకరించక తప్పదు. అలాగే చెరకు చాటుతున్న నిత్య సత్యాలూ మనలోని చెడును తొలగించుకుంటూ పురోభివృద్ధిని పొందడానికి స్వీకరించి, తప్పక ఆచరించాలి.
వ్యక్తులను వారి బాహ్య స్వరూపాన్ని బట్టి కాకుండా, వారి గుణగణాలను బట్టి అంచనా వేయాలని చెరకు తన రూపాన్ని నిదర్శనంగా చూపిస్తూ చెబుతుంది. చెరకు పైభాగం కఠినంగా, పీచుపీచుగా, కాస్త వగరుగా ఉంటుంది. అయితే లోపలి భాగం అమృతతుల్యమై, మధురాతి మధురంగా ఉంటుంది కదా! దాని బాహ్యరూపాన్ని చూసి దూరం పెడితే నష్టపోయేది మనమే.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటిని దాటుకుంటూ నిరంతరం ఎదగాలని చెరకు చెబుతుంది. దానికి తన జీవితమే ఉదాహరణ అంటూ, తన దేహం నిండా ఉన్న కణుపులను చూపుతూ, కణుపుల వద్ద ఆగిపోకుండా అంచెలంచెలుగా పెరిగిన తన వైనాన్ని మనకు చూపుతుంది.
స్వార్థం కోసం కాకుండా పరోపకారార్థమే జీవించాలని చెబుతుంది చెరకు. తనలోని మొత్తం రసాన్ని యంత్రాలతో, గానుగలతో పిండుకునే వారికి తీపిని పంచుతూ, ఆపై మిగిలిపోయిన తన పిప్పిని, పీచును కూడా ఎరువుగానో, ఇంధనంగానో సమాజానికి సమర్పించే చెరకు ‘పరోపకారార్థమిదం శరీరం’ అనే సూక్తికి ప్రతీక.
కష్టసహిష్ణుత, కష్టాలకు ఎదురొడ్డి పోరాడే స్వభావం ఉంటేనే ఈ లోకంలో మనగలమని చెబుతుంది చెరకు. ఎలాంటి భయంకరమైన తుఫానులు వచ్చినా, తనను ఎంత బలంగా ఎవరైనా వంచాలని ప్రయత్నించినా చెరకు అంత సులభంగా విరగదు. అంతేకాదు, ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా తట్టుకొని జీవిస్తుంది.
మనతోనే ఉంటూ మన వెనుక గోతులు తవ్వే వారుంటారని కూడా చెరకు చెబుతుంది. “చెరకు తుద వెన్ను పుట్టిన చెరకున తీపెల్ల చెరచు” అని సుమతీ శతకం చెప్పినట్లు, “ఇంట్లోవాడే కంటిలో నలుసు” అని పెద్దలు అన్నట్లు, కొరగాని వారిని దరిచేర్చరాదనీ, వారి సాంగత్యం మన అభివృద్ధికి నిరోధకమనీ చెబుతుంది. మన వద్ద అర్థబలమో, దేహబలమో, అధికార బలమో ఉంటే తన చుట్టూ ఈగలు ముసిరినట్లు బంధుమిత్రులు మన వద్ద చేరతారనీ, మనలోనిసారాన్నంతా దోచుకొని చివరకు పిప్పిలాగా మిగిలిపోతే మంటలలోకి విసిరేస్తారనీ బోధిస్తుంది చెరకు. మనలోని ప్రతిభను, మన మనస్సును అర్థం చేసుకోలేని వారిని చూచి మనం నిరుత్సాహపడరాదు. మహాకవి కరుణశ్రీ చెప్పినట్లు “దంత పుష్టి లేని తాతయ్య గారికి చెరకుగడలటన్న చెడ్డ మంట”.
ఇది వారి అశక్తతే తప్ప మన అసమర్థత కాదని గుర్తించాలని చెబుతుంది చెరకు. తనలాగే కమ్మని మనసుని కలిగి ఉండాలని, అప్పుడే జనాదరణ లభిస్తుం దని తెల్పుతోంది చెరకు. వేసవి తాపాన్ని అరికట్టి, తక్షణ శక్తిని ప్రసాదించడానికి, శరీర బడలికను తొలగించడానికి, కాలేయం మరియు మోకాల్ల ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణ ప్రక్రియకు, రోగ నిరోధక శక్తి పెరుగుదలకు చెరకు రసం ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
అందుకే కాబోలు వినాయక పనికి చెరకు ఇష్టమైన నైవేద్యమయ్యింది. ఆది పరాశక్తి తన నాలుగు చేతులలో ధరించిన దివ్య వస్తువులలో చెరకు గడ ఒకటి. భక్తుల మనస్సు అనే చెరకుగడను కోదండంగా ధరిస్తుందా జగన్మాత (మనోరూపేషు కోదండా!). సౌందర్య, శృంగారాది దేవునిగా పురాణాలలో కీర్తించబడిన మన్మథుడు అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు పువ్వుల బాణాలను చెరకుగడ అనే ధనుస్సుతో సంధిస్తూ ఉంటాడు. ఇలా ఆధ్యాత్మి కంగా, ఆరోగ్యపరంగా, ఇంకా ఎన్నో విధాలుగా జీవిత పాఠాలను బోధించే చెరకుగడ మనకొక వ్యక్తిత్వ వికాస మార్గదర్శి.
గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
