Tributes | అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం : చంద్రబాబు,పవన్ కల్యాణ్

వెలగపూడి – రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్లు చేశారు.

అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందాం – చంద్రబాబు

https://twitter.com/ncbn/status/1911608872051347556

“ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది” అని భారతరత్న డాక్టర్ భీంరావు రాంజీ అంబేద్కర్ అన్నారని, ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా… ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుందామని, దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం – పవన్ కల్యాణ్

https://twitter.com/APDeputyCMO/status/1911622063019672048

బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతి వర్గానికి సంక్షేమాభివృద్ధి ఫలాలు చేరేలా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నానంటూ పవన్ ట్వీట్ చేశారు. ఆర్ధికాంశాల కంటే సామాజికపరమైన అంశాలే వెనుకబాటుతనానికి కారణాలుగా ఉంటున్నాయని గ్రహించిన మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. తన జీవితానుభవాలు, ఉన్నత విద్య అందించిన విజ్ఞానం, సమసమాజ స్థాపన చేయాలనే తపనతో రాజ్యాంగ రూపకల్పన యజ్ఞం చేపట్టారన్నారు. గత పాలకుల హయాంలో డాక్టర్ సుధాకర్ అవమానకర పరిస్థితిని ఎదుర్కొని చనిపోయిన విషయాన్ని, కారు డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వైనాన్ని ఎవరూ మరువరని, ఈ ఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమేనన్నారు. కూటమి పాలనలో ఆయా వర్గాలకు భరోసా కల్పిస్తామని, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళతామని పవన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *