RR | తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య… అదనపు కలెక్టర్

వికారాబాద్, ఏప్రిల్ 3 ( ఆంధ్రప్రభ): భూస్వాములు, దొరల అరాచకాల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు విరోచితమైన పోరాటం చేసిన వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దొడ్డి కొమురయ్య జయంతిని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు ) సుధీర్, డీబీసీడీఓ ఉపేందర్, డీఎస్సీడీఓ మల్లేశం, డీటీడబ్ల్యూఓ కమలాకర్ రెడ్డిలతో కలిసి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్ జ్యోతి ప్రజ్వలన గావించి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దొడ్డి కొమురయ్య సాధారణ గొర్రెల పెంపకందారుల కుటుంబంలో జన్మించినప్పటికీ దొరల, భూస్వాముల అరాచకాలను తట్టుకోలేక యువతీ, యువకులను ఏకంచేసి వారి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. వెట్టిచాకిరి, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టుకొని విసునూరు దొరల ఆగడాలను అరికట్టించడంలో ముందు వరసలో ఉండి పోరాటం చేసిన వీరుడు దొడ్డి కొమరయ్య అని తెలిపారు.

విసునూరు దేశ్ముఖ్ లు మనుషులను వెట్టి చాకిరీ చేయించడంలో, వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించి ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టేవారని, వీటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచి నిర్మూలించగలిగిన మహావ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలు, భూస్వాముల తుపాకీ తూటాలకు బలైన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. ఈకార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ ఫరీనా ఖాతున్, ఏబీసీడీఓ భీమ్ రాజ్, ఏఎస్ డబ్ల్యూఓ శుక్ర వర్ధన్ రెడ్డి, వసతి గృహాల సంక్షేమ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply