ఘనంగా ముగిసిన ఉర్సు మహోత్సవం

ఘనంగా ముగిసిన ఉర్సు మహోత్సవం
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామంలోని ఏ ఏ ఎం టి కే దర్గా అండ్ దర్బార్ బాబె బొగ్దాద్ షరీఫ్ లోసూఫీ ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదిరీ బాబా వారి ధర్మపత్ని మొహమ్మద్ ఖమురున్నిసా బేగం ఐదవ ఉరుసు మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగాజరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఉరుసు మహోత్సవం బుధవారంతో ముగిసింది.దేశ నలుమూలల నుండి బాబా భక్తులు, మహిళలు, పిల్లలు, పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మాజాన్ దివ్య సమాధి వద్ద గంధం, పూలు, ఇత్తర్, చాదర్ సమర్పించి పీఠాధిపతి, సజ్జదానషీన్, పీర్జాద మొహమ్మద్ ఖ్వాజామొహియుద్దీన్ షా తాజ్ ఖాదరీబాబా ఆధ్వర్యంలో ప్రత్యేక దువా, ప్రార్థనలు చేశారు.
యావత్ ప్రపంచశాంతికి, దేశ సమైక్యత, మతసామ్రస్యం,సోదర భావం, ప్రేమతత్వం, దయ, కరుణ, క్షమాపణంతో మూర్తి భవించిన దేశంగా మన భారత దేశాన్ని మనమందరం తయారు చేయాలని,యావత్ ప్రపంచానికి, ఆధ్యాత్మిక దిక్సూచి గా మన భారతదేశం ఉండాలని బాబా పదే పదే చెబుతుండేవారని ఖ్వాజా మొహియుద్దీన్ షా తాజ్ ఖాదరీ బాబా తెలిపారు.ఎవరైతే తనకు తానుగా శాంతంగా చల్లగా కోపాన్ని అదుపులో పెట్టుకొని కోపాన్ని నిగ్రహించుకోగలుగుతారో వారి వల్ల మహాకార్యాలు సిద్ధిస్తాయన్నారు.

ఉరుసు మహోత్సవానికి భారతదేశ నలుమూలల నుండి హాజరైన భక్తులందరికీ బాబా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పీఠాధిపతి ఖాజా మొహియుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి ఖాజామొహియుద్దీన్ షా తాజ్ ఖాదరీ బాబా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు దైవాజ్ఞ మొహమ్మద్ జాఫర్ షరీఫ్, విజయనగరం ఖాదర్ బాబా దర్గా పీఠాధిపతి డాక్టర్ ఖలీలుల్లా షరీఫ్, తాజ్ ఖాదర్ బాబు, కుమార్తె బొగ్దాది లు పాల్గొని కులమత వర్గ విచక్షణ లేకుండా బాబా దర్బార్ కు విచ్చేసిన వేలాది మంది భక్తులకు మహా దివ్య అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించారు.
బుధవారం రాత్రి అమ్మాజాన్ ఉరుసు ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున సందల్ చిరాఖీ (దీపారాధన) కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుండి బాబా భక్తులు, సూఫీ తత్వవేత్తలు, మహనీయులు, జర్నలిస్టులు, రచయితలు,మేధావులుకళాకారులుపాల్గొన్నారు. అమ్మాజాన్ ఉరుసు మహోత్సవం సందర్భంగా బాబా దర్గా షరీఫ్ ను, అమ్మాజాన్ దర్గా షరీఫ్ లను రంగు రంగు విద్యుత్ దీపాలతో శోభయమానంగా అలంకరించారు. విజయనగరం, నాగపూర్ నుండి వచ్చిన ప్రత్యేక మేళతాళాల బృందం డప్పు వాయిద్యాలతో భక్తులను ఎంతగానో ఆకర్షించారు.ఈ మూడు రోజులు పాటు దర్గా షరీఫ్ లలో భక్తిశ్రద్ధలతో ఖురాన్ షరీఫ్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలు దువా కార్యక్రమాలు నిర్వహించారు.
