వెలుగుమట్ల భూభాధితుల కోసం బిజెపి యుద్ధం

వెలుగుమట్ల భూభాధితుల కోసం బిజెపి యుద్ధం
పేదల ఇళ్లను కూల్చి అన్యాయం చేసిన కాంగ్రెస్
ముగ్గురు మంత్రులు భూబకాసురులే
వాసుదేవరావు ధీటైన విమర్శలు
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన భూభాధితుల సమస్యపై బిజెపి రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తీవ్రంగా స్పందించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేస్తూ, ఈరోజు తన నివాసంలో నిర్వహించిన కీలక సమావేశంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. సమావేశానికి హాజరైన బాధితులు తమ సమస్యలను నేరుగా వాసుదేవ రావు దృష్టికి తీసుకెళ్లారు. వెలుగుమట్లలో పేదల ఇళ్ల కూల్చివేతను దేవకి వాసుదేవరావు ఘాటుగా ఖండించారు. కొద్దిమందికి మాత్రమే ఇళ్లు కేటాయించి మిగతా అర్హులను పక్కనపెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఎక్కడైతే ఇళ్లు కూల్చారో అక్కడే తిరిగి ఇళ్లు కట్టించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో భూముల కబ్జాల అంశంపై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వందల కోట్ల విలువైన భూములను పెద్దలు ఆక్రమించుకుంటుండగా, గూడు లేని పేదలపై కఠిన వ్యవహరించడం అమానుషమని అన్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందని, భూభాధితులకు న్యాయం జరిగే వరకు అన్ని మార్గాల్లో పోరాటం కొనసాగుతుందని తెలిపారు. పేదలకు న్యాయం చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని ఇంకా ఇళ్లు రాని భూభాధితుల వివరాలను సమగ్రంగా సేకరించి, అవసరమైతే న్యాయపరమైన పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సమావేశంలో భూభాధితుల సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలకు గురైన భూధన్ భూముల వెలికి తీసేంతవరకు భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు సన్నే ఉదయ ప్రతాప్, న్యాయవాది నేరెళ్ల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు నకిరికంటి వీరభద్రం, సీనియర్ నాయకులు వక్కలంక సుబ్రహ్మణ్యం, డోకుపర్తి రవీందర్, రుద్ర ప్రదీప్, మారుతి వీరభద్ర ప్రసాద్, శాసనాల సాయిరాం, పిల్లలమర్రి వెంకట్, బోయినపల్లి చంద్రశేఖర్, కోటేశ్వరరావు, వల్లాల రమేష్, మణికంఠ, ఆంజనేయులు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

