ప్రభుత్వ అనుమతితో హల్దివాగులోకి నీటి విడుదల

వర్గల్, ఆంధ్ర్రప్రభ : సీఎం రేవంత్ రెడ్డి రైతులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుండడంతో భారత దేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకుంటుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అవుసులోని పల్లి శివారులోని కెనాల్ వద్ద హల్దీవాగు లోకి నీటిని ఇరిగేషన్ ఈఈ జితేందర్ రెడ్డితో కలిసి విడుదల చేసిన అనంతరం వారు మాట్లాడారు. రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా కాపాడే క్రమంలో ప్రభుత్వ అనుమతి తీసుకొని నీటిని విడుదల చేయగా, దారి పొడవునా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పంటలకు నీరు సంవృద్ధిగా చేరుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు పండించిన సన్నధాన్యానికి రూ 500 బోనస్ ఇవ్వడంతో పాటు భరోసా నిధులు విడుదల చేసి అన్నదాతల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మస్థైర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

రైతులు బాగుండాలనే లక్ష్యంతో రైతు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు కార్యరూపం కల్పిస్తూ అన్నదాత తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నట్లు చెప్పారు. అయితే రైతుల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ సత్యవాస్, ఇతర అధికారులు మురళీధర్ రెడ్డి, ఇందిర, సాహితీ, గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్త, కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కీసర వెంకటేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply