AP | ప్రజాదర్బారుతో సమస్యలకు సత్వర పరిష్కారం..

AP | ప్రజాదర్బారుతో సమస్యలకు సత్వర పరిష్కారం..
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
AP | రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : ప్రజాదర్బారు’తో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెంలోని మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బారులో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. నిర్విరామంగా వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను ఓపికగా విని వారి సమస్యల పరిష్కారం కోసం ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ ప్రజాదర్బారు వేదికలో అన్నిశాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ఇక్కడకు వచ్చే సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.

ప్రతి సమస్యకు మొక్కుబడిగా కాకుండా నాణ్యతతో కూడిన పరిష్కారం లభించాలని అన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ బాధ్యతతో పని చేయాలన్నారు. సమస్యల మూలాలను గుర్తించి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజాదర్బారులో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్తు, రహదారుల అభివృద్ధి, వివిధ శాఖలకు సంభందించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై ప్రజలు ఆర్జీలు సమర్పించారు. సమస్య తీవ్రతను బట్టి వెంటనే పరిష్కరించే అవకాశం ఉన్నవాటిని తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు అధికారులను ఆదేశించారు. నిధుల మంజూరుతో ముడిపడిన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. మరికొన్ని సమస్యలపై సమగ్రంగా విచారించి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
