Medaram | సమ్మక్క తల్లిని తీసుకువచ్చేది

Medaram | సమ్మక్క తల్లిని తీసుకువచ్చేది
Medaram | మేడారం (మంగపేట), ఆంధ్రప్రభ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క తల్లి గద్దె మీద కొలువుదీరడం. జాతరలో రెండవ రోజైన గురువారం సమ్మక్క తల్లిని చిలకలగుట్ట మీద నుండి తీసుకువచ్చి గద్దెపైకి చేర్చుతారు. కాకతీయులలో జరిగిన యుద్ధంలో కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతూ సమ్మక్క వీరోచితంగా పోరాడుతుంది. యుద్ధంలో శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది.

సమ్మక్క జాడ కోసం వెదుక్కుంటూ వెళ్లిన సమ్మక్క అనుచరులకు సమ్మక్క జాడ కనిపించదు. చిలకలగుట్ట ప్రాంతంలో ఓ పుట్ట దగ్గర పసుపు కుంకుమ భరిణె కనిపించింది. దాంతో ఆ కుంకుమ భరిణెనే సమ్మక్క తల్లిగా భావించి అప్పటి నుంచి ప్రతీ రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి సమయంలో మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. సమ్మక్కను తీసుకువచ్చే చిలకలగుట్ట రక్షణ కోసం చిలకల గుట్ట చుట్టూ ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, సమ్మక్కను తీసుకువచ్చే మార్గంలో మాత్రం ఒక గేట్ ( ద్వారం) ఏర్పాటు చేసింది.
