AP | మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం లేకుండా ప్ర‌గ‌తి అసాధ్యం – చంద్ర‌బాబు

మార్కాపురం – ఆంధ్ర‌ప్ర‌భ – మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

మ‌హిళా దినోత్స‌వ సంద‌ర్బంగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో జ‌రిగిన ప‌లు కార్య‌క్ర‌మాల‌లో ఆయ‌న పాల్గొన్నారు.. ముందుగా స్వయం సహాయక బృందాలు నిర్వహించిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే అరటి వ్యర్ధాలతో తయారు చేసిన టోపీని ధరించారు. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను చంద్రబాబు ప్రారంభించారు. దీంతోపాటు చేనేత రథాన్ని ప్రారంభించారు. గుర్రపుడెక్క, అరటి, కొబ్బరి వ్యర్ధాలతో పీచు తయారీ ద్వారా మంచి ఆదాయం వస్తుందని సీఎం పేర్కొన్నారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు.

ఇక మహిళల భద్రత కోసం, మహిళా రైడర్లని ప్రోత్సహిస్తూ, ప్రధాన నగరాల్లో 1,000 మంది మహిళా రైడర్లకు 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు అందించే కార్యక్రమాన్నికూడా ఇక్క‌డ నుంచే ఆయ‌న‌ ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మాంలో పాల్గొన్న ర్యాపిడో మ‌హిళా డ్రైవ‌ర్ల‌ను అభినందించారు.

మ‌హిళ‌ల‌లో శ‌క్తి అపారం..

అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ, అపారమైన శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ సంపాదనలో పురుషులను మించిపోతున్నారని తెలిపారు. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే 2023-24 ప్రకారం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. అందుకే మహిళల కోసం వర్క్‌ ఫ్రం హోం (ఇంటి నుంచే పని) విధానాన్ని కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. మహిళలు ఇంట్లో కూర్చునే మగవాళ్ల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకువస్తామని తెలిపారు.
విశ్వ‌విఫ‌ణిలోనూ రాణించాలి..

మన మహిళలు విశ్వ విపణిపై రాణించాల‌ని కోరారు.. ప్రతి ఒక్కరూ ఆర్ధిక స్వావలంబన సాధించాల‌ని అంటూ ఏడాదిలో లక్షమంది పారిశ్రామికవేత్తలు తయారవ్వాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు…. రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ మహిళలు ముందంజలో ఉండాలని, ఆర్ధిక శక్తిగా ఎదగాలనీ ఆయ‌న అకాంక్షించారు., జాతీయ- అంతర్జాతీయ వేదికలపై మ‌హిళ‌లు సత్తా చాటాందేకు వీలుగా మహిళలకు అండదండలు అందించే ప‌లు కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం అమ‌లు చేయ‌నుంద‌ని చెప్పారు.. దీనికోసం ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

బేర‌మాడి భార్య‌కు చీర‌కొన్న చంద్ర‌బాబు …

కాగా, ఈ పర్యటనలో భాగంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. డ్వాక్రా మహిళలు తయారుచేసిన వస్తువులను పరిశీలించారు. ఓ చీరల స్టాల్ ను కూడా సందర్శించిన చంద్రబాబు తన అర్ధాంగి నారా భువనేశ్వరి కోసం ఓ పట్టుచీర కొనుగోలు చేశారు. ముందుగా ఎంతకు అమ్ముతున్నావమ్మా ఈ చీర? అంటూ స్టాల్ లో ఉన్న మహిళను చంద్రబాబు అడిగారు. అందుకు ఆ మహిళ బదులిస్తూ రూ.26,400 అని చెప్పింది. చివరికి చంద్రబాబు ఆ చీరను ప‌లుసార్లు బేర‌మాడి చివ‌ర‌కు రూ.25 వేలకు కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు స్టాల్లో మంగళగిరి పట్టుచీరలు కూడా ఉండడాన్ని ఆసక్తిగా పరిశీలించారు. షర్టు, పంచె, కండువా సెట్ ను కూడా పరిశీలించారు. త‌న కోసం ష‌ర్టు, పంచె, కండువాను కూడా కొనుగోలు చేశారు. అలాగే అక్క‌డ ఉన్న మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల‌తో వ్యాపారం ఎలా సాగుతోందమ్మా? అని ఆరా తీశారు. పర్యావరణ హిత విధానంలో గుడ్డ సంచులు వాడుతుండడం పట్ల ఆ స్టాల్ వారిని చంద్రబాబు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *