లక్షలాది మంది జాతరకు ముందే

మేడారం ( మంగపేట ) ఆంధ్రప్రభ : వన దేవతలైన మేడారం సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. సారలమ్మ గద్దెపై కొలువుదీరే జనవరి 28 నుండి వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేసే జనవరి 31 తేదీ వరకు నాలుగు రోజులు పాటు జరగనున్న మేడారం మహా జాతరకు ఈ సంవత్సరం దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
జాతర సమయంలో మేడారం కిటకిటలాడుతుందని లక్షలాది మంది జాతరకు ముందే మేడారం విచ్చేసి అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో పస్రా నుండి మేడారం, భూపాలపల్లి నుండి మేడారం, తాడ్వాయి నుండి మేడారం, చిన్నబోయినపల్లి నుండి మేడారం ఏ దారి చూసినా భక్తులతో మేడారం వచ్చే వాహనాలే కనబడుతున్నాయి.
గత రెండు నెలల నుండే భక్తులు మేడారం వచ్చి ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నా గత పదిహేను రోజుల నుండి ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. మేడారం విచ్చేసిన భక్తులు మొదట జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసి అనంతరం తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వన దేవతల దర్శనం కోసం మేడారం విచ్చేసిన భక్తులతో జంపన్న వాగుతో పాటు గద్దెల ప్రాంగణం కిటకిటలాడుతోంది. అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించిన అనంతరం మేడారం పరిసర ప్రాంతాలలో విడిది చేసుకుని భక్తులు కోళ్ళను, యాటపోతులను అమ్మవార్లకు బలిచ్చి బంధుమిత్రులతో విందులు చేసుకుంటున్నారు. మేడారం, రెడ్డిగూడెం, కొత్తూరు గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా తమ వ్యాపారాల కోసం వ్యాపారస్థులు ఏర్పాటు చేసుకున్న గుడారాలతో నిండిపోయాయి.
