AP | గంజాయి విక్రయాలపై పోలీసుల దాడి

AP | గంజాయి విక్రయాలపై పోలీసుల దాడి

  • రూ.2.50 లక్షల విలువైన 6 కేజీలు 200 గ్రాముల గంజాయి స్వాధీనం
  • ఇద్దరు ముద్దాయిల అరెస్ట్ – 5 సెల్‌ఫోన్లు సీజ్

AP | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలను అరికట్టేందుకు చేపట్టిన ప్రత్యేక నిఘా చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. రూ.2,50,000 విలువ గల 6 కేజీలు 200 గ్రాముల గంజాయితో పాటు 5 సెల్‌ఫోన్లును స్వాధీనం చేసుకొని ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పట్టణం, పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిత్తూరు డీఎస్పీ టి. సాయినాథ్ ఆధ్వర్యంలో, చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. మహేశ్వరకు అందిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. చిత్తూరు పట్టణంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌స్టాండ్ వెనుక వైపున ఉన్న ఖాళీ ప్రదేశంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక మహిళ బుజ్జి (27), ఒక పురుషుడి కాక‌రి శివ‌తేజ‌(25)ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 6 కేజీలు 200 గ్రాముల గంజాయి మరియు 5 సెల్‌ఫోన్లు లభించాయి.

వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ప్రాథమిక దర్యాప్తులో ముద్దాయిల్లో ఒకరు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు సరఫరా చేస్తుండగా, అక్కడి నుంచి స్థానికంగా మత్తుకు అలవాటు పడిన వారికి విక్రయిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఇంకా కొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉండడంతో, వారిపైనా పోలీసులు నిఘా పెట్టినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాల వల్ల యువత మత్తుకు బానిసలవుతూ, అనేక నేరాలకు పాల్పడుతున్నారని, దీని కారణంగా సామాన్య ప్రజలు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తూ, తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు, విక్రయం లేదా సేవించడం వంటి చర్యలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి, వాటి వల్ల కలిగే అనర్థాలను నివారించేందుకు సహకరించాలని కోరారు.

Leave a Reply