శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ (హైదరాబాద్‌‌), ఆంధ్ర‌ప్ర‌భ‌: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు సోమవారం పట్టుకున్నారు. తిరుచిరాపల్లి నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ నగల వ్యాపారి వద్ద నుంచి సుమారు 800 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పక్కా సమాచారంతో దాడులు..

హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యాపారి తన బ్యాగులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు ముందస్తుగా పక్కా సమాచారం అందింది. దీంతో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.

రూ. 1.20 కోట్ల విలువ..

స్వాధీనం చేసుకున్న 800 గ్రాముల బంగారు ఆభరణాల విలువ మార్కెట్‌లో సుమారు రూ. 1.20 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అక్రమ రవాణా ఘటనపై డీఆర్‌ఐ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.