8-Arrested-Manipur-Rock-Star-Murder : గోల వ‌ద్దంటే.. !?Andhra Prabha Crime News

8-Arrested-Manipur-Rock-Star-Murder : గోల వ‌ద్దంటే.. !?Andhra Prabha Crime News

  • మ‌ణిపూర్ రాక్ స్టార్ హ‌తం
  • దక్షిణ ఢిల్లీలో దారుణం
  • మెట్ల లాబీలో వెంటాడి హ‌త్య‌
  • 8 మంది అరెస్టు.. వీరిలో ఒకరు మైనర్‌
  • మణిపూర్‌ రాక్‌ సంగీతానికి మార్గదర్శిగా గుర్తింపు

(ఆంధ్ర‌ప్ర‌భ‌, న్యూఢిల్లీ)

మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు, రాక్‌ గిటారిస్ట్‌ చోంగ్తామ్‌ విక్రమ్‌ సింగ్‌ (55) దక్షిణ ఢిల్లీలో దారుణ హత్యకు గురయ్యారు. సన్‌లైట్‌ కాలనీ పరిధిలోని ఆశ్రమ్‌ ప్రాంతంలో తన ఇంటి వద్ద కొందరితో జరిగిన వివాదం అనంతరం.. ఆయనను వెంబడించి భవనం మెట్ల లాబీలో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన సింగ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనకు సంబంధించిన రెండు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

చెత్త వేసేందుకు వెళ్లి..

పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి సుమారు 11.30 గంటలకు సింగ్‌ చెత్త వేసేందుకు ఇంటి నుంచి కిందకు వచ్చారు. ఆ సమయంలో సమీపంలోని తినుబండారాల దుకాణాల సిబ్బంది, ఫుడ్‌ డెలివరీ ఏజెంట్లు కొందరు పెద్దగా శబ్దం చేస్తూ కనిపించారు. దీనిపై సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మెట్లలోకి వెంబడించి..

వాగ్వాదం అనంతరం నిందితులు సింగ్‌ను ఆయన నివాస భవనం మెట్లవైపు వెంబడించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అక్కడి మెట్ల లాబీలో ఆయనపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో నిందితులు భవనం నుంచి మెట్ల మార్గంలో బయటకు వెళ్తున్నట్లు కనిపించింది. సోమవారం అర్ధరాత్రి 12.06 గంటలకు నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ఆస్పత్రిలో మృతి

దాడి జరిగిన పది నిమిషాల తర్వాత.. అంటే 12.16 గంటలకు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న సింగ్‌ను ఓఖ్లాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో సోమవారం ఉదయం ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

ఎనిమిది మందిపై కేసు

ఈ ఘటనపై సన్‌లైట్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి మూకదాడికి పాల్పడిన సందర్భాలకు వర్తించే భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 103(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు మైనర్‌ కావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు వీరే..

సైనీ ఢాబాలో పనిచేసే నలుగురిని పోలీసులు గుర్తించారు. వారిలో భరత్‌కుమార్‌ (19), ప్రమోద్‌ (26) ఫుడ్‌ డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. దీపాంశు (21), మోహన్‌ విశ్వకర్మ (32) ఫుడ్‌ ప్యాకేజింగ్‌ విభాగంలో పనిచేస్తున్నారు. మిగిలిన వారిలో న్యూ చౌదరి ఢాబాలో ఫుడ్‌ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసే రంజాన్‌ ఖాన్‌ (22), అన్నపూర్ణ ఢాబా డెలివరీ ఏజెంట్‌ విజయ్‌ (36), డైమండ్‌ పిజ్జా కియోస్క్‌లో పనిచేసే మన్ను (26) ఉన్నారు.

మణిపూర్‌ రాక్‌ సంగీతానికి మార్గదర్శి

చోంగ్తామ్‌ విక్రమ్‌ సింగ్‌ సాధారణ సంగీతకారుడు కాదు. మణిపూర్‌ రాక్‌ సంగీత రంగంలో మార్గదర్శకుల్లో ఒకరిగా ఆయనకు గుర్తింపు ఉంది. 1980ల ప్రారంభంలో మణిపూర్‌లో ప్రసిద్ధి చెందిన ఫీనిక్స్‌ రాక్‌ బ్యాండ్‌కు ఆయన లీడ్‌ గిటారిస్ట్‌గా వ్యవహరించారు. అంతకుముందు అల్ట్రా వైరస్‌ అనే బ్యాండ్‌తో ఆయన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఫీనిక్స్‌లో కొంతకాలం కొనసాగిన అనంతరం మరో ప్రముఖ స్థానిక బ్యాండ్‌ ఈస్టర్న్‌ డార్క్‌లో చేరారు.తర్వాత మణిపూర్‌ను విడిచిపెట్టి న్యూఢిల్లీకి వచ్చిన సింగ్‌.. సంగీత ఉపాధ్యాయుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు.

సంగీత వారసత్వ కుటుంబం

సింగ్‌ కుటుంబానికే సంగీతంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన తల్లి చోంగ్తామ్‌ కమలా మణిపూర్‌కు చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయని. మణిపురి చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఆమెను ‘మణిపూర్‌ లతా మంగేష్కర్‌’గా కూడా అభివర్ణించేవారు.అలాంటి సంగీత కుటుంబానికి చెందిన విక్రమ్‌ సింగ్‌.. మణిపూర్‌ రాక్‌ సంగీతానికి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆయన అభిమానులు, సంగీత రంగానికి చెందినవారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.