8.19 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్
కారు డిక్కీలో దాచిపెట్టి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ : కరీంనగర్ నగరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు చేపట్టిన నిఘాలో భారీగా గంజాయి పట్టుబడింది. కరీంనగర్-1 టౌన్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 8.19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
లక్ష్మీనగర్‌లోని అమీర్ షాహీ మసీదు సమీపంలో గంజాయిని నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న అమీర్ షాహీ మసీదు సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన మొహమ్మద్ రిజ్వానుద్దీన్ అలియాస్ ఫైజాన్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న కారును తనిఖీ చేయగా.. డిక్కీలో బ్యాగుల్లో ప్యాక్ చేసి ఉంచిన గంజాయి బయటపడింది.
కారులో నుంచి మొత్తం 8.190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గంజాయి తరలింపునకు ఉపయోగించిన కారు, ప్యాకింగ్ సామగ్రి, మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కరీంనగర్-1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎన్డీపీఎస్ చట్టం కింద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలించేందుకు ప్రయత్నించారు? దీని వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
ఈ కేసులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు సమాచారం రావడంతో వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గంజాయి కొనుగోలు, రవాణా, సరఫరా మార్గాలను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.
