ప్రజల నమ్మకానికి దగ్గట్టుగా పనిచేయకుంటే రాజీనామా చేస్తా…

ప్రజల నమ్మకానికి దగ్గట్టుగా పనిచేయకుంటే రాజీనామా చేస్తా…
మీ నమ్మకం ఆలోచనలకు దగ్గట్టు పనిచేస్తా
కారు గుర్తుకు ఓటేయాలనే ప్రజల నిర్ణయానికి కృతజ్ఞతలు
బిఆర్ఎస్ 6వ వార్డు అభ్యర్థి జీవన్ రావు సంచలన వ్యాఖ్యలు
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజల నమ్మకానికి దగ్గట్టుగా పనిచేయకుంటే ఏడాదిలోగా తన పదవికి రాజీనామా చేస్తానని బిఆర్ఎస్ 6వ వార్డు అభ్యర్థి, ప్రముఖ న్యాయవాది జీవన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మెదక్ పట్టణంలోని జంబికుంటలో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన 6వ వార్డు అభ్యర్థి న్యాయవాది గోర్పాడి జీవన్ రావు తన సతీమణి స్వప్నతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రావు మాట్లాడుతూ.. మెదక్ పట్టణంలోని 6వ వార్డులో గత వారం రోజులుగా తాను చేస్తున్న ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సంక్షేమ పథకాలను, ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితుల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ప్రజలందరు తనకు మద్దతుగా నిలుస్తూ కారు గుర్తుకు ఓటేసేందుకు నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 6వ వార్డు ప్రజలు ఇంటి బిడ్డగా తన పై చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని తెలియజేశారు. ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి సీరియల్ నెంబర్ 3 పై కారు గుర్తుకు ఓటు వేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు 6వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డు ప్రజలు తనకు అండగా నిలబడి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయాన్ని అందించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజారిటీతో విజయాన్ని అందించబోతున్న ప్రజలకు జీవిత కాలం రుణపడి ఉంటానని పేర్కోన్నారు. ఎన్నికల సందర్భంలో తాను నమ్మకంగా పనిచేస్తానని ప్రజలకు ఇస్తున్న హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తానని తెలిపారు. గెలిచినప్పటి నుండి ఏడాది లోగా ప్రజల నమ్మకానికి దగ్గట్టుగా పని చేసి, ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు.
ఒకవేళ ఇచ్చిన మాట మేరకు పనిచేయకుంటే 6వ వార్డు ప్రజల కోరిక మేరకు ప్రజలు అందించేటువంటి కౌన్సిల్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 6వ వార్డు అభ్యర్థి జీవన్ రావ్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రజలు కారు గుర్తుకు ఓటేసి పట్టం కట్టాలనే నిర్ణయానికి రావడం జరిగిందనే చర్చసాగుతుంది. ప్రశ్నించే గొంతుక, అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా, ఓ న్యాయవాదిగా ఇటువంటి వ్యక్తి కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజా సమస్యలపై నిలదీస్తాడని, వాటిని పరిష్కరిస్తాడనే ఆలోచన ప్రజల్లో కలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్ రావు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం మెదక్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది.
