6amWalk | నడకే దివ్యౌషధం. రోజుకు ఎవరు, ఎంత, ఎప్పుడు నడవాలి?

6amWalk | నడకే దివ్యౌషధం. రోజుకు ఎవరు, ఎంత, ఎప్పుడు నడవాలి?

6amWalk | ఒకప్పుడు పేదరిక చిహ్నం… ఇప్పుడు ఆరోగ్య రహస్యం!
ఉదయం నడక కుదరకపోతే ఎప్పుడు నడవాలి?
రోజుకు ఎంత నడక మంచిది?
నడక వేగం ఎలా ఉండాలి?
వ్యాయామానికి నడక ప్రత్యామ్నాయమా?
వయస్సును బట్టి ఎంత నడవాలి?
నడక వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
నడకను జీవితంలో భాగం చేసుకుంటే మందులు దూరం!

6amWalk | ఒకప్పుడు మైళ్ళకొద్దీ దూరం నడిచేవాళ్ళం…
నడుచుకుంటూ తిరిగేవాళ్ళం….
ఇవన్నీ ఒకప్పుడు మన జీవితం మొదలైన కొత్తల్లో పడిన కష్టాల గురించి చెప్పుకునే కొలమానాలు…
పేదరికానికి చిహ్నంగా, నడక నుంచి కారు దాకా ఎదిగామని గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ అదే నడక మనల్ని అనేక రుగ్మతల నుండి కాపాడుతుందని తెలుసుకుంటున్నామా?

6amWalk
6amWalk

ఈ రోజుల్లో బిజీ జీవితంలో ఉదయం, సాయంత్రం జిమ్‌కు వెళ్ళి వ్యాయామం చేసే సమయం లేకపోయినా, ఖరీదైన పరికరాలు అందుబాటులో ఉండకపోయినా, అందరికీ, అన్నివయసుల వారికీ సులభమైన వ్యాయామం ఒక్కటే…అదే నడక. శరీరానికి చురుకుదనం, మనసుకు ప్రశాంతత, ఉల్లాసం అన్నిటికన్న ముఖ్యమైన గుండెకు బలం ఇవన్నీ ఒకే అలవాటుతో పరిష్కారమవుతాయి.కానీ చాలా మందికి ఒక సందేహం కలుగుతూండవచ్చు..నడక అనేది ఉదయమే చెయ్యాలా? ఉదయం నడక కుదరకపోతే? ఒక రోజులో ఎంత నడవాలి? వయసును బట్టి నడక దూరం నిర్ణయించుకోవాలా? ఇది వ్యాయామంతో సమానమవుతుందా?
ఉదయం వేళ గాలి పరిశుభ్రంగా ఉండడం, మనసు ప్రశాంతంగా ఉండడం, రాత్రంతా శరీరానికి కావల్సిన విశ్రాంతి లభించడం వల్ల నడకకు అది సరైన సమయంగా వైద్యుల నుంచి సూచించబడుతుంది.కానీ, ప్రతి ఒక్కరికీ ఉదయం నడక కుదరకపోవచ్చు. అలాంటి వారు సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య తగినంత దూరం నడవొచ్చు. లేదా రాత్రి భోజనం తర్వాత అయినా కనీసం 1 గంట గ్యాప్‌తో కాస్త నడవొచ్చు. ఆఫీసులో లంచ్ బ్రేక్ సమయంలో కారిడార్ లోనో, లేదా అనువైన ప్రదేశంలోనో కాస్త నడవొచ్చు.

ఇంట్లోనే ట్రెడ్మిల్ లేదా చుట్టుపక్కల వీధుల్లో నడక అనేదిఒ ఏ సమయం అయినా సరే రెగ్యులర్ గా చేయడం ముఖ్యం.. ఖాళీ కడుపుతో లేదా తేలికపాటి ఆహారం తర్వాత నడవడం మంచిది.

ఇంకా అందరికీ ఉండే ముఖ్యమయిన సందేహం..రోజుకు ఎంత నడిస్తే మంచిది?
దీనికి సమాధానం వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారమైతే, కనీసం రోజుకు 30 నిమిషాలు లేదా ఆరువేల నుంచి పదివేల అడుగులు నడిస్తే మంచిది.

ఇలా వారానికి కనీసం 5 రోజులు నడిస్తే ఆరోగ్యంపై గణనీయంగా ప్రభావం చూపించొచ్చు.
బరువు తగ్గాలనుకునేవారు నడక సమయాన్ని రోజుకు 45–60 నిమిషాలకు పెంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అందరిలో ఉండే మరో ముఖ్యమైన సందేహం…నడక వేగం ఎలా ఉండాలి? ఆరోగ్యం కోసం చేసే నడక స్పీడ్ వాకింగ్ రూపంలో ఉండాలి. అంటే, నడుస్తూ మాట్లాడ గలిగేంత వేగం.

నడక అనేది ఒక పూర్తి స్థాయి వ్యాయామమే. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి, గుండె నొప్పుల నివారణకు నడక దివ్యౌషధం. రక్తపోటు నియంత్రణలో ఉంచుతుంది రేగ్యులర్ గా చేసే వాకింగ్. ఇక డయాబెటిక్ పేషెంట్స్ కి షుగర్ లెవల్స్ కంట్రోల్‌కి వస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారికి బరువు తగ్గించడానికి నడకను మించినది లేదు. అలాగే మానసిక ఒత్తిడితో బాధవడే వారికి నడక ఉత్తమ మార్గం. అయితే కండరాల బలం పెంచుకోవాలంటే మాత్రం నడకకు తోడు, స్ట్రెచింగ్, తేలికపాటి బరువులు ఎత్తడం లాంటి చిన్న చిన్న వ్యాయామాలు కూడా జోడిస్తే మెరుగైన ఆరోగ్య ఫలితాలు సొంతమవుతాయి.
అందుకే నడకను బేస్ ఎక్సర్‌సైజ్ గా తీసుకోవాలి. నెమ్మదిగా నడకకు అవసరమైతే ఇతర వ్యాయామాలను కలపాలి.

6 నుంచి 17 సంవత్సరాల పిల్లలైతే రోజుకు కనీసం 60 నిమిషాలు శారీరక చలనం
అవసరం. అంటే, క్రీడలు, సైక్లింగ్, పరుగులు ఇవి కూడా నడకతో సమానం.

18 నుంచి 50 సంవత్సరాల వయస్సులోని వారు రోజుకు 30–45 నిమిషాలు వేగంగా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

50 సంవత్సరాలు పైబడిన పెద్దవారు రోజుకు 20–30 నిమిషాలు మెల్లగా, స్థిరంగా
అవసరమైనవారు చేతి కర్ర లేదా, సపోర్ట్‌తో వయసును, శక్తిని, ఆరోగ్య పరిస్థితి అనుసరించి తగిన మోతాదులో నడవడం మంచిది.గుండె సంబంధిత లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం రోజుకి ఎంత నడవాలి? ఏ సమయంలో, ఎంత వేగంతో నడవాలనేది వైద్యుడి సలహా తీసుకోవడం తప్పనిసరి.

నడక వల్ల శరీరానికి చురుకుదనం, మానసిక ప్రశాంతత, మంచి నిద్ర, జీర్ణక్రియ మెరుగుదల,
రోగ నిరోధక శక్తి పెరుగుదల, ఇలా అనేక ప్రయోజనాలున్నాయి.

రోజూ నడిచే వాడికి మందుల అవసరం తక్కువ” అనే మాట ముమ్మాటికీ నిజం.
నడకకు ప్రత్యేక ఖర్చు లేదు, పరికరాలు అవసరం లేదు, వయసు పరిమితి లేదు. సమయాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి సరైన మోతాదులో నడిస్తే, అది నిజంగా ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా ఉపకరిస్తుంది.


-ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

మరిన్ని ఆరోగ్య సూచనల వ్యాసాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

google లో మరిన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply