500-Tonnes-Reverse-Trade-India-Bangladesh : భారత్ రిటన్ గిప్ట్ Andhra Prabha Top Story
500-Tonnes-Reverse-Trade-India-Bangladesh : భారత్ రిటన్ గిప్ట్ Andhra Prabha Top Story
- ఇలీష్ ఫిష్ బ్యాక్ టూ బంగ్గా..:
- మళ్లీ పుట్టింటికి.. ఈ జలపుఫ్పం ,,
- బంగ్లాదేశ్‌లో యమ గిరాకీ
- ఇది భారత్ రివర్స్ ట్రేడ్..
- రెండు నెలల్లో 500 టన్నుల ఎగుమతి
- గుజరాత్ నుంచి రాక
- కోల్‌కతా సే.. రవాణా.
(కోల్‌కతా, ఆంధ్రప్రభ ప్రతినిధి)
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు రావాల్సిన ఇలీష్ చేపలు ఇప్పుడు భారత్ నుంచి అక్కడికి వెళ్తున్నాయి..! పశ్చిమ బెంగాల్ భోజన ప్రియుల నోరూరించే హిల్సా చేపకు బంగ్లాదేశ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా దుర్గాపూజ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతిస్తే.. అక్కడి నుంచి హిల్సా చేపలు భారత్‌కు దిగుమతి అవుతుంటాయి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. భారత్‌లో లభిస్తున్న హిల్సా చేపలను బంగ్లాదేశ్‌కే ఎగుమతి చేస్తున్నారు.
గత రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్‌లోని భారత్–బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులోని పెట్రాపోల్ భూ నౌకాశ్రయం ద్వారా దాదాపు 500 టన్నుల హిల్సా బంగ్లాదేశ్‌కు చేరింది. రానున్న వారాల్లో మరో 150 నుంచి 200 టన్నుల వరకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
గుజరాత్ నుంచే ఎక్కువ సరఫరా
బెంగాలీలో ‘ఇలీష్’గా పిలిచే ఈ చేపలో ఎక్కువ భాగం గుజరాత్ నుంచి వస్తోంది. ముఖ్యంగా భరూచ్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున సరఫరా అవుతోంది. కొంత చేప పశ్చిమ బెంగాల్‌లోని హౌరా చేపల మార్కెట్ మీదుగా కూడా బంగ్లాదేశ్‌కు వెళ్తోంది.
బెంగాల్ ఫిష్ ఇంపోర్టర్స్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అన్వర్ మక్సూద్ మాట్లాడుతూ.. భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు హిల్సా ఎగుమతి కావడం ఇదే తొలిసారని తెలిపారు. ఇది స్వాగతించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
బంగ్లాలో మళ్లీ ఇలీష్‌కు గిరాకీ
బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్, సిల్హెట్ తదితర ప్రాంతాల్లో పూర్తిగా అభివృద్ధి చెందిన గుడ్లు (రో) ఉన్న ఆడ హిల్సాకు మంచి డిమాండ్ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. హిల్సా చేపలోని రోతో అక్కడ ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు.
ఎగుమతి అవుతున్న చేపల్లో రో అధికంగా ఉండటంతో.. వాటిని బంగ్లాదేశ్‌లో వేరు చేసి ప్యాక్ చేస్తున్నారు. అనంతరం కొంత రోను ఇతర మార్కెట్లకు తిరిగి ఎగుమతి చేస్తున్నట్టు వ్యాపారులు తెలిపారు. మిగిలిన చేపలను ఉప్పు వేసి ఎండబెట్టి విక్రయిస్తున్నారు.
పెట్రాపోల్ క్లియరింగ్ ఏజెంట్స్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కార్తీక్ చక్రవర్తి మాట్లాడుతూ.. గతంలో బంగ్లాదేశ్‌లోని పద్మా నది నుంచి వచ్చే హిల్సా కోసం తాము ఎదురుచూసేవాళ్లమని గుర్తుచేశారు. ఇప్పుడు పరిస్థితి మారిందని.. భారత్ నుంచి చేపలు బంగ్లాదేశ్‌కు వెళ్తుండటం, అక్కడి ప్రజలు వాటిని ఇష్టపడుతుండటం సంతోషకరమని చెప్పారు.
ఇది కేవలం చేపల వ్యాపారం కాదు..!
భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు హిల్సా ఎగుమతులు కేవలం వాణిజ్య పరిణామంగా చూడకూడదని సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ప్రదీప్ డే అభిప్రాయపడ్డారు. ఈ చేపకు ఉన్న వినియోగదారుల ప్రాధాన్యం, ఆర్థిక విలువ, ప్రాంతీయ డిమాండ్‌కు ఇది బలమైన సంకేతమని పేర్కొన్నారు.
హిల్సాను అధిక విలువ కలిగిన మత్స్య వనరుగా అభివృద్ధి చేస్తే మత్స్యకారుల జీవనోపాధికి, ఆహార భద్రతకు, దేశీయ వినియోగానికి, ప్రాంతీయ వాణిజ్యానికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌కు హిల్సాతో బలమైన సాంస్కృతిక అనుబంధం ఉంది. కోల్‌కతా, హౌరా కేంద్రంగా ఇప్పటికే విస్తృతమైన చేపల మార్కెటింగ్ వ్యవస్థ ఉంది. ఈ నేపథ్యంలో హిల్సా ఉత్పత్తి, నిల్వ, కోల్డ్ చైన్, ప్రాసెసింగ్, బ్రాండింగ్, ఎగుమతులపై దృష్టి పెడితే కొత్త అవకాశాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బంగ్లా నుంచి అధిక డిమాండ్
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు హిల్సా దిగుమతులు మళ్లీ అనుమతించాలని బెంగాల్ చేపల వ్యాపారులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ క్రమంలో ఫిష్ ఇంపోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం ఆగస్టులో ఢాకా వెళ్లి బంగ్లాదేశ్ వాణిజ్య కార్యదర్శి అతౌర్ రెహ్మాన్ ఖాన్‌ను కలిసింది. హిల్సా ఎగుమతులపై భారత్‌కు ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని సహా పలువురు అధికారులకు కూడా సంఘం లేఖలు రాసింది.
2012 నుంచి ఆంక్షలు
బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు హిల్సా దిగుమతులపై 2012 జూలై నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. 2019లో బంగ్లాదేశ్ ప్రభుత్వం దుర్గాపూజ సందర్భంగా మాత్రమే పరిమిత కాలానికి హిల్సా ఎగుమతులకు అనుమతి ఇవ్వడం ప్రారంభించింది. ఈ స్వల్ప వ్యవధి వల్ల ఆశించిన స్థాయిలో చేపల దిగుమతులు జరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఉదాహరణకు.. 2024 సెప్టెంబరులో 2,420 మెట్రిక్ టన్నుల హిల్సా దిగుమతికి అనుమతి ఇచ్చినా.. వాస్తవంగా భారత్‌కు వచ్చినది కేవలం 577 టన్నులు మాత్రమే. 2025 సెప్టెంబరులో 1,200 టన్నులకు అనుమతి లభించగా.. కేవలం 150 టన్నులు మాత్రమే దిగుమతి అయ్యాయి. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చే హిల్సాపై ఆంక్షలు కొనసాగుతున్న సమయంలోనే.. భారత్‌లో దొరుకుతున్న హిల్సా అక్కడి మార్కెట్లను చేరుతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు పద్మా నది ఇలీష్ కోసం భారత్ ఎదురుచూసేది.. ఇప్పుడు భారత్ హిల్సా కోసం బంగ్లాదేశ్ మార్కెట్ ఎదురుచూస్తోంది.
