4thJan2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

4thJan2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

4thJan2026 ఈ సంచికలో…

1.ముఖపత్ర కథనం –
2..మనసు-మాట శీర్షిక
3.మంచిపనికి ప్రతిఫలం (కథ)
4.కబుర్లు – శీర్షిక
5.భూమి గుండ్రన (కథ)

  1. సన్నిహితం… శీర్షిక
  2. మెదడుకు మేత-సామెత.. శీర్షిక
  3. వినరో భాగ్యము – శీర్షిక

4thJan2026

1 ముఖపత్ర కథనం

4thJan2026 | తండ్రీ-కొడుకులు..2026 పై ఆశలు

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒక్కో సంవత్సరం ఒక్కోలా ఉంటుంది. ఒక సంవత్సరం బాగుంటే.. మరో సంవత్సరం అంతగా కలిసి రాదు. ఇది సామన్యులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా అంతే. కాలానికి అందరూ సమానులే.. ఇక అసలు విషయానికి వస్తే.. కొత్త సంవత్సరం వచ్చింది.. ఈ న్యూయర్ లో.. ఇండస్ట్రీలో.. తండ్రీకొడుకులు సక్సెస్ సాధించాలని తపిస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే.. 2026 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ఎప్పుడెప్పుడు 2026 వస్తుందా అని ఆతృతగా ఎదురు చూసారు.. ఇప్పుడు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ.. 2026 పై ఆశలు పెట్టుకున్న తండ్రీకొడుకులు ఎవరెవరు..?

4thJan2026 | అందుకే.. విశ్వంభర వెనక్కి.. వరప్రసాద్ ముందుకు..


4thJan2026
4thJan2026

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌..ఈ ఇద్దరూ కూడా ఈ ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భోళా శంకర్ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత చిరంజీవి నటించిన మూవీ విశ్వంభర. మల్లిడి వశిష్ట్ తెరకెక్కించిన ఆ సినిమా రిలీజ్ కావాలి. అయితే.. ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. విజువల్స్ లో క్వాలిటీ కనిపించలేదనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో లేట్ అయినా సరే.. లేటెస్ట్ గా రావాలని ఆ సినిమాని ప్రస్తుతానికి పక్కనపెట్టి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీని లైన్ లోకి తీసుకువచ్చారు మెగాస్టార్. సక్సెస్ కోసం ఫెయిల్యూర్ అంటే తెలియని అనిల్ రావిపూడిని ఎంచుకున్నారు. చిరు, అనిల్ చేసిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా జనవరి 12న రాబోతుంది. ఈ సినిమా సక్సెస్ మెగాస్టార్ కి చాలా అవసరం.

4thJan2026 | పెద్ద విజయం కోసం పెద్ది..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత సంవత్సరం గేమ్ ఛేంజర్ అనే సినిమా చేయడం.. అది కూడా కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కించడం.. దిల్ రాజు భారీగా నిర్మించడం.. దీంతో ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను గేమ్ ఛేంజర్ ఏమాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. ఇప్పుడు ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో చరణ్ చేస్తున్న మూవీ పెద్ది. దీనికి బుచ్చిబాబు సానా డైరెక్టర్. ఈ సినిమాలో చరణ్‌ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుండడం విశేషం. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన చికిరి సాంగ్ ట్రెండింగ్ లో నిలిచింది. సినిమా పై అంచనాలు పెంచేసింది. ఈ మూవీ సక్సెస్ చరణ్ కు కీలకం.

4thJan2026 | అందుకే బాలయ్య కథ మార్చారా..


4thJan2026
4thJan2026

బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. కెరీర్ లో ఎప్పుడూ లేనంత దూకుడు చూపిస్తున్నారు. అయితే.. రీసెంట్ గా ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో చేసిన అఖండ 2 అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బాలయ్య ఇప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాలి అనుకుంటున్నారు. మలినేని గోపీచంద్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాని ఇటీవల అనౌన్స్ చేయడం… ప్రారంభించడం జరిగింది. అయితే.. ఇది హిస్టారికల్ మూవీ. పైగా భారీ బడ్జెట్ అవుతుందట. ఏం జరిగిందో ఏమో కానీ.. ఇప్పుడు ఈ కథను పక్కనపెట్టి మరో కథతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో బాలయ్య మళ్లీ బ్లాక్ బస్టర్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారని సమాచారం.

4thJan2026 | మోక్షజ్ఞ ఎంట్రీ..


నందమూరి అందగాడు బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. సెట్స్ పైకి రాలేదు. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమాని ప్రకటించారు. ఇక సెట్స్ పైకి వెళుతుంది అనుకునేలోపు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇయర్ లో బాలయ్య తన వారసుడ్ని పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారట. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మూవీతో మోక్షజ్ఞను పరిచయం చేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను ముందుగా బాలయ్య డైరెక్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు క్రిష్ చేతిలో పెట్టారని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. అందుచేత ఈ ఇయర్ బాలయ్యకు చాలా కీలకం.

4thJan2026 | నాగ్ 100..


టాలీవుడ్ కింగ్ నాగార్జున 1986లో విక్రమ్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేశారు. ఈ నలభై సంవత్సరాల్లో 99 సినిమాలు పూర్తి చేశారు. ఇప్పుడు 100వ సినిమా చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్ లో ఈ క్రేజీ మూవీ రూపొందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల మైసూర్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో కేరళలో కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కెరీర్ లో మైలురాయిలా నిలిచే ఈ సినిమా సక్సెస్ కోసం నాగ్ తపిస్తున్నారు. అందుచేత 2026 పై నాగ్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

4thJan2026 | అఖిల్ లెనిన్..


4thJan2026
4thJan2026

అక్కినేని అఖిల్.. తొలి సినిమాతోనే సక్సెస్ సాధిస్తాడు అనుకుంటే.. తొలి విజయం కోసం నాలుగవ సినిమా వరకు వెయిట్ చేయాల్సివచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత బ్లాక్ బస్టర్ సాధించాలని ఏజెంట్ మూవీ చేసాడు. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. ఆతర్వాత చాలా కథలు విని ఫైనల్ గా లెనిన్ కథతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 5న లెనిన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత అఖిల్ వస్తున్నాడు. దీంతో ఎలాగైనా సరే.. బ్లాక్ బస్టర్ సాధించాలని కసితో వర్క్ చేస్తున్నాడు. సో.. ఈ ఇయర్ అఖిల్ కి చాలా ఇంపార్టెంట్. సో.. తండ్రీకొడుకులు చిరు – చరణ్‌, బాలయ్య – మోక్షజ్ఞ, నాగ్ – అఖిల్..కు 2026 చాలా ముఖ్యం. మరి.. ఈ తండ్రీకొడుకులకు 2026 ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.


2 మనసు-మాట శీర్షిక

ఆంధ్ర ప్రభ పాఠకులందరికి మనసు -మాట తరపున ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ప్రతి సంవత్సరం, జనవరి 1వ తేదీన, మనలో చాలా మంది మన జీవితాన్ని మెరుగుపరచుకోవడం కోసం నూతన తీర్మానాలు(Resolutions) చేసుకుంటాము. కానీ, ఈ తీర్మానాలు నిజంగా నెరవేరుతాయా? మనం నిజంగా వాటిని సంవత్సరమంతా పాటించగల్గుతామా లేదా అవి ఒక ఆశగా, ఆలోచనగానే మిగిలిపోతాయా?

తీర్మానాలు అన్నవి ఒక కల/స్వప్నం వంటివి. మన జీవితం మెరుగుపడాలంటే ఈ కల నిజమవ్వాలన్న కోరిక ఉంటుంది మనందిరికి. అందుకోసమే తీర్మానాలు చేసుకుంటాము. ఐతే మరి ఈ కల నిజమవ్వాలంటే మనము తీర్మానాన్ని లక్ష్యంగా మార్చుకోవాలి.

తీర్మానం మరియు లక్ష్యం రెండూ మన జీవితంలో మెరుగుదలకు సంబంధించినవే, కానీ వాటి మధ్య కొంత తేడా వుంది.

  • తీర్మానం ఉదాహరణ: “ఈ సంవత్సరం నేను బరువు తగ్గాలి”
  • లక్ష్యంకి ఉదాహరణ: “నేను ఈ సంవత్సరం 10 కిలోల బరువు తగ్గిస్తాను, దానికి నెలకు 1 కిలో తగ్గిస్తాను”

తీర్మానం అనేది ఒక నిర్ణయం, అయితే లక్ష్యం అనేది ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించడానికి ఒక ప్రణాళిక. పైన ఇచ్చిన ఉదాహరణలో మీకు ఆ ప్రణాళిక కనిపిచ్చిందా?

మనమందరము చినప్పటి నుంచీ ఏక కోణం లక్ష్యాలు (uni-dimensional goals) మాత్రమే నిర్ణయించుకున్నాము. ఉదాహరణకి: విద్యార్థులకి విద్య మాత్రమే లక్ష్యము, వృత్తి లో వున్నవారికి వృత్తి మాత్రమే లక్ష్యము, గృహస్థులకు ఆర్ధిక స్థిరత్వం మాత్రమే లక్ష్యము, అనారోగ్యంతో బాధ పడ్తున్నవారికి ఆరోగ్యం మాత్రమే లక్ష్యము. వీటినే ఏక కోన లక్ష్యాలంటారు. కానీ మన జీవిత సమతుల్యాణికి, పురోగతికి, ఆనందానికి బహుదిశ లక్ష్యాలు ( multi-dimensional goals) నిర్దేశించుకోవడం అవసరం.

ఆరోగ్యం మరియు శ్రేయస్సు:

  • రోజూ వ్యాయామం చేయడం
  • సంతులిత ఆహారం తీసుకోవడం
  • తగినంత నిద్ర పొందడం
  1. వ్యక్తిగత వృద్ధి:
  • కొత్త నైపుణ్యం నేర్చుకోవడం
  • పుస్తకాలు చదవడం
  • మనోనిగ్రహం అభ్యసించడం
  1. సంబంధాలు:
  • కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడపడం
  • కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడం
  • కొత్త వ్యక్తులను కలవడం
  1. వృత్తి మరియు ఆర్థికం:
  • కొత్త ఉద్యోగం వెతకడం
  • ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం
  • నైపుణ్యాలను మెరుగుపరచడం
  1. అలవాట్లు:
  • ధూమపానం మానేయడం
  • మద్యపానం మానేయడం
  • స్క్రీన్ టైమ్ తగ్గించడం

ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మీరు మీ జీవితంలో ఏ కోణం మెరుగుపరచాలనుకుంటున్నారో దానిపైన దృష్టి పెట్టండి!

లక్ష్య సాధన ప్రణాళిక: మనం తీసుకునే ప్రతీ తీర్మానాన్ని లక్ష్యం క్రింద మార్చుకోవాలి. ప్రతీ లక్ష్యానికి SMART(స్మార్ట్) సూచికలు ఉండేలా చూసుకోవాలి, అంటే:

  1. SMART : S-Specific-నిర్దిష్టమైన

M-Measurable-కొలవదగిన,

A-Achievable-సాధించదగిన

R-Relevant- ప్రస్తుత జీవిత పరిస్థితుతలకు సంబంధిత,

T-Time bound – సమయ బద్ధమైన లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి.

2 బాహ్య ఒత్తిళ్లకు బదులు వ్యక్తిగత కారణాలపై దృష్టి పెట్టండి.

3 పెద్ద లక్ష్యాలను నిర్వహించదగిన భాగాలుగా విభజించండి.

  1. ఎదురుదెబ్బులను నేర్చుకునే అవకాశాలుగా పరిగణించండి.

5 స్నేహితులు లేదా మెంటర్‌తో లక్ష్యాలను పంచుకోండి.
ఎప్పుడైనా ఇది గమనించారా?కొంతమంది లక్ష్యాలను చేదిస్తూనే వుంటారు. అసలు లక్ష్యం సాధించే వారి మైండ్సెట్ ఎలా ఉంటుంది?
లక్ష్యం సాధించే వారు ఇంటర్నల్ లోకస్ అఫ్ కంట్రోల్ (Internal Locus of Control (ILC)) కలిగి వుంటారు.

*ఇంటర్నల్ లోకస్ అఫ్ కంట్రోల్ ( Internal Locus of Control (ILC)) ఉన్న వారు ఎలా ప్రవర్తిస్తారు:

  • తమ జీవితంలోని సంఘటనలకు తామే బాధ్యులని భావిస్తారు.
  • తమ విజయాలు మరియు వైఫల్యాలకు తామే కారణమని నమ్ముతారు.
  • లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో మరియు సాధించడంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు.
  • ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.
  • తమ తప్పులను ఎక్కువ విశ్లేషించి, దిగులుచెందరు. అనుక్షణం తప్పులనించి నేర్చుకుంటూ, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు కొనసాగుతుంటారు.
    మరి ఈ కొత్త సంవత్సరంలో మీరు తీర్మానాలను SMART లక్ష్యాలుగా మార్చుకొని, లక్ష్య సాధనకు కావాల్సిన ILC మైండ్సెట్ని పెంపొందించుకొని మీ లక్ష్యాల దిశగా ప్రయాణం మొదలుబెట్టి వాటిని చేదించాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చేవారం మనసు మాటలో కలుసుకొందాము.


3 మంచిపనికి ప్రతిఫలం(కథ)

నరహరిపురంలోని శరభయ్య చాలా పేదవాడు . అతడు కూలి పని చేసి బ్రతుకుతున్నప్పటికినీ చాలా ధైర్యం కలవాడు. ఒకసారి ఆ ఊరికి ఒక యోగిపుంగవుడు వచ్చి ఆ గ్రామ ప్రజలకు ధర్మాన్ని గురించి ఉపదేశించాడు . తర్వాత అతడు ఇతరులకు కానీ, గ్రామాలకు కానీ అందరూ మంచి పని చేయాలని చెబుతూ, మంచి పని చేస్తే తప్పకుండా ఫలితం కనబడుతుందని అన్నాడు. అతని బోధనలను శరభయ్య కూడా విన్నాడు .


ఒకరోజు శరభయ్య పొరుగు గ్రామానికి పని కొరకు వెళ్లి అక్కడ తెల్లవారకముందే దారిలో నడుస్తున్నాడు. ఇంతలో ఆ దారిలో “దొంగ . దొంగ . పట్టుకోండి!” అన్న రక్షకభటుల మాటలు వినిపించాయి . వెంటనే శరభయ్య ధైర్యంతో తన ఎదురుగా వస్తున్న దొంగను పట్టుకున్నాడు. ఆ దొంగ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ శరభయ్యను గట్టిగా కొట్టి గాయపరిచాడు. అయినా శరభయ్య అతని దెబ్బలను సహించాడు తప్ప ఆ దొంగను మాత్రం వదలలేదు. ఇంతలో రక్షకభటులు సమీపించి ఆ దొంగను పట్టుకొని వెళ్లిపోయారు.


శరభయ్యకు తీవ్ర గాయాలు కావడం వల్ల అక్కడే కొద్దిసేపు కూర్చున్నాడు . ఈ గ్రామంలో అతనికి ఎవరూ తెలియదు. అతడే అక్కడి ప్రజలను అడిగి ఆ గ్రామంలో ఉన్న వైద్యుని వద్దకు ఒంటరిగా వెళ్లి తన గాయాలకు చికిత్స చేయమన్నాడు. వైద్యుడు అతనికి విశ్రాంతి అవసరమని చెబుతూ అక్కడే ఉండమని అతనికి వైద్యం చేశాడు. శరభయ్య తాను తర్వాత అతని ఫీజును ఇస్తానని చెప్పాడు . ఫరవాలేదన్నాడు వైద్యుడు.


ఇంతలో తెల్లవారింది . అక్కడికి వచ్చిన ప్రజలు ఈ శరభయ్యను చూసి అతని ధైర్యాన్ని వేనోళ్ల పొగిడారు. ఆ దొంగ చాలా గజదొంగనీ, తమకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడని వారు అన్నారు. ఇలా చాలామంది ప్రజలు ఆ దొంగ దొరికిన సంగతిని విని ఈ వైద్యుని ఇంటికి వచ్చి దొంగను పట్టుకున్న శరభయ్యను పరామర్శించి వెళ్ళసాగారు . అప్పుడు శరభయ్య “అయ్యో! నేను చాలా పేదవాడిని కదా! నేను చేసిన మంచి పనికి వట్టి పరామర్శలు తప్ప ఒక్కరూ నాకు ఆర్థిక సాయం చేయడంలేదే ! ఆ యోగిపుంగవుడు తన బోధనలతో ఎవరైనాగానీ మంచి పని చేస్తే తగిన ఫలితం ఉంటుందని చెప్పాడే! ఆ ఫలితం నాకు ఏమీ కనబడడం లేదే!” అని చింతించసాగాడు.


ఇంతలో ఆ గ్రామ పెద్ద అక్కడికి వచ్చి శరభయ్యను చూసి ” ఏమయ్యా! నీకు ఎలా ఉంది? నీవు ఆ దొంగను నీ ప్రాణాలకు తెగించి పట్టుకొని మా గ్రామానికి గొప్ప మేలు చేశావు. నీవు చాలా ధైర్యస్థుని వలె కనిపిస్తున్నావు. మా ఊరిలో ఒక రక్షక భటుని కొలువు ఖాళీగా ఉంది. ఆ ఉద్యోగం నీకు ఇస్తాము. నీవు చేస్తావా!” అని అడిగాడు . ఆ మాటలను విన్న శరభయ్య సంతోషంతో ఎగిరి గంతేసి “చేస్తానండి” అని అన్నాడు. అప్పుడు గ్రామపెద్ద ” అయితే నీ గాయాలు మానిన తర్వాత ఈ కొలువులో చేరు “అని చెప్పి ఆ వైద్య ఖర్చులు తానే భరిస్తానని ఆ వైద్యునితో చెప్పి వెళ్లిపోయాడు.
అప్పుడు శరభయ్య సంతోషించి ” ఆహా! ఆ యోగిపుంగవుని మాటలు నిజమయ్యాయి .

నా వైద్య ఖర్చులకు ఎవ్వరు సాయం చేయలేదని నేను తొందరపడి చింతించాను. నేను తాత్కాలిక లాభాన్ని మాత్రమే ఆశించాను . కానీ నాకు శాశ్వతంగా లాభించే ఉద్యోగం దొరికింది. అందుకే మంచిపనికి ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. ఇక నేను రోజూ పని కొరకు వెతికే అవసరం లేదు “అని అనుకొని ఆ రోజు నుండి ఇతరులకు మంచిపనులే చేయాలని నిర్ణయించుకున్నాడు.


4 కబుర్లు (శీర్షిక)

DEC 2025

ఆయాచిత వరాలను వృథా చేయద్దు!

ఒక ఆసామికి సుస్తీ చేసింది. ఆసుపత్రికి పోతూ దారిలో జారిపడ్డాడు. వళ్ళంతా గాయాలయ్యాయి. డాక్టరుగారు జ్వరానికి ఓ ద్రావకం, గాయాలు మాయాడానికి మరో రకం ద్రావకం రాసిచ్చి వాడమన్నారు. ఆ ఎతిమతం మనిషి వైద్యుడు చెప్పింది సరిగ్గా అర్థం చేసుకోలేదు. జ్వరం మందు గాయాలకు, గాయాల మందు జ్వరానికి వాడాడు. అటు జ్వరమూ తగ్గలేదు.. ఇటు గాయాలూ మాయలేదు!

ఆ అయోమయం మనిషికి మనమూ ఏమాత్రం తీసిపోలేదు.

సుఖంగా బతకమని దేవుడు ప్రసాదించిన రెండు వరాలను దుర్వినియోగం చేస్తున్నాం. మానసిక ప్రశాంతత కోసం అబ్బిన ఆధ్యాత్మికతను మతాలకు ఆపాదించి దేవుడి పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నాం. సౌకర్యవంతంగా జీవించడం కోసం పరిమితంగా వాడవలసిన డబ్బూ దస్కం మతి మీరి సంపాదించాలనే యావలో పడి కొట్టుకుపోతున్నాం. దురాశ వల్ల జీవితాన్ని దుఃఖభాజనం చేసుకుంటున్నాం.

ఆయాచితంగా దక్కిన రెండు వరాలను ఉద్దేశించిన కార్యాలకు సద్వినియోగం చేసుకుంటే మానవ జన్మకు మనం సార్ధకత చేకూర్చినట్లే!

_____________________________________

5 భూమి గుండ్రన (కథ)

బాబూ,
ఎలా వున్నావు. అందరూ బాగున్నారా. ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తున్నావా. కోడలు ఎలా వుంది. పిల్లలు బాగున్నారా. ఇక్కడ కాలంతో పాటు మీ అమ్మ, నేను ప్రయాణిస్తూ వున్నాంరా. మీ క్షేమ సమాచారాలు తెలుసుకోవాలనే ఆశతో ఉన్నాం. మీతో ఫోనులో మాట్లాడినంత సేవు ఏదో కోల్పోయిన భావన వెంటాడుతోందిరా. అందుకే మనను విప్పి కాసేవు సేదదీరాలనే ఈ ఉత్తరం రాస్తున్నానురా.

‘బాబూ, ఒకరోజు గుర్తుందా. నీవు అన్నం తినకుండా మారాం చేస్తే మీ అమ్మ బతిమాలి, బతిమాలి చివరకు రెండు బాది అన్నం తినిపించింది. నువ్వు చాలా సేవు ఏడ్చి ఏడ్చి కో పoగా చూస్తూ, పెద్దయ్యాక నేను నిన్ను ఏడిపిస్తా చూడు అని రోషంగా అంటే నీ మాటలకు అమ్మ నవ్వు ఆపుకోలేక పోయిందట. తర్వాత నువ్వు ఏడుస్తూ నిద్ర పోయాక, అయ్యో పావిష్టిదాన్ని వాణ్ని ఈ చేతులతో కొట్టాను అని అమ్మ ఏడ్చిందటరా. అంతేకాదు. నా పాపానికి ఈ రోజు శిక్ష పడాల్సిందే అని ఆరోజు అన్నం తినకుండా పడుకుందిరా పాపo. మీ అమ్మ పిచ్చిదిరా. కాని నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావురా పెద్ద అయ్యాక. మీ అమ్మ నిన్ను తలుచుకొని ఏడ వని రోజు లేదురా. ఇప్పుడు కూడా ఓక్కసారి నిన్ను చూడాలని మీ అమ్మ పరితపిస్తోందిరా.

మరొక విషయం. నీచదువు కోసం అయిన అప్పులన్నీ ఇల్లు అమ్మి తీర్చాం గదరా. ఆ తర్వాత మేము ఈ ఆశ్రమంలో చేరాల్సి వచ్చింది. దానితో మన బంధువులంతా చిన్న చూపు చూస్తున్నారురా. పెళ్లిళ్ల కు పేరంటాలకు కూడా పిలవటం మానివేశారురా. తలుచుకుంటేనే చాలా బాధగా వుందిరా.

‘ఇల్లు పొలాలు అమ్ముకుని మరీ చదివించకపోతే ఏమో, మరీ అతిగా వుంది అని అందరూ హేళన చేశారు. కాని నీవు ఇంజనీరు అయ్యావన్న ఆనందం ముందు ఇవన్నీ చాలా తక్కువేరా. దాని గురించి ఆలోచించటం లేదురా ఇలా రాస్తున్నానని ఏమీ అనుకోకు, సంవత్సరానికోసారైనా వచ్చి కనవడి పొoడిరా అది చాలు ఈ జీవితానికి. మీ అమ్మకన్నీళ్లను, నాలో పేరుకపోయిన అవేదనతో కలిపి మా భావాల ను ఇలా వ్యక్తం చేస్తున్నానురా. ఏమీ అనుకోకు, కోడలిని, పిల్లలను అడిగానని చెప్పు. ఉంటానురా.

మీనాన్న, వంధామయ్య.

నాన్నా,

మీ ఉత్తరం చదివాను. మీ భావాలు తెలిశాయి. మీ ఉత్తరానికి బదులుగా ఉత్తరమే రాయాలనిపిం చింది. ఉత్తరమే మనసులో మాట అర్థమయ్యేలా అలోచింవచేస్తుంది. అందుకే రాస్తున్నాను.

మీరు మమ్మల్ని చూడాలనుకున్నట్టే, మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. కానీ ఇక్కడి పరిస్థితుల వల్ల రాలేక ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నాం. నాకు సెలవు దొరికితే, మీ కోడలుకు కుదరదు. ఆమెకు కుదిరిన పుడు పిల్లలకు న్కూలులో సెలవలు దొరకవు. ఎం చెయ్యను. మిమ్మల్ని నాతోనే వుం చుకోవాలని వుంది. కాని ఈ పరుగు ప్రయాణంలో మీరు ఇమడలేరు. మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్లి వచ్చాక, మీ గురించి పట్టించుకునే సమయం ఉండదు. అలసిపోయి వస్తాం. మీరుoటే ఇంకా మీ పై భారం వేయాల్సి పస్తుందేమో అనిపిస్తుంది నాన్నా నాకు.

మీరు కోరుకున్న జీవితం ఇది. ఇంట్లో ఉండి సరిగా చదవటం లేదని, ప్రభుత్వ పాఠశాలలో ఎదుగుద ల సరిగా వుండదని మీరు భావించి కార్పోరేటు స్కూలులో చేర్చించారుగదా. ఆస్తులన్నీ పోయినా సరే ఇం జనీరు కావాలని, అమెరికా వెళ్లాలని మీరు కలలు కన్నారు కదా నాన్నా. మీ కలలు సాకారం చేశాను. ఇప్పుడు ఈ పరుగుల చట్రంలో బిగినుకుపోయిన నేను ఎలా బయటకు రాగలను.

మీరు అనేవారు గుర్తుందా, కన్నతల్లిని పుట్టినగడ్డను మరువకూడదు అని. అందుకే మిమ్మల్ని ఆ గడ్డనుంచి వేరుచేయడం ఇష్టంలేక అక్కడే వుంచి ఆశ్రమంలో చేర్చించానుగదా నాన్నా, ఆశ్రమం వారికి నెలనెలా డబ్బు పoపిస్తునే వున్నాను.

నాన్నా నీ మనుమడు, మనుమరాలు బాగానే వున్నారు. మీ ఫోటోలు చూపిస్తూ అప్పుడప్పుడు వారికి గుర్తు చేస్తున్నాము. వాళ్లను మంచి న్కూలులో చేర్చించాము. ఇక్కడ ప్రపంచంతో పోటీవడుతూ డొనేషన్లు లక్షలు పోసి కాలేజీల్లో చేర్పిస్తున్నాం. ఎక్కడ వెనుక పడిపోతామోనని అభద్రతా భావంతో తల్లితండ్రులు భయపడడం తరతరాలుగా జరుగుతూనేవుంది గదా. కార్పోరేటు సంస్థలు దానిని వారికి అనుకూలంగా మార్చుకుంటూ విద్యావ్యవస్థను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. కాలానికి తగ్గట్టు వేగంపెంచుకోక పోతే మనం వెనుకపడిపోతాం గదా నాన్నా.

బంధువులు పిలపటం లేదని బాధపడుతున్నారు గదా నాన్నా. స్కూలులో చేరినప్పటి నుండి హాస్టలులో పెరిగిన నాకు బంధువులు, బంధాలు ఏమి తెలుస్తాయి నాన్నా.

అన్నట్టు మీకో ముఖ్య విషయం చెప్పటం మర్చిపోయాను నాన్నా..

ఒకరోజు పిల్లలిద్దరూ కొట్లాడుకుంటూ

ఇండియాలోనే నేను స్థిరపడతాను అన్నాడు మీ మనుమడు. కానీ మీ మనవరాలు నేను అమెరికాలో నే స్థిరపడతానని చె చెప్తోoది. నేనూరుకోక మరి మా పరిస్థితి ఏంటి అని అడిగా నవ్వుతూ.

దానికి వారి సమాధానం ఏంటో తెలుసా నాన్నా

పాపాయి, డాడీ మీకు లక్షలు ఖర్చుపెట్టి మంచి హాస్టలులో చేరుస్తానన్నది. కానీ వాడు ఏమన్నాడో తెలుసా

నీకు కోట్లు ఖర్చుపెట్టి మంచి ఎసి ఆశ్రమంలో చేరుస్తాం అన్నాడు నాన్నా.

పైకి నవ్వినా నా కళ్లలోనీళ్లు సుళ్లు తిరిగాయి నాన్నా. అప్పు డనిపించింది భూమి గుండ్రంగా వుటుందని.

కాలంతో పాటు అందరూ ప్రయాణించవలసినదే గదా నాన్నా. అదే పరిష్కారం దిశగా మనల్ని

నడిపిస్తుంది గదా. అందుకే నేను పరిష్కారం వెతుక్కునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను.

నమస్కారములతో

అమెరికాలోని మీ కుమారుడు.

ఉత్తరం చదువుతున్న పరంధామయ్య కళ్లనుండి కారుతున్న కన్నీటి బిందువులను తన చేతులతో తుడుస్తోంది పార్వతమ్మ. కదులుతున్న కాలంలో పరిష్కారం కోసం వెతుక్కుంటున్నాడు పరంధామయ్య


6.సన్నిహితంశీర్షిక

DEC 2025

సమస్య అందరికీ సమానమే

ఒక రోజు పొద్దున్నే ఆఫీసుకు రెడీ అవుతుంటే నా ఫోన్ మోగింది . లిఫ్ట్ చేసి ” హలో .. ” అన్నాను దర్పంగా
” సార్ .. నేను ఈ రోజు ఆఫీసుకు రాను సార్ ..” అని చెప్పాడు నా దగ్గర పని చేసే వంశీ అనే కుర్రాడు .
” ఏమైంది .. “
” చిన్న ప్రాబ్లెమ్ ఉంది సార్ ” అని నసుగుతున్నాడు .
” సరే .. ” అని చెప్పి ఫోన్ పెట్టేసి వాడ్ని తిట్టుకోసాగాను . నిన్న రాత్రి ఆఫీసులో బాగా లేట్ అయింది . అప్పుడే అనుకున్నా ఈ రోజు ఏదో సాకు చెప్పి ఎగ్గొడతాడని . అనుకున్నట్టే ఇప్పుడు ఫోన్ చేసాడు పనికి మాలిన వెధవ అని తిట్టుకున్నాను . తర్వాత ఆఫీసుకు వెళ్ళిపోయాను .
పదకొండు గంటల సమయంలో ఏదో కొత్త నెంబర్ నుండి ఫోన్ వచ్చింది నాకు . నేను చిరాగ్గా లిఫ్ట్ చేసి ” హలో .. ” అన్నాను

” డాడీ .. నాకు బాగా కడుపు నొప్పిగా ఉంది .. స్కూల్ కి వచ్చి నన్ను తీసుకు వెళ్ళు ” అని మా అమ్మాయి చెబుతోంది . స్కూల్ స్టేఫ్ లో ఎవరి దగ్గరో మొబైల్ తీసుకుని నాకు కాల్ చేసింది అన్న మాట . నాకు టెన్షన్ మొదలైంది . వెంటనే హడావుడిగా కారు స్టార్ట్ చేసి బయలుదేరాను . స్కూల్ కి వెళ్లి మా అమ్మాయిని కలెక్ట్ చేసుకుని అటునుండి అటే హాస్పిటల్ కు వెళ్లి చూపించాను .

డాక్టర్ మందులు వ్రాసి పంపించాడు . అమ్మాయిని ఇంట్లో డ్రాప్ చేసి ఆఫీసుకు తిరిగి వస్తుండగా నా బాస్ నుండి కాల్ వచ్చింది . ” ఎక్కడున్నావయ్యా ?? సీట్ కి ఎన్ని సార్లు వచ్చినా లేవు ” అని అరుస్తున్నాడు . చిర్రెత్తుకొచ్చింది నాకు . అయినా కంట్రోల్ చేసుకుని ” చిన్న ప్రాబ్లెమ్ అయి బయటకు వెళ్ళాను సార్ .. వస్తున్నా ” అని చెప్పి పెట్టేసాను . ఆఫీసుకు వెళ్ళగానే బాస్ ను కలిసాను .


” ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లెమ్ చెబుతావు ” అని విసుక్కుని ఇంకో పని చెప్పాడు . బాధ పడ్డాను నేను . సీట్ కి వచ్చి పనిలో పడ్డాను .
నా దగ్గర పని చేసే ఇంకో కుర్రాడిని పిలిచి ” వంశీ ఎందుకు ఈ రోజు రాలేదు ? ” అని అడిగాను
” నిన్న రాత్రి బాగా లేట్ అయింది కదా సార్ . బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇంటికి దగ్గర్లో రెండు కుక్కలు అడ్డం పడి వెంబడించాయట సార్ .. ఆ కంగారులో బైక్ స్కిడ్ అయి పడిపోయాడట . చిన్న చిన్న దెబ్బలు తగిలాయట . మెడిసన్స్ వాడుతున్నాడట . రేపు వస్తాను అన్నాడు సార్ ” అని చెప్పాడు కుర్రాడు
” సరే .. ” అని చెప్పి అతన్ని పంపేసాను . తర్వాత ఆలోచనలో పడ్డాను . పొద్దున్న వంశీ ఫోన్ చేస్తే తిట్టుకున్నాను . నా బాస్ కూడా నన్ను తిట్టుకున్నాడు . నాకు కోపం వచ్చింది బాస్ నా సమస్యను అర్థం చేసుకోలేదని . కానీ నేను కూడా వంశీ ప్రాబ్లెమ్ అర్థం చేసుకోలేదు కదా . ప్రతీ వాడికి తనదే పెద్ద సమస్య అని వేరే వాడిది డ్రామా అని అనిపిస్తుంది . కానీ మనసు పెట్టి ఆలోచిస్తే సమస్య ఎవరికైనా సమానమే . కాదంటారా ఫ్రెండ్స్ !!!!


7.మెదడుకు మేతసామెత.. శీర్షిక

ఇంటిపేరు కస్తూరి వారు, ఇల్లు గబ్బిలాల కంపు


“వాటీజ్ ఎ నేం ?” అన్నారు ప్రసిద్ధ ఆంగ్ల నాటక రచయిత విలియం షేక్స్ పియర్. తన రోమియో అండ్ జూలియట్ నాటకంలో. పేరుకు, గుణానికి వ్యక్తిత్వానికి సంబంధం ఉండదని ఈ సామెత సూచిస్తుంది. దీన్ని గురజాడ అప్పారావు గారు, గిరీశం చేత పేరులోన నేమి పెన్నిధి యున్నది?” అని చెప్పించారు. జూలియట్ ఇలా అంటుంది. “రోజా పువ్వును ఏ పేరు పెట్టి పిలిచినా, దాని సౌరభం, సౌందర్యం అదే.” పేరనేది కేవలం ఒక పదం మాత్రమే. అది ఆ పేరు గల వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని ప్రతిబింబించకపోవచ్చు అని జూలియట్ అభిప్రాయం.

ఈ సామెతలో విరోధాభాసాలంకారం ఉంది. గమనించారా? కస్తూరి ఒక సుగంధ ద్రవ్యం. దాన్ని సంస్కృతంలో “మృగనాభి” అంటారు. మగ కస్తూరి జింక(మస్క్ డీర్) గ్రంధుల నుండి లభిస్తుంది. తులం ఖరీదు వేలల్లో ఉంటుంది. దాని సుగంధ పరిమళం హాయిగా, చల్లగా ఉంటుంది. దీన్ని గంధం, అత్తరులో కలిపి వాడుతారు.

ఇక గబ్బిలం అనేది ఒక పక్షిలా ఉంటుంది కానీ పక్షి కాదు. అది క్షీరదం. తన పిల్లలకు పాలిచ్చి పెంచుతుంది. ఇవి చెట్టు కొమ్మలకు తల క్రిందులుగా వేలాడతాయి. పాడు పడిన ఇండ్లలో నివసిస్తాయి. అవి దుర్గంధాన్ని వెదజల్లవు కానీ, అవి ఉన్న ప్రాంతాలు దుర్గంధ పూరితంగా ఉంటాయి. ఇంటి పేరు కస్తూరి వారు అంటే పరిశుభ్రంగా, మంచి సువాసనలు వెదజల్లుతూ ఉండాలి కానీ, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే “గబ్బిలాల కంపు” కొడుతుంది, సో, ఇంటి పేరుకు, ఇంట్లో పరిస్థితికి సంబంధం లేదు.

మా ఊర్లో భీమసేనయ్య అని ఒకాయన ఉండేవాడు. కరణీకం చేసేవాడు. పేరును బట్టి మోసపోకండి. అచ్చు బాపుగారి కార్టూన్ లలో ‘బక్కభర్త ‘ లాగ అ ఉండేవారు. పెద్దగా గాలివీస్తే ఎగిరి పోతాడేమో అని భయం వేసేది. మా కొలీగ్ ఒకాయన వామన రావుగారని, బాటనీ లెక్చరర్. ఆయన పొట్టివాడనుకునేరు. ఆరడుగుల రెండంగుళాల ఆజానుబాహుడు. మన్మధ రావని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఐదు జిల్లాలకు అందగాడు అయి ఉండాలని లేదు.

నేను ఇంటర్ బోర్డులో డిప్యూటీ సెక్రెటరీగా, రీడర్ గా చేసే సమయంలో, ప్రక్కన కమీషనరేట్ లో ‘ పెంటయ్య ‘ అనే చాకు లాంటి కుర్రాడు ఉండేవాడు. ఇంటర్ విద్యా కమీషనర్ గా ఏ ఐఏఎస్ అధికారి వచ్చినా, అతడే పి.ఏ. చాలా చాకచక్యంగా వ్యవహరించేవాడు. నన్ను “దత్తన్నా’ అని పిల్చేవాడు. పేరుకూ ప్రతిభకూ ఏం సంబంధం చెప్పండి.

మేం నర్సీపట్నంలో పనిచేస్తున్నప్పుడు ఒక పనమ్మాయి ఉండేది మాకు. నల్లగా, సన్నగా, పళ్ళెత్తుగా ముఖాన స్ఫోటకం మచ్చలతో ఉండేది. కానీ చాలా మంచిది, నెమ్మది. ఆ అమ్మాయికి అందగాడైన భర్త దొరికాడు. అతని పేరు తాతయ్యలు. ఆ పిల్ల పేరు తెలుసాండీ? అపరంజి. ఇలా పేరు పాజిటివ్ గా, పరిస్థితి నెగిటివ్ గా, లేదా పేరు నెగిటివ్ గా, పరిస్థితి పాజిటివ్ గా ఉండే ఉదాహరణలు ఎన్నో.

అప్పియరెన్స్ ఆర్ డిసెప్టివ్., మెరిసేదంతా మేలిమి కాదు, లాంటి సామెతలు ఈ సామెతకు సోదరీమణులేనండీ! కౌశిక మహర్షికి ధర్మ సూక్ష్మాలు బోధించిన గురువు ధర్మవ్యాధుడు. ఆయన వృత్తి మాంసం దుకాణం నడపడం. ఆముక్త మాల్యద కావ్యంలో రాయల వారు సృష్టించిన పాత్ర. “మాల దాసరి” ని మించిన భాగవతోత్తముడెవరుంటారు?

ఈమధ్య సృజనాత్మకతలు ముదిరి పోయి, పిల్లలకు వినూత్నంగా ఉండాలనే మోజులో విచిత్రమైన పేర్లు పెడుతున్నారు. అదేమిటో? “త్రిష” అంటే అర్థం ఏమిటో నాకు తెలియదు. అట్లే, “అనుష్క” అంటే కూడా! అప్పట్లో సూర్యకాంతం అనేపేరు అమ్మాయిలకు పెట్టేవారు కాదు. సూర్యకాంతమ్మగారు తెర మీదే గయ్యాళి కాని, నిజ జీవితంలో చల్లని తల్లి. అన్నపూర్ణమ్మ! మా మనవడి ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడి పేరు “పూర్వీక్” అట! పూర్వీకుల పేరేదైనా సరే గానీ, పూర్వీక్ అని పెట్టడం ఏమిటి? శ్రీకాకుళం జిల్లాలో దుర్యోధన అని పెట్టుకుంటారు.!

చక్కగా దేవుళ్ళు, దేవతల పేర్లు మనకెన్నో ఉన్నాయి. అష్టోత్తర శతనామాలు వెతికితే దొరుకుతాయి. పలాసలో నేను లెక్చరర్ గా పని చేసేటప్పుడు “పరాజ్ఞ్ముఖి”
అనే అమ్మాయి ఇంటర్ బైపీసీ లో ఉండేది. అమ్మవారి పేరది. ఎంత చక్కని పేరు ! ఇంగ్లీషు వాళ్ళు వృత్తులకు గౌరవం ఇచ్చి గార్డినర్, టైలర్, ఫారెస్టర్, లాంటి పేర్లు పెట్టుకొంటారు. శ్రమశక్తికి వారిచ్చే విలువ అది. ఒక మిత్రుడు తన మనుమడికి ” నిర్ఘాంత్ ” అని పేరు పెట్టామని చెబితే నిర్ఘాంతపోయాను. ! పేరు ఒక ఐడెంటిటీ. వ్యక్తిత్వం ఒక నొబిలిటీ !
ఇంకో సామెతతో వచ్చేవారం…


8.వినరో భాగ్యము శీర్షిక

DEC 2025

తిరుమల గుడిలో కులశేఖర పడి

తిరుమలేశుని అర్చించి తరించి ఆయన భక్త వాత్సల్యానికి పాత్రులైన వారెందరో తిరుమల క్షేత్ర చరిత్రలో కనిపిస్తారు. అటువంటి వారిలో 9వ శతాబ్దం లో పశ్చిమ సముద్ర తీరప్రాంతంలో చేర రాజకుటుంబానికి చెందిన కులశేఖరుడు ఒకరు.

అనువంశికంగా దక్కిన రాజ్య పాలన చేస్తూనే గొప్ప విష్ణు భక్తుడుగా పేరొందారు. ఒకప్పుడు రామాయణ కథనాన్ని వింటున్నప్పుడు రావణుడు సీతమ్మ కు లంక కు తీసుకువెళ్లాడనే సందర్భంలో వెంటనే తన సైన్యం తో లంక పై దండెత్తడానికి సన్నద్ధం అయ్యారంటే విష్ణు సంబంధ పురాణాలపై ఆయనకు ఉన్న భక్తిప్రపత్తులు అర్ధం అవుతుంది..

ఆ విష్ణుభక్తితోనే రాజ్యాన్ని త్యజించి శ్రీరంగం చేరుకొని వేంకటాచల క్షేత్రం పై 11 పాశురాలను, ముకుందమాల అనే సంస్కృత స్తోత్రాన్ని రచించి కులశేఖరాళ్వార్ గా ప్రసిద్ధి చెందారు. గర్భాలయం గడపగా ఉండి నిత్యం దర్శించుకునే భాగ్యాన్ని కలిగించమని తిరుమలేశుని ప్రార్ధించేవారు. ఆయన కోరికను తిరుమలేశుడు మన్నించాడు.

శిలారూపంలో తిరుమలేశుని గర్భాలయ గడప గా దర్శనమిచ్చే చోటు కులశేఖర పడి (పడి అంటే మెట్టు అనే అర్ధం) అనే పేరుతో ప్రసిద్ధి చెందింది
ఓం నమో వెంకటేశాయ

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

Leave a Reply