44-Wards-Unopposed-Rayachoti : రాయచోటి కూటమిదే,,} Andhra Prabha News
44-Wards-Unopposed-Rayachoti : రాయచోటి కూటమిదే,,} Andhra Prabha News
- మున్సిపల్ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం
- కూటమి ఖాతాలో.. 44 వార్డులు!
- వైసీపీకి ప్రజాదరణ తగ్గింది..
- పోటీకి ఆ పార్టీ నేతలే ముందుకు రాలేదు
- అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
- ఎన్నికల్లో హింసకు తావులేదు..
- అక్రమాలకు అవకాశం ఇవ్వొద్దు
- ఏకగ్రీవాలపై మంత్రి మండిపల్లి ధీమా

(అన్నమయ్య ప్రతినిధి, ఆంధ్రప్రభ)
అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపల్ ఎన్నికల్లో 44 వార్డులూ ఏకగ్రీవం కావడాన్ని కూటమి చారిత్రాత్మక విజయంగా అభివర్ణిస్తూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పించారు. రాయచోటి నియోజకవర్గంలో ఆ పార్టీకి ప్రజాదరణ తగ్గిందని, రెండున్నరేళ్లుగా ప్రజలకు దూరంగా ఉన్న నాయకులు ఎన్నికల వేళ అభ్యర్థులను పోటీకి ప్రోత్సహించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో సోమవారం రాయచోటిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకురాలు అనితా యాదవ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోనమల ఖాదర్ వలితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
పోటీకి ముందుకు రాని వైసీపీ నేతలు!
రాయచోటి మున్సిపాలిటీలో 44 వార్డులు ఉన్నప్పటికీ వైసీపీకి చెందిన కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జులు, మైనారిటీ నాయకులు పోటీకి ముందుకు రాలేదని మంత్రి పేర్కొన్నారు. రెండున్నరేళ్లుగా ప్రజల సమస్యలను పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల సమయంలో పోటీ చేయాలని కోరితే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్లాలని ఆ పార్టీ నాయకులే ప్రశ్నించుకున్నారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థులు పోటీ చేయని వార్డుల్లోనూ పార్టీలకతీతంగా ప్రజలకు అండగా ఉంటామని, పెన్షన్లు, ఇళ్ల మంజూరు, ఇతర సంక్షేమ పథకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాయచోటి నియోజకవర్గానికి తొలిసారిగా మంత్రి పదవి లభించిందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయని తెలిపారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి వెలిగల్లు జలాశయం నుంచి రెండో పైప్లైన్ ఏర్పాటు సహా పలు చర్యలు చేపట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పార్కులు, ఇండోర్ స్టేడియం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపలేదని విమర్శించారు. గత ప్రభుత్వ పాలన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
మాదకద్రవ్యాల ఆరోపణలపై విచారణ జరపాలి
రాయచోటి పరిసర ప్రాంతాల్లో యువతను మాదకద్రవ్యాల బారిన పడేలా చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చైర్మన్ అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని మంత్రి ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల భద్రత విషయంలో ఎస్పీని, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించే అవకాశం ఉందని పేర్కొంటూ, ఆయుధాలు కలిగిన వ్యక్తులను భద్రత కోసం నియమించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని, రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ వంటి అక్రమాలకు తావులేకుండా చూడాలని కోరారు.
ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు జరగాలి
ఎన్నికల్లో ఎక్కడా హింసను ప్రోత్సహించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలకు సైతం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు తాము వ్యవహరించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితులు ఉండాలని, అభివృద్ధి, సంక్షేమమే రాజకీయాలకు ప్రధాన అజెండాగా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
కూటమి శ్రేణులకు అభినందనలు
రాయచోటి మున్సిపాలిటీలో కూటమి జెండా ఎగురవేసేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేశారని మంత్రి అభినందించారు. ఎన్నికల ప్రక్రియలో కూటమి అభ్యర్థుల విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో సహకరించిన తిరుపతికి చెందిన అనితాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
