20 ఏళ్లుగా కదలని 379 కేసులు..

అవినీతి కేసులు విచారణ దశలోనే సంవత్సరాల తరబడి నిలిచిపోవడం దేశ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా మారింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ (సీవీసీ) తాజా నివేదిక ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా వెలుగులోకి తీసుకొచ్చింది. కేసులు ప్రారంభమై దశాబ్దాలైనా అవినీతి కేసులు ఇంకా కోర్టుల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి

సీవీసీ వార్షిక నివేదిక ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు చేసిన 7,072 అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలోనే 379 కేసులు 20 సంవత్సరాలకు పైగా తీర్పు కోసం ఎదురు చూస్తుండటం న్యాయ వ్యవస్థలో జాప్యం ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది.

నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం –

1,506 కేసులు 3 సంవత్సరాల కంటే తక్కువ కాలంగా, 791 కేసులు 3–5 సంవత్సరాలుగా, 2,115 కేసులు 5–10 సంవత్సరాలుగా, 2,281 కేసులు 10–20 సంవత్సరాలుగా నిలిచిపోయాయి. మరో 379 కేసులు 20 సంవత్సరాలకు పైగానే పెండింగ్‌లో ఉన్నాయి.

కేవలం ఈ కేసులే కాకుండా, నిందితులు దాఖలు చేసిన అప్పీళ్లు, సవరణలు కూడా కోర్టుల్లో మిగిలిపోయాయి. ప్రస్తుతం 13,100 అప్పీళ్లు/సవరణలు హైకోర్టులు, సుప్రీంకోర్టులో విచారణ కోసం ఉన్నాయి. వాటిలో కొన్ని అప్పీళ్లు రెండు దశాబ్దాలుగా తీర్పు కోసం ఎదురుచూస్తుండటం గమనార్హం.

Leave a Reply