రూ.425.50 కోట్లతో ఏర్పాటుకు సవరించిన అనుమతులు
- వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల్లో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం..
- మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, అక్టోబర్ 16, ఆంధ్రప్రభ: తెలంగాణలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ఏటీఎస్) ఏర్పాటుకు రూ.425.50 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 50ను అక్టోబర్ 15న జారీ చేసింది.
ఒక్కో స్టేషన్‌కు రూ.11.50 కోట్లు
గతంలో ఒక్కో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్‌కు రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.296 కోట్లకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. తాజాగా ఒక్కో స్టేషన్ వ్యయాన్ని రూ.11.50 కోట్లకు పెంచుతూ సవరించిన అనుమతులు జారీ చేసింది. దీంతో 37 స్టేషన్ల ఏర్పాటుకు మొత్తం రూ.425.50 కోట్ల వ్యయాన్ని ఆమోదించింది.
రెండు దశల్లో ఏర్పాటు
రాష్ట్రంలో ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో 15 స్టేషన్ల నిర్మాణానికి రూ.172.50 కోట్లు కేటాయించారు. అప్పటి జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున, గ్రేటర్ హైదరాబాద్/హెచ్‌ఎండీఏ పరిధిలో అదనంగా నాలుగు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో మిగిలిన 22 స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ దశకు ఒక్కో స్టేషన్‌కు రూ.11.50 కోట్ల చొప్పున మొత్తం రూ.253 కోట్లను కేటాయించారు.
స్వయం ఆర్థిక నమూనాలో ప్రత్యేక సంస్థ
ఈ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ సంస్థ స్వయం ఆర్థిక నమూనాలో పనిచేయనుంది. స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన నిధులను హడ్కో (HUDCO) వంటి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించనున్నారు. వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు సంబంధించి వసూలు చేసే దరఖాస్తు రుసుము, పరీక్ష రుసుము, వినియోగదారు ఛార్జీలను ఎస్‌పీవీ నిర్వహించే ప్రత్యేక నిధిలో జమ చేస్తారు. ఈ నిధులను స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకే వినియోగించనున్నారు.
రవాణా కమిషనర్‌కు బాధ్యతలు
ప్రత్యేక ప్రయోజన సంస్థ ఏర్పాటు, దాని కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన నిర్మాణం, విధివిధానాలు, ఆర్థిక నమూనాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలంగాణ రవాణా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు ద్వారా వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
