3-Dead-Los-Sngeles : టీవీ జర్నలిస్టులు సజీవ దహనం Andhra Prabha Top News
3-Dead-Los-Sngeles : టీవీ జర్నలిస్టులు సజీవ దహనం Andhra Prabha Top News
- లాస్ ఏంజెల్స్‌లో విషాదం.
- కూలిన న్యూస్ హెలికాప్టర్
- ముగ్గురు దుర్మణం
- ప్రమాద ఘటన కవరేజీలో మరో ఘోరం
(లాస్ ఏంజెల్స్, ఆంధ్రప్రభ ప్రతినిధి)
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్ ప్రమాదం దృశ్యాలను కవర్ చేస్తున్న ఓ న్యూస్ హెలికాప్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో నేలపై వ్యక్తితో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. హెలికాప్టర్‌లో ఉన్న పైలట్, ఇతర సిబ్బంది పరిస్థితిపై వెంటనే స్పష్టత రాలేదు.
ప్రమాదాన్ని కవర్ చేస్తుండగానే..
లాస్ ఏంజెల్స్‌లోని చాట్స్‌వర్త్ ప్రాంతంలో మంగళవారం ఓ ఎస్‌యూవీ వాహనం.. లాస్ ఏంజెల్స్ మెట్రో బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం ఇద్దరు మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
ఘటనాస్థలికి అత్యవసర సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇదే సమయంలో పలు న్యూస్ హెలికాప్టర్లు గాల్లో నుంచి ప్రమాద దృశ్యాలను చిత్రీకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ హెలికాప్టర్ నార్త్ మేసన్ అవెన్యూ సమీపంలోని వాణిజ్య భవనాల మధ్య ఉన్న పార్కింగ్ ప్రదేశంలో ఒక్కసారిగా కూలిపోయింది.
భారీగా చెలరేగిన మంటలు
హెలికాప్టర్ కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు సమీపంలోని పలు వాహనాలకూ వ్యాపించాయి. సమాచారం అందుకున్న లాస్ ఏంజెల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది రాత్రి 7 గంటల తర్వాత ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఎన్‌బీసీ లాస్ ఏంజెల్స్‌కు చెందినదిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. అయితే హెలికాప్టర్ ఎవరిదన్నది, అందులో ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
మంటల్లో పూర్తిగా ధ్వంసం
ప్రమాదం తీవ్రత కారణంగా హెలికాప్టర్ మంటల్లో దాదాపు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అందులో ఉన్నవారి పరిస్థితిని వెంటనే అంచనా వేయడం సహాయక సిబ్బందికి కష్టంగా మారింది.హెలికాప్టర్ ప్రమాదంలో నేలపై ఉన్న ఒక వ్యక్తితో కలిపి కనీసం ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పైలట్, ఇతర సిబ్బంది పరిస్థితిని తెలుసుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నించాయి.
కారణాలపై దర్యాప్తు
ప్రమాదానికి అసలు కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. ట్రాఫిక్ ప్రమాదాన్ని కవర్ చేస్తున్న సమయంలోనే హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందన్న అంశంపై దర్యాప్తు జరగనుంది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నాయి. హెలికాప్టర్ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సాంకేతిక కారణాలు తదితర అంశాలను అధికారులు పరిశీలించనున్నారు.
