2805-Malicious-Apk-Apps : సైబర్ మాయ,,! Andhra Prabha Crime News
2805-Malicious-Apk-Apps : సైబర్ మాయ,,! Andhra Prabha Crime News
- 2,805 యాప్‌ల సృష్టి
- రూ.150 కోట్లు గుటుక్కు
- వెరిఫికేషన్ పేరిట కైవేసీ చోరీ
- ముంబైలో మాయ బ్రహ్మ అరెస్టు
(ముంబై, ఆంధ్రప్రభ ప్రతినిధి)
పెన్షన్ కార్డు వెరిఫికేషన్.. లైఫ్ సర్టిఫికెట్.. సీనియర్ సిటిజన్ కార్డు.. ట్రాఫిక్ చలానా.. క్రెడిట్ కార్డు అప్‌డేట్.. ఇలా ఏదో ఒక సాకుతో ఫోన్ చేసి ఓ యాప్ డౌన్‌లోడ్ చేయిస్తున్నారు. ఆ తర్వాత బాధితుల ఖాతాల్లోని డబ్బు మాయమవుతోంది. ఇలాంటి సైబర్ మోసాలకు ఉపయోగించిన 2,805 హానికర APK ఫైళ్లను రూపొందించి విక్రయించిన వ్యక్తిని ముంబయి క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి యాప్స్‌ను ఉపయోగించి దేశవ్యాప్తంగా జరిగిన మోసాల విలువ రూ.150 కోట్లకు పైగానే ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. బైకుల్లాకు చెందిన ఓ వృద్ధుడు ఇదే తరహా మోసానికి గురై రూ.5.62 లక్షలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఆచూకీని గుర్తించారు. ఈ కేసు ఆగస్టు 13న నమోదైంది.
వెరిఫికేషన్ పేరుతో వల
నిందితుడు రూపొందించిన APK ఫైళ్లను చూస్తే అవి సాధారణ సేవలకు సంబంధించిన యాప్స్‌లా కనిపిస్తాయి. పెన్షన్ కార్డు వెరిఫికేషన్, లైఫ్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ కార్డు, ట్రాఫిక్ చలానా, క్రెడిట్ కార్డు వివరాల అప్‌డేట్ వంటి పేర్లతో వీటిని తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి APK ఫైళ్లను ఉపయోగిస్తారు. అయితే నిందితుడు రూపొందించిన ఫైళ్లలో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేసి, వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
ముందుగా బాధితులకు ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తాయి. కార్డు ఇప్పిస్తామని, ఏదో ఒక సేవ అందిస్తామని, లేదంటే వెరిఫికేషన్ పూర్తి చేయాలని చెబుతారు. మాటలతో నమ్మించిన తర్వాత ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. బాధితుడు ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే సైబర్ నేరగాళ్లకు కావాల్సిన సమాచారం అందుబాటులోకి వచ్చేదని పోలీసులు చెబుతున్నారు.
ఈ మోసాల కోసం నిందితుడు ప్రత్యేకంగా సర్వర్ స్పేస్‌ను కూడా అద్దెకు తీసుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.
సైబర్ నేరగాళ్లతో పరిచయం
విచారణలో నిందితుడి నేర కార్యకలాపాల తీరు కూడా వెలుగులోకి వచ్చింది. తొలుత యాప్స్, వెబ్‌సైట్ల అభివృద్ధి సేవలు అందించే వ్యక్తిగా అతడు పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఓ సైబర్ నేరగాడు అతడిని సంప్రదించాడు. తాను APK డెవలపర్‌నని పరిచయం చేసుకున్న నిందితుడు.. తన సేవలను అందించేందుకు అంగీకరించాడు. ఆ పరిచయం క్రమంగా విస్తరించి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లతో అతడికి సంబంధాలు ఏర్పడ్డాయి. చివరకు వారి అవసరాలకు అనుగుణంగా మోసపూరిత APK యాప్స్‌ను తయారు చేసి విక్రయించడం ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
రూ.150 కోట్లకు పైగా మోసాలు?
నిందితుడు రూపొందించి విక్రయించిన యాప్స్‌ను ఉపయోగించి జరిగిన సైబర్ మోసాల విలువ రూ.150 కోట్లను దాటినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే దేశవ్యాప్తంగా మరిన్ని కేసులను పరిశీలిస్తున్నందున ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.అయితే ఈ రూ.150 కోట్లు నిందితుడు సంపాదించిన మొత్తం కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అతడు రూపొందించిన హానికరమైన యాప్స్ ద్వారా బాధితులు కోల్పోయిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు.
కొనుగోలుదారులెవరు?
ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు.. అతడి వద్ద నుంచి ఈ యాప్స్‌ను కొనుగోలు చేసిన సైబర్ నేరగాళ్లు ఎవరన్న దానిపై దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎన్ని మోసాలు జరిగాయి? ఏయే ప్రాంతాల్లో బాధితులు ఉన్నారు? అన్న కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
ఒక డెవలపర్ చేతిలో తయారైన ఓ APK ఫైల్.. సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి వందలాది మంది బాధితుల ఖాతాలను ఖాళీ చేసిందా? రూ.150 కోట్లకు పైగా జరిగినట్లు అనుమానిస్తున్న ఈ సైబర్ మోసాల వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను ఛేదించడమే ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది
