24 lakh people | వైకుంఠ ఏకాదశికి పకడ్బందీగా ఏర్పాట్లు..
- దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్ద పీట..
- టోకెన్ ఉన్న భక్తులే స్వామివారి దర్శనం..
- చివరి ఏడు రోజుల్లో సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం..
24 lakh people | తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam) శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ… సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.

ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు(Temples), ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పై కప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను పవిత్రమైన పరిమళ జలాన్ని ప్రోక్షణ చేసి, నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారని తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు పగడ్బంది ఏర్పాట్లు..
ఈ సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ చేసిన ఏర్పాట్ల గురించి ఈవో మాట్లాడుతూ.. డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది నిర్వహించనున్న వైకుంఠ ద్వార(Vaikuntha Dwara) దర్శనాల కోసం పగడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
రెండు నెలలుగా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహించి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతా ఏర్పాట్లు, అన్న ప్రసాదాలు, వసతి, క్యూ లైన్ల నిర్వహణ(Queue Line Management), పార్కింగ్ సౌకర్యాల పై ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు.
సామాన్య భక్తులకే పెద్ద పీట..
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు వైకుంఠ ఏకాదశి పై ప్రత్యేక బోర్డు సమావేశం నిర్వహించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. డిసెంబర్ 30, 31న వైకుంఠ ఏకాదశి జనవరి 1వ తేదీలకు సామాన్య భక్తులకు ఈ-డిప్ విధానం ద్వారా దర్శన టోకెన్లు కేటాయించామన్నారు.
భక్తులందరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఐదు రోజుల పాటు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పించామన్నారు. దాదాపు 24 లక్షల మంది(24 lakh people) భక్తులు ఈ-డిప్ కు రిజిస్ట్రేషన్ చేసుకోగా మొదటి మూడు రోజులకు 1.89 లక్షల భక్తులను ఈ-డిన్ ద్వారా ఎంపిక చేసి టోకెన్లు కేటాయించామని తెలిపారు.

టోకెన్ పొందిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శనానికి రావాలి. ఈ మూడు రోజులకు టోకెన్లు పొందిన భక్తులకు నిర్దేశిత తేది, సమయాన్ని కేటాయించడం జరిగిందని, ఆ సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి వస్తే.. ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లోనే దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు. టోకెన్(token) పొందలేని భక్తులకు చివరి ఏడు రోజుల్లో సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
ఈ-డిప్ ద్వారా టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు సర్వ దర్శనం క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొదటి మూడు రోజులు మాత్రమే ఈ-డిప్ విధానం(e-dip system)లో టోకెన్లు కేటాయించామని, చివరి ఏడు రోజులు భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
అదే విధంగా జనవరి 2 నుండి 8వ తేది వరకు రోజుకు 15 వేల.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను, 1500 శ్రీవాణి దర్శన టికెట్ల(tickets)ను ఆన్ లైన్ లో విడుదల చేశామని చెప్పారు. జనవరి 6,7,8 తేదీల్లో స్థానికులకు దర్శనం కల్పించారు. తిరుపతి, తిరుమల స్థానికులకు స్థానికుల కోటా కింద జనవరి 6,7,8 తేదీల్లో రోజుకు 5 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలియజేశారు.
వైకుంఠ ద్వార దర్శనాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే కారణంగా చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్(Defense) వంటి ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని చెప్పారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
భద్రతకు సంబంధించి 3500 మంది పోలీసులు, 1150 మంది టీటీడీ విజిలెన్స్(1150 people TTD vigilance) సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామన్నారు. భక్తులందరూ టీటీడీ సూచనలు పాటిస్తూ సంయమనంతో స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవ్వాలని ఈవో తెలియజేశారు.

