22A Prohibited Lands | మంత్రి పొంగులేటి కీలక హామీ
- 22ఏ భూముల సమస్యపై చర్యలు..
- 24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు
- తప్పును గుర్తించాం.. సరిదిద్దుతున్నాం: మంత్రి పొంగులేటి**
- 15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: 22ఏ నిషేధిత భూముల జాబితాలోకి పొరపాటున చేరిన ప్రైవేట్ భూముల సమస్యను పరిష్కరించే ప్రక్రియను వేగవంతం చేశామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 24 గంటల్లోనే మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4.. మొత్తం 34 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిజమైన ప్రైవేట్ ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. 22ఏ జాబితా విషయంలో జరిగిన పొరపాట్లను ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో క్షేత్రస్థాయిలో కొన్ని తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దే ప్రక్రియను ప్రభుత్వం వేగంగా చేపట్టిందని వివరించారు.
తప్పును అంగీకరించి.. సరిదిద్దుతున్నాం..
ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదని పొంగులేటి అన్నారు. పొరపాటు జరిగితే దాన్ని అంగీకరించడంతో పాటు.. దాని వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కరించడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వివిధ జీవోలు, మెమోల ద్వారా క్రమబద్ధీకరించిన కొన్ని ప్రైవేట్ భూములు, హైకోర్టు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు పొందిన స్థలాలు కూడా సాంకేతిక కారణాలతో 22ఏ జాబితాలోకి చేరినట్లు తెలిపారు.
ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభించామని, అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పునరుద్ధరించామని మంత్రి వెల్లడించారు.
15 రోజుల పాటు ప్రత్యేక పరిశీలన..
22ఏ భూములకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పొంగులేటి తెలిపారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.రాబోయే 15 రోజుల పాటు ఈ కమిటీ ప్రతిరోజూ దరఖాస్తులను పరిశీలించనుందని, అర్హత ఉన్న నిజమైన ప్రైవేట్ ఆస్తులను వీలైనంత త్వరగా 22ఏ జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
పేదల భూములకు రక్షణ
పేదల హక్కులు, ఆస్తులకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా ఉన్న పేదల భూమిలో ఒక్క అంగుళాన్ని కూడా ప్రభుత్వం తీసుకోదని అన్నారు. ఇది పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వమని పేర్కొన్నారు. 22ఏ సమస్యను రాజకీయంగా ఉపయోగించుకోవద్దని మంత్రి కోరారు. ప్రజల్లో అనవసరమైన ఆందోళన సృష్టించేలా ఆరోపణలు, ప్రచారం చేయడం సరికాదన్నారు. “మేం జరిగిన తప్పును అంగీకరించి సరిదిద్దుతున్నాం. ప్రజలను ఇబ్బందుల్లో వదిలేయడం మా ప్రభుత్వ విధానం కాదు” అని స్పష్టం చేశారు.
అధికారులపై బాధ్యత నెట్టేసి ప్రభుత్వం చేతులు దులుపుకోదని, సమస్యకు పరిష్కారం చూపించడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆస్తులు, హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
