కలెక్టర్ల లేఖలతో ఆధారాలు చూపిస్తాం : హరీశ్‌రావు
తప్పు చేయకపోతే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
33 జిల్లాల్లో భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి
‘చీము, నెత్తురు ఉంటే పొంగులేటి రాజీనామా చేయాలి’..
భూభారతిపై హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : 22ఏ నిషేధిత జాబితాలో భూముల చేర్పు అంశంపై తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. 22ఏ కింద ఒక్క సెంటు భూమి కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి చెప్పడం వాస్తవ విరుద్ధమని ఆరోపించారు. ఇందుకు సంబంధించి కలెక్టర్లు ప్రభుత్వానికి పంపిన లేఖలు, ఉత్తర్వులు, నిషేధిత జాబితాలకు సంబంధించిన వివరాలను ఆధారాలుగా చూపించారు.
తన వాదనకు మద్దతుగా పలు జిల్లాల కలెక్టర్లు భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు. సిర్పూర్–కాగజ్‌నగర్ నియోజకవర్గంలో సుమారు 30 వేల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చాలని కలెక్టర్ ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలోనూ వేలాది ఇళ్లకు సంబంధించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు.
‘కలెక్టర్లంతా తప్పు చేశారా?’
భూములను నిషేధిత జాబితాలో చేర్చింది అధికారుల తప్పిదమని మంత్రి పొంగులేటి చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఒక జిల్లా కలెక్టర్ పొరపాటు చేస్తే అర్థం చేసుకోవచ్చని, 33 జిల్లాల కలెక్టర్లు ఒకే విధంగా జాబితాలు రూపొందిస్తే అది ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగిందని అన్నారు. అధికారులు తప్పు చేశారనుకుంటే ఇప్పటివరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకే నిషేధిత జాబితాలకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి పంపామని అధికారులు చెబుతున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రశ్నలు అడుగుతామనే కారణంతోనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు.
‘పోరాటం కొనసాగిస్తాం’
22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తిరిగి విడిపించే వరకు పోరాటం కొనసాగిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ‘మీకు రియల్ ఎస్టేట్ గురించి తెలిస్తే.. మాకు పోరాటాలు తెలుసు’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భూముల సమస్యలపై ప్రజల తరఫున మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
‘భూ భారతి కాదు.. భూ హారతి’
భూ భారతి చట్టం, భూ రికార్డుల మార్పులపైనా హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గజ్వేల్‌లో రాధ అనే వృద్ధురాలికి చెందిన భూమిని ఆమెకు తెలియకుండానే ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. కేవలం పది రోజుల్లోనే భూమి యాజమాన్యాన్ని మార్చినట్లు పేర్కొన్నారు. ధరణి స్థానంలో భూ భారతి తీసుకురావడానికి ఇదే కారణమంటూ విమర్శలు చేశారు.
అలాగే అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పసుమాములలో అనుముల తిరుపతిరెడ్డికి సంబంధించిన భూ వ్యవహారంపైనా హరీశ్‌రావు ఆరోపణలు చేశారు. గతంలో ఆయనకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే సంబంధిత భూముల డాక్యుమెంట్లలో మార్పులు జరిగాయని అన్నారు. ప్రజలు భవనాలు నిర్మించుకున్న భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ డాక్యుమెంట్లు మార్చారని ఆరోపించారు.
జీవోలు, కలెక్టర్ల లేఖలే ఆధారాలంటూ..
2025 సెప్టెంబర్ 11న కొత్త నిషేధిత జాబితా పంపాలని ప్రభుత్వం ఆదేశిస్తూ జీవో జారీ చేసిందని హరీశ్‌రావు తెలిపారు. అనంతరం 2025 నవంబర్ 20న జనగామ కలెక్టర్ నిషేధిత భూముల జాబితాను సిద్ధం చేసి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌కు పంపారని పేర్కొన్నారు. ఆ జాబితాను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చుతూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.
33 జిల్లాల కలెక్టర్లు పంపిన లేఖలు, జీవోల ఆధారాలతోనే తాము ఆరోపణలు చేస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 22ఏ భూముల అంశంపై మంత్రి పొంగులేటి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలు నిజం కాదని తేలితే కాకుండా, ఆధారాలు తప్పని నిరూపిస్తే తాను సమాధానం చెప్పేందుకు సిద్ధమని పేర్కొంటూ.. ‘చీము, నెత్తురు ఉంటే పొంగులేటి రాజీనామా చేయాలి’ అని సవాల్ విసిరారు.
