22-A lands | 22-ఏ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

  • 22-ఏ సమస్యలకు పరిష్కార మార్గం..
  • నాలా ప్రక్రియపై ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కలెక్టర్లకు మార్గదర్శకాలు
  • భూముల యజమానులకు కీలక అప్‌డేట్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : 22-ఏ సమస్యల పరిష్కారంలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్‌కు మార్గం సుగమం చేసినట్లు వెల్లడించారు. నాలా రుసుములు, ఇతర ప్రభుత్వ రుసుములు చెల్లించిన వారి దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా నమోదై ఉన్నప్పటికీ.. వాస్తవంగా నివాస అవసరాలకు వినియోగిస్తున్న భూముల విషయంలో యాజమాన్య వివరాలు, రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి అర్హతను నిర్ధారించనున్నారు. 22-ఏ జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, ఆస్తులను విక్రయించలేకపోవడం, రుణాలు పొందలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ నిర్ణయం ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే నిబంధనలకు అనుగుణంగా అర్హత నిర్ధారణ జరిగిన కేసుల్లోనే తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది.

ఇదిలా ఉండగా, 22-ఏ సమస్యల పరిష్కారంలో భాగంగా ఇప్పటికే జీఓ 118, జీఓ 76 ఆధారంగా పలు చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్‌ సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే అనుమతులు పొందిన కొన్ని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మరోవైపు పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ)కు సంబంధించిన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై కూడా ఇటీవల చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.