21Cases | ఒంటరి మహిళలే లక్ష్యం.. క్రూర హత్యలు

21Cases | ఒంటరి మహిళలే లక్ష్యం.. క్రూర హత్యలు

21Cases | పలు రాష్ట్రాల్లో నేరాలు
పేరు మార్చుకుని తిరుపతిలో దాగుడు మూతలు
సహచరితో కలిసి నేరాలకు పాల్పాటు
పోలీసుల కష్టంతో కేసు ఛేదన.. నిందితుడి అరెస్ట్

21Cases | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేరళలో నేరాలకు పాల్పడి, అక్కడి పోలీసుల నుంచి తప్పించుకున్నఅంతర్రాష్ట్ర దొంగ, పేరు మార్చుకుని ఏపీకి చేరి ఏళ్ల తరబడి నేరాలకు పాల్పడుతున్న ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, బంగారు నగలు దోచుకుంటున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

తిరుపతి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏడాది జనవరిలో జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తులో ఈ నిందితుడు పట్టుబడ్డాడు. విచారణలో అతను పలు రాష్ట్రాల్లో కలిపి 21 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకలోని అజ్ఞవర గ్రామానికి చెందిన అజీజ్ (39) చిన్న వయసులోనే దోపిడీలకు అలవాటు పడ్డాడు. ఒంటరిగా నివసించే మహిళలను హత్య చేసి నగలు దోచుకోవడం అతని ప్రధాన పద్ధతిగా మారింది. ఈ క్రమంలో కర్ణాటకలో నాలుగు, కేరళలో ఆరు కేసులు నమోదయ్యాయి. 2018లో కేరళలో అరెస్టయిన అతను అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. అతని పట్టుకోడానికి కేరళ పోలీసులు రూ.2 లక్షల బహుమతిని ప్రకటించారు.

తరువాత అతను తన గుర్తింపును మార్చుకుని, కర్ణాటకకు చెందిన విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ పేరిట తిరుపతిలో నివాసం ఏర్పరుచుకున్నాడు. వెదురుకుప్పం మండలానికి చెందిన రాజమ్మతో సహజీవనం చేస్తూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు బయటపడింది. ఎవరికి అనుమానం రాకుండా అవకాశమొచ్చినప్పుడల్లా నేరాలకు పాల్పడుతున్నాడు.

రాజమ్మ సహకారంతో తిరుపతి పరిధిలోని ఆర్సీ పురం, తిరుచానూరు, పిచ్చాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు ఒంటరి మహిళలను హత్య చేసి, వారి బంగారు ఆభరణాలను దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడి నుంచి 127.5 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి వస్తువులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి, నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

Leave a Reply