80’sTrend | మళ్లీ 40 ఏళ్ల వెనక్కి..

  • సోషల్ మీడియాలో 1980ల జోష్‌..
  • నాటి ఫ్యాషన్‌.. హెయిర్‌స్టైల్‌.. బ్యాక్‌గ్రౌండ్‌తో కొత్త లుక్‌

ఆంధ్రప్రభ : నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో 1980ల రెట్రో ఫొటోల ట్రెండ్‌తో సందడి చేస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ ప్రస్తుత ఫొటోలను 1980ల నాటి స్టైల్‌లోకి మార్చుకుని షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ దశకంలోని ఫ్యాషన్‌, హెయిర్‌స్టైల్‌, దుస్తులు, ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌, కెమెరా ఎఫెక్ట్‌లను ఏఐ సాయంతో జోడిస్తూ సరికొత్తగా కనిపించేలా ఫొటోలను రూపొందిస్తున్నారు. అప్పటి సినిమాలు, హీరోహీరోయిన్ల లుక్‌, రంగురంగుల దుస్తులు, ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్స్‌ను గుర్తు చేసేలా వస్తున్న ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అప్పటి తరం వారు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండగా.. యువత మాత్రం రెట్రో లుక్‌పై ఆసక్తి చూపుతోంది.

ఈ ప్రాంప్ట్‌తో సులువుగా రెట్రో లుక్‌…

ఇలా ప్రాంప్ట్‌ ఇవ్వొచ్చు : “నా ఫేస్‌, ఫేస్‌ షేప్‌, స్కిన్‌ టోన్‌, ఎక్స్‌ప్రెషన్స్‌, ఒరిజినల్‌ ఫేస్‌ను యథాతథంగా ఉంచుతూ ఈ ఫొటోను 1980ల నాటి రెట్రో ఫొటోగా మార్చండి. ఆ కాలానికి అనుగుణంగా దుస్తులు, హెయిర్‌స్టైల్‌, ఆభరణాలను మార్చండి. వామ్‌ అనలాగ్‌ లైటింగ్‌, సహజమైన ఫిల్మ్‌ గ్రెయిన్‌, కొద్దిగా మసకబారిన రంగులు, సాఫ్ట్‌ ఫోకస్‌, సహజమైన బాడీ షేప్‌ను ఉపయోగించండి. కేవలం వింటేజ్‌ ఫిల్టర్‌ వేసినట్టుగా కాకుండా ఈ ఫొటో నిజంగా 1980లలో తీసినట్టుగా కనిపించేలా చేయండి. స్మార్ట్‌ఫోన్లు, ఆధునిక కార్లు, ప్రస్తుత కాలపు దుస్తులు వంటి ఆధునిక వస్తువులను తొలగించి, ఆ కాలానికి చెందిన సహజమైన బ్యాక్‌గ్రౌండ్‌ను రూపొందించండి.”

ఇలా స్పష్టమైన వివరాలతో ప్రాంప్ట్‌ ఇవ్వడంతో తమ సాధారణ ఫొటోలను నెటిజన్లు 1980ల నాటి జ్ఞాపకాలను తలపించేలా మార్చుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియాలో 80ల రెట్రో ఫొటోల ట్రెండ్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.