16నెలలు.. 2.40లక్షల కోట్లు
- కొండను తవ్వి ఎలుకను పట్టారు !
- రాష్ట్రంలో అరెస్టులు తప్ప అభివృద్ధి లేదు
- జోగి రమేష్ అరెస్టు అన్యాయం
- మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శలు
తణుకు, ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం 16నెలల కాలంలో చేసిన 2.40లక్షల కోట్ల అప్పలు కనిపించకుండా చేసేందుకే అరెస్టుల పర్వానికి తెరతీసిందని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అక్రమ అరెస్టులు, జైళ్లకు పంపడం తప్ప పరిపాలన గాలికొదిలేసి, రెడ్ బుక్ సిద్ధాంతాన్ని అమలుచేస్తున్నారని మండిపడ్డారు. రూ. 3600 కోట్లు లిక్కర్ కేసు అని చెప్పి కొండను తవ్వి ఎలకను పట్టిన విధంగా కూటమి ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. తణుకు వైసీపీ(Tanuku YCP) కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
చంద్రబాబు బెల్టు షాపులు ఉండకూడదంటూనే రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తూ మద్యాంధ్రప్రదేశ్(Madhya Pradesh)గా మార్చారని విమర్శించారు. ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం బయటపడగానే మాజీ మంత్రి జోగి రమేష్ ప్రజలకు వివరించారని దీంతో కక్షపూరితంగా జనార్దనరావుతో పేరు చెప్పించి గౌడ కులస్థుడైన ఆయనపై అభియోగాలు మోపి నేడు అరెస్టు చేశారని విమర్శించారు. కల్తీ మద్యం నడస్తుంటే మీ పోలీసు, ఎక్సైజ్(Excise) తదితర డిపార్టుమెంట్లు ఏంచేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా, అక్రమాలు బయటపెట్టినా ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మీ ఎమ్మెల్యేలను అరెస్టులు చేస్తారా?
రాష్ట్ర వ్యాప్తంగా మీ కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల విషయాల్లో వారిని ఎందుకు అరెస్టులు చేయలేకపోతున్నారని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు యథేచ్ఛగా దోపిడీలు చేస్తున్నారని , మద్యం, బెల్టు షాపులు, ఇసుక, మట్టి, పనికి ఆహార పథకం, పేకాట, క్రికెట్ బుకీలు(Cricket Bookies), గంజాయి విక్రయాల్లో నల్లులు బల్లుల్లా దోచేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఒక ఎమ్మెల్యే సైతం పైనుంచి నిధులు రాకపోవడంతో మేము లంచాలు తీసుకుని ఆ డబ్బుతోనే అభివృద్ధి చేస్తున్నామని, స్టేడియాలు కట్టిస్తున్నామని ఇది చెప్పడానికి కూడా సిగ్గుపడడంలేదని అనడాన్ని గుర్తుచేశారు.
ఎవరో ఒకరు చెప్పిన మాటతో జోగి రమేష్‌ను అరెస్టుచేసిన మీరు మీ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్టు చేయడంలేదంటూ ధ్వజమెత్తారు. కాపు కులానికి చెందిన ముగ్గురిని కారుతో ఎక్కి తొక్కించిన ఘటనలో కారులో నిందితుడి కుటుంబమంతా కూర్చుని తొక్కించినా వారిపై కేసులు నమోదు చేయలేదని, కానీ జగన్‌మోహన్‌రెడ్డి(Jaganmohan Reddy) పర్యటనలో ఒక వ్యక్తి కారు కింద పడ్డాడని జగన్‌పై కూడా కేసు నమోదుచేయడం ఎంత దుర్మార్గమని మండిపడ్డారు.
రాష్ట్రంలో బాలికలకు చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇచ్చి అత్యాచారాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని, మీ వాళ్లు ఏ తప్పుచేసినా ఏ విధ్వంసం చేసినా వారిని ఏ అరెస్టులు చేయరని దుయ్యబట్టారు. జనార్దనరావు ముందు ఒకలా మాట్లాడారని, తరువాత మరొకలా మాట్లాడించారని విమర్శించారు.. బీసీలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులకు దిగుతున్నారని, మీ తప్పులు తెలుసుకుని బేషరతుగా జోగి రమేష్‌ను(Jogi Ramesh) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆశించినట్లు జోగి రమేష్ పేరు ఎక్కడా ప్రస్తావన లేదని కనీసం రిమాండ్ రిపోర్టు, విచారణలో కూడా ఆయన పేరులేకపోయినా అరెస్టు చేశారని విమర్శించారు.
కాశీబుగ్గ మృతులకు నివాళి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 10మంది మరణించడం బాధాకరమని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఆలయ ధర్మకర్త ముందురోజే పోలీసులకు బందోబస్తు(Police under security)పై సమాచారం ఇచ్చానని చెపుతున్నారని, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భక్తులు మృతిచెందారని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మృతులకు నివాళులర్పిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పబ్లిసిటీవింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, తేతలి మాజీ సర్పంచ్ కోట నాగేశ్వరరావు, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ(Meher Ansari), పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు.

