15MarSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

15MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

15MarSunday2026 |ఈ సంచికలో…

1. పాస్‌పోర్టుల పల్లె నిమ్మలకుంట: చిన్న గ్రామం నుంచి ప్రపంచాన్ని ఆకట్టుకున్న తోలుబొమ్మలాట కళ (ముఖచిత్ర కథనం)

2. కబుర్లు (శీర్షిక)

3. సన్నిహితం(శీర్షిక)

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

5. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

15MarSunday2026 | పాస్‌పోర్టుల పల్లె నిమ్మలకుంట: చిన్న గ్రామం నుంచి ప్రపంచాన్ని ఆకట్టుకున్న తోలుబొమ్మలాట కళ

15MarSunday2026 | నిమ్మలకుంట… పాస్‌పోర్టుల పల్లె ప్రత్యేకత
కళే జీవనాధారం అయిన గ్రామం
విదేశాల్లోనూ మెరిసిన తోలుబొమ్మలాట కళాకారులు
జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు
సంప్రదాయ కళకు ఆధునిక సవాళ్లు
కళాకారుల ఆశలు
కళతో ప్రపంచాన్ని చేరిన పల్లె

నిమ్మలకుంట… పాస్ పోర్టుల పల్లె

మా ఊరు చిన్నదే…. మా కళ ప్రపంచానికే తలమానికం

తోలుబొమ్మలాట కళతో విదేశాలకు పయనం

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : ఒక చిన్న పల్లెటూరు… సుమారు 250 ఇళ్లే ఉంటాయి. సాధారణంగా వ్యవసాయం, చేతివృత్తులు చేసుకునే గ్రామస్తులే ఎక్కువ. కానీ ఆ గ్రామానికి ఒక అరుదైన ప్రత్యేకత ఉంది. అదే పాస్‌పోర్టుల సంఖ్య. సాధారణంగా విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు ఉన్న పట్టణాల్లోనే ఎక్కువగా పాస్‌పోర్టులు ఉంటాయని అనుకుంటాం. కానీ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామం మాత్రం ఆ అంచనాలకు భిన్నంగా నిలుస్తోంది.

ఇక్కడ 250 ఇళ్లలో దాదాపు 200 మందికి పైగా పాస్‌పోర్టులు ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. ఈ గ్రామంలో ఉన్నవారు ఐటీ ఉద్యోగులు కాదు, పెద్ద వ్యాపారులు కూడా కాదు. ఎక్కువమంది తోలుబొమ్మలాట కళాకారులే. తమ పూర్వీకుల నుంచి వచ్చిన ఈ సంప్రదాయ కళను కాపాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అందుకే ఈ చిన్న పల్లెకు “పాస్‌పోర్టుల పల్లె” అనే ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది.


15MarSunday2026
15MarSunday2026

కళే జీవనాధారం….

నిమ్మలకుంట గ్రామంలో సుమారు 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో దాదాపు 150 కుటుంబాలు ఒకే సామాజిక వర్గానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారులు (మరాఠీలు). మిగతా వంద కుటుంబాలు ఇతర వృత్తులకు చెందినవారు. అయితే గ్రామంలోని మెజార్టీ ప్రజల జీవనాధారం మాత్రం తోలుబొమ్మల తయారీ, తోలుబొమ్మలాట ప్రదర్శనలు.

15MarSunday2026
15MarSunday2026

దాదాపు ప్రతి ఇంట్లోనూ ఈ కళకు చెందిన వారుండటం ఈ గ్రామ ప్రత్యేకత. తోలు మీద నైపుణ్యంగా చెక్కిన బొమ్మలు, రంగురంగుల ఆకృతులు, పురాణ పాత్రల రూపకల్పన—all కలిపి తోలుబొమ్మలాటను ఒక అద్భుతమైన కళగా నిలబెట్టాయి. తరతరాలుగా వస్తున్న ఈ కళను నిమ్మలకుంట కళాకారులు ఎంతో ప్రేమతో కొనసాగిస్తున్నారు.


విదేశాల్లోనూ కళా ప్రదర్శనలు….

నిమ్మలకుంట కళాకారులు కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా తమ కళను ప్రదర్శిస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. బృందాలుగా ఏర్పడి వివిధ దేశాలకు వెళ్లి తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇస్తున్నారు. ముఖ్యంగా మలేషియా, సింగపూర్, జపాన్, జర్మనీ, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా వారు తయారుచేసిన తోలుబొమ్మలు, కళాకృతులను అక్కడే విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ కారణంగానే గ్రామంలో అనేకమంది కళాకారులు పాస్‌పోర్టులు తీసుకుని విదేశీ ప్రయాణాలకు సిద్ధంగా ఉంటారు. చాలా కుటుంబాల్లో ఒకరికి కాదు, ఇద్దరు ముగ్గురికి కూడా పాస్‌పోర్టులు ఉండటం ఈ గ్రామ ప్రత్యేకతగా మారింది.


జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు….

నిమ్మలకుంట తోలుబొమ్మలాటకు ఎంతటి గుర్తింపు ఉందంటే, ఈ గ్రామానికి చెందిన కళాకారులు ఇప్పటివరకు పదిమందికి పైగా జాతీయ అవార్డులు అందుకున్నారు. అందులో పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా 20 మందికి పైగా కళాకారులు రాష్ట్ర స్థాయి నంది అవార్డులు అందుకోవడం ఈ గ్రామ కళా ప్రతిభకు నిదర్శనం.

ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిన కళాకారుడు దలవాయి చలపతిరావు తన బృందంతో కలిసి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది దేశాలకు వెళ్లి తోలుబొమ్మలాట ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన రూపొందించిన కళాకృతులు దేశ విదేశాల్లో మంచి ఆదరణ పొందాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌ల చేతుల మీదుగా పురస్కారాలు అందుకోవడం గ్రామానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.


సంప్రదాయ కళకు ఆధునిక సవాళ్లు

తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయ కళ ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆధునిక వినోద మార్గాలు పెరగడంతో తోలుబొమ్మలాటకు ప్రేక్షకులు తగ్గుతున్నారని కళాకారులు అంటున్నారు. అంతేకాకుండా తయారీ ఖర్చులు పెరగడం, సరైన మార్కెట్ సదుపాయాలు లేకపోవడం వల్ల కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


కళాకారుల ఆశలు….

ఇలాంటి పరిస్థితుల్లో నిమ్మలకుంట కళాకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరింత ప్రోత్సాహం కోరుతున్నారు. ముఖ్యంగా తోలుబొమ్మల తయారీకి ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే ఈ కళాకృతులకు దేశ విదేశాల్లో మార్కెట్ సదుపాయం కల్పిస్తే కళాకారులకు ఆర్థికంగా భరోసా లభిస్తుందని భావిస్తున్నారు.

అదే విధంగా తోలుబొమ్మలాటను పర్యాటక రంగంతో అనుసంధానం చేస్తే ఈ కళకు కొత్త ఊపు వస్తుందని వారు ఆశిస్తున్నారు.


కళతో ప్రపంచాన్ని చేరిన పల్లె….

సాధారణంగా చిన్న గ్రామాలు గుర్తింపు కోసం ఎదురుచూస్తుంటాయి. కానీ నిమ్మలకుంట మాత్రం తన సంప్రదాయ కళతో ప్రపంచాన్ని చేరిన పల్లెగా నిలిచింది.

కేవలం 250 ఇళ్లున్న ఈ గ్రామం నుంచి 200 మంది వరకు పాస్‌పోర్టులు కలిగి ఉండటం ఒక అరుదైన విశేషం. అది కూడా కళను ప్రపంచానికి పరిచయం చేయడానికి కావడం మరింత గర్వకారణం.

అందుకే నిమ్మలకుంట గురించి చెప్పేటప్పుడు స్థానికులు గర్వంగా చెబుతారు—
“మా ఊరు చిన్నదైనా… మా కళ ప్రపంచం దాకా వెళ్లింది”.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

2 కబుర్లు (శీర్షిక)

DEC 2025

చిట్టెమ్మ చిట్కాలు

విజయపురి అనే గ్రామంలో వంట గ్యాస్ ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. ‘ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది’ అని సామెత. ఎక్కడో ఎవరో ఏవో కారణాలతో యుద్ధం చేసుకొంటున్నా ఇంత చిన్న ఊర్లో సైతం ఇంధన సంక్షోభం తలెత్తింది. చాలినంత వంటగ్యాసు దొరకక జనం హాహాకారాలు మొదలుపెట్టారు.

కొందరు వంట మానేసి ఫలహారాలు తింటున్నారు, మరికొందరు కట్టెల పొయ్యిల కోసం పరుగులెడుతున్నారు. కానీ, “చిట్కాల చిట్టెమ్మ ” మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎప్పట్లానే వేళకు ఇంత వండుకుని తింటూ నిశ్చింతగా ఉంది.

చిట్టెమ్మ ఎట్లాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించటం ఊరంతటికీ అనుభవమే. ఎప్పట్లానే ఈసారీ చిట్టెమ్మ దగ్గరకు పరుగులెత్తారు ఊరి జనం.

“చిట్టెమ్మత్తా! ఎవరిళ్ళల్లోనూ పొయ్యిలు సరిగ్గా వెలగటం లేదు. మాకెవ్వరికీ దొరకని గ్యాస్ నీకు ఎలా వస్తోంది?” అని అడిగారు.

చిట్టెమ్మ నవ్వి అంది, “నా దగ్గర మంత్రదండం ఏమీ లేదర్రా! కాని ‘బుద్ధిబలం’ ఉంది. ఎప్పట్లానే ఈసారీనూ! గ్యాసు కష్టాలకు నేను కొన్ని చిట్కాలు కనిపెట్టాను. ఈ చిట్కాలు మీరూ పాటించండి, గ్యాసు ఆదా అవుతుంది. ఒక రోజు గ్యాసు నిక్షేపంగా రెండు రోజులు వాడుకోవచ్చు. “

చిట్టెమ్మ ఇట్లా తన చిట్కాల మూట విప్పింది.

నేను రోజూ తాగే వేడి నీళ్ల కోసం పదే పదే స్టవ్ వెలిగించను. పొద్దున్నే ఒకసారి నీళ్లు కాచుకుని, పెద్ద ఫ్లాస్క్ నిండా పోసుకుంటాను. రోజంతా అవే వాడుకుంటాను.

అడుగుభాగం సమతలంగా ఉండే పాత్రలతో వండుకుంటాను. అప్పుడు మంట పాత్ర మొత్తానికి సమానంగా తగిలి, త్వరగా వేడెక్కుతుంది. గుంతగా ఉన్న పాత్రలు వాడితే సగం మంట బయటకే వెళ్ళిపోతుంది గదా!

నేను రెండు పూటలా వంట చేయను. పొద్దున్నే అన్నం,
కూర, పప్పు అన్నీ ఒకేసారి ప్రెషర్ కుక్కర్లో వండేస్తాను. అవే రాత్రికి కొంచెం వేడి చేసుకుంటాను. దీనివల్ల స్టవ్ వెలిగించే అవసరం తగ్గిపోతుంది”

ఒక్కోసారి పాత పద్ధతులను కూడా వాడాల్సుంటుంది. వాటి మీద ఆధారపడే కదా అప్పటి వాళ్ళు కష్టాలు గట్టెక్కింది!

పప్పు పప్పులాగా ఉడకాలంటే గంటలు పడుతుంది కదా! రాత్రే పప్పును నానబెట్టి, పొద్దున్నే వండితే తక్కువ సమయంలో పప్పు ఉడికిపోతుంది. గ్యాసు ఆదా కూడా అవుతుంది.

చాలా సమస్యలకు పరిష్కారాలు మన దగ్గరే ఉంటాయి. కాని వాటి మీద దృష్టి పెట్టం. మైక్రోవేవ్ ఓవెనో ఇండక్షన్ స్టవ్వో ఉంటే, కరెంటు ఉన్న టైంలోనే వాటిని వాడుకోవచ్చు . దాని వల్ల గ్యాస్ మీద ఆధారపడటం తగ్గిపోతుంది.

చిట్టెమ్మ మాటలు విన్న ఊరి జనాలా ఆ చిట్కాలను పాటించడం మొదలుపెట్టారు. ఇళ్ళలో గ్యాస్ ఖర్చు సగానికి పైగా తగ్గిపోయింది. గ్యాసు కోసం బుకింగులు , వెయిటింగుల్లాంటి బెడదలు కూడా లేవు.

ఇప్పుడు యుద్ధం వల్లే కాదు, ఇంక ఇతర ఏ కారణాల వల్ల సంక్షోభం తలెత్తినా విజయపురివాసులు చిట్టెమ్మ ఎప్పటికి అప్పుడు చెప్పే చిట్కాలతో ఆయా సంక్షోభాలను ఇట్టే తట్టుకుంటున్నారు.

సమస్య ఎంత పెద్దదైనా సరే, సమయస్ఫూర్తితో సరైన ప్రణాళికతో ఆచరిస్తే దానిని పరిష్కరించుకోవచ్చు .


———————————————————————-


3.సన్నిహితం… శీర్షిక

DEC 2025

రోల్ మోడల్ ఉండాలి

చిన్నప్పుడు మనం స్కూల్ కి వెళ్ళి పాఠాలు నేర్చుకునే దశలో మన టీచర్లను ఆరాధనగా చూస్తాము.ఎప్పటికైనా వాళ్ళలా ధైర్యంగా సబ్జెక్ట్ చెప్పాలని కలలు కంటాము. వాళ్లను ఆదర్శంగా తీసుకుంటాము. కొంచెం పెద్దయ్యాక సినిమా స్టార్స్ ను , క్రికెట్ స్టార్స్ ను చూసి ఉత్తేజం పొందుతాం .

మనకంటే బాగా చదివే టాపర్స్ ను చూసి ఇన్స్పైర్ అయి వాళ్లలాగే బాగా చదవాలని , టాపర్ అవ్వాలని అనుకుంటాము. పెద్దయ్యాక ఉద్యోగం సంపాదించే వరకు ఇలా మనం ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత ఇక రోల్ మోడల్ అవసరం లేదు అనుకుని మనదైన మార్గంలో ముందుకు వెళుతూ జీవిత సాగరాన్ని ఈదుతాం.అన్నీ మనకు తెలుసు కదా , ఇంకొకరిని చూసి నేర్చుకోవాల్సింది ఏముంది అని నిర్లిప్తంగా మారతాం.

అయితే జీవితంలో ప్రతీ దశలోనూ ఇలా ఇంకొకరి జీవన విధానాన్ని చూసి నేర్చుకోవాల్సింది తప్పకుండా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రముఖుల జీవితాలను మనం నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా , ఎన్ని వైఫల్యాలు వచ్చినా వాళ్లు తట్టుకుని ఎలా నిలబడ్డారు , మళ్ళీ సక్సెస్ ఎలా కొడుతున్నారు అన్న విషయాన్ని గమనిస్తే , మన జీవితాల్లో అటువంటి సమస్యలు వచ్చినపుడు వాటిని తట్టుకుని ముందుకు వెళ్లగలుగుతాం .

అలా అని అందరి జీవితాలు ఒకేలా ఉంటాయి అని కాదు గానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ విధమైన పరిశీలన మనకు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీ ఒక్కరికి జీవితంలో అన్ని దశల్లో ఒక రోల్ మోడల్ ఉండాలని నా అభిప్రాయం . మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు కదా ఫ్రెండ్స్ !!!!

====================================

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

రాద్ధాంతం, వేదాంతం

నచ్చనివారు చెబితే రాద్దాంతం, నచ్చిన వారు చెబితే వేదాంతం! విషయం అదే!

శంఖంలో పోస్తేనే గానీ తీర్థం కాదు అంటారు, అలాగే శంఖం ఊదితే ఓంకారం వస్తుంది! కానీ మొత్తం ఓంకారమే రాదు. కొంత గాలి తోసిపోతుంది!!

అందుచేత జీవితంలో ప్రతీ క్షణం తూకం వేసి మాటలు మాట్లాడం సాధ్యం కాదు! మన జీవితాలలో సాధారణత, అసాధారణత కలిసి ప్రయాణం చేస్తాయి! పుస్తకాల్లో రాసినట్టు, పద్యాల్లో చెప్పినట్టు జీవితం మీటరుతో కొలిచినట్టు సాగదు!

సాధారణంగా మనుషులు ఏం అనుకుంటారు అంటే…, తాము ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఎదుటి వారు అర్ధం చేసుకోవాలి!

అందులో మంచే తీసుకోవాలి! కోపంతో అటు, ఇటు ఊగిన, తూగిన పదాలు, అరిచిన అరుపులు, ఆవేశం, అహంకారం, పట్టించుకోకూడదు! కానీ మనం మాత్రం ఎంతో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి అని హుకుం జారీ చేస్తారు! మనం ఒక్క మాట జారినా భూతద్దంలో పెట్టి, మనల్ని మన తప్పులను బోనులో నిలబెడతారు! ఎండ గడతారు! ఇల్లు ఎక్కి, లేదా పంచాయితీ ఆఫీస్ ముందుకు వెళ్ళి చెప్పి మనల్ని నలుగురిలో పలుచన చేస్తారు!

అర్ధం చేసుకోరు, నన్ను అర్థం చేసుకోరు, మమ్మల్ని అర్థం చేసుకోరు, మా మాట వినరు! అంతా నువ్వు చెప్పేదే వినాలా?… ఇలా… మనుషులు…., నిరంతరం మనం, నిజ జీవితాల్లో…. ఒకరి మీద ఒకరం Complaint చేసుకుంటాము! Blaming game ప్రతీ రోజూ మన మధ్య! మనం చేస్తే శృంగారం! ఎదుటి వారు చేస్తే వ్యభిచారం! మన Comfort, మన Ego మనం చూసుకుంటాము! మన స్వార్థం, మన అవసరం మనది!

మనది వేదాంతం, ఎదుటి వారిది రాద్ధాంతం!

ఈ ట్రాప్ నుంచి బయటకు వద్దాం, గొప్ప సాధనతో, మానసిక ఆరోగ్యంతో జీవితం గెలుద్దాం! సమాజం కోసం మంచి పనులు చేద్దాం!

మౌనం గొప్పదే గానీ, వేదాంతం చెప్పడానికి మాత్రమే నోరు తెరుస్తాను అంటే కలియుగంలో కుదరదు! నీ గురించి నువ్వు ఒక్కోసారి డబ్బా కొట్టుకొని తీరాల్సిన పరిస్థితులు! ఈ టాపిక్ లోకి వెళ్ళేముందు రెండు రెండు జోకులు చూద్దాం!

టీచర్ : సముద్రంలో జామ చెట్టు ఉంది, దాని పళ్ళు ఎలా కోస్తావురా?
విద్యార్థి : పక్షిలాగా మారి ఎగురుతూ వెళ్లి తెంపుతా!
టీచర్ : మనిషిని పక్షిగా నీ బాబు మారుస్తాడా?

విద్యార్థి: మరి సముద్రంలో చెట్టుని మీ అత్తగారు పెడుతుందా Sir?!

ఆ ఊళ్ళో ఒకడు మాత్రమే మాంసాహారి, మిగతా వారంతా శాకాహారులుగా మారిపోయారు!

మాంసాహారి ప్రతీరోజు వండే చికెన్, మటన్, చేపల వంటల వాసనకి శాకాహారులు ఇబ్బంది పడి గ్రామపెద్దకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్ద మాంసాహారితో “నువ్వు కూడా శాకాహారిగా మారిపో. నీ వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పాడు.

సరేనని తల ఊపాడు మాంసాహారి!

గ్రామ పెద్ద మాంసాహారి మీద గంగా జలం చల్లి, ” నువ్వు పుట్టుకతో మాంసాహారివి, ఇక నుండి శాకాహారివి” అన్నాడు! (ఒక తూతూ మంత్రం చదివి)

మరుసటి రోజు మళ్లీ అదే ఇంటి నుంచి చికెన్ నాటుకోడి కూర వాసన వచ్చింది! గ్రామ పెద్ద, గ్రామస్తులతో కలిసి వెళ్లి చూస్తే…, మాంసాహారి చికెన్ మీద గంగాజలం జల్లుతూ, ” నువ్వు పుట్టుకతో కోడివి, ఇక నుండి బంగళా దుంపవి” అంటున్నాడు!

గ్రామ పెద్ద, అందరూ ఆశ్చర్య పోయి నోరెళ్ళబెట్టారు!

నేను ఈ మధ్య ఒక పెద్ద కులం మనిషితో మాట్లాడుతూ ఉంటే…, అతను ఒక చిన్న పేద కులం పేరు చెప్పి వీళ్ళని ముందు కొట్టి తర్వాత మాట్లాడాలి!

ఇంకో చిన్న కులం పేరు చెప్పి, వీరిని మాట్లాడించి కొట్టాలి! ఎందుకంటే ఈ కులంలో పుట్టిన వాడు మాట్లాడితే తప్పు దొరుకుతాడు, పై కులం వాడు తెలివైన వాడు మాటల్లో తప్పు దొరకడు! అన్నాడు! చాలా అలవోకగా చాలా casual గా నవ్వుతూ చెప్పాడు ఆ పెద్దమనిషి! ఇదే విషయం నేను ఇంతకుముందు కూడా వేరే వాళ్ళ ద్వారా విన్నా!

ఎంత అన్యాయం! ఎంత Feudalistic భావజాలం?! ఈ భూస్వామ్య, సామంతవాద భావజాలం నుంచి మనం, మన పిల్లలు బయట పడాలి! పిల్లలకు కూడా ఇదే అగ్రకుల అహంకారం నేర్పుదామా?! ఒకవేళ మీరు పెద్ద కులంలో పుట్టి ఉంటే మీ భుజాల పై ఎంతో బాధ్యత ఉంది! కులం గోడల నుంచి బయటకు రండి! మీ పిల్లలకు వేరే మంచి వాళ్ళతో ప్రేమ కలిగి, ఒక పరిపక్వత తో వివాహం, పెళ్లి చేసుకోవాలనుకుంటే అది కులాంతర వివాహం అయినా కూడా అండగా నిలబడి వారిని ఆశీర్వదించండి!

రాద్దాంతం చేయ వద్దు! వేదాంతం మాట్లాడవద్దు! Just మీ బాధ్యత నెరవేర్చండి చాలు! కుల బహిష్కరణలు, పిల్లల బహిష్కరణలు చేయక పోతే చాలు! కూతురు చిన్న కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని ఆ కూతురుని మర్చిపోయి, చనిపోయింది అనుకున్నవారు, ప్రతీ పది గ్రామాలకు ఒకరు ఇద్దరు అగ్ర కులం వారు ఉన్నారు! మీకు తెలుసు!

మోసంతో, కుట్రతో ఆడపిల్లలకు వల వేస్తే అది వేరు. లవ్ జిహాద్ లాంటివి ఎక్కడ జరిగినా తప్పు. అరికట్టాలి! కానీ స్వచ్ఛమైన ప్రేమలను అలా చూడకూడదు! అక్కడ ఉన్న నిజాన్ని కాపాడాలి కదా!
ఇక వేదాంతం గురించి Before Common Era(BCE) లో సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, కన్ఫ్యూషియస్, Lautzu, అలాగే Common Era(CE) మొదలు అయ్యాకా, Immanuel Kant, Friedrich Nietzsche, Karl Marx…, వీళ్ళందరి గొప్ప Contributions వాళ్ళు జీవితాన్ని ఎంత గొప్పగా వ్యాఖ్యానించారో తెలుసుకుందాము! మన దగ్గర వేమన, కాళిదాసు, గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, చలం, బాసుడు , ఆదికవి వాల్మీకి…, ఆదిశంకరులు, మన గొప్ప కవులు, నాటక కర్తలు…, వారి వాజ్మయం మనం మన పిల్లలు చదువుకోవాలి! నేర్చుకోవాలి!

Epicurus, Arthur Schopenhauer …అందరిలో మంచి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం! అక్కరలేని విషయాలు వదిలేద్దాం! సాధన, అభ్యాసం, ఆరోగ్యం కలిసి నడవాలి!
ఏది వేదాంతం? ఏది రాద్దాంతం పాలు నీళ్ళు హంసలా వేరు చేసుకుని మన జన్మలను అద్భుతంగా తీర్చి దిద్దుకునే ప్రయత్నాలు చేద్దాం! Tell me something about yourself అని ఎవరైనా నిన్ను అడిగితే…నీ గురించి నువ్వు కొన్ని పాజిటివ్ అంశాలు చెప్పుకోవడం తప్పు కాదు! నువ్వు కూడా బ్రతకాలి! అన్నం తినాలి! ఎదగాలి! ఉద్యోగం చేయాలి! ఒక టీమ్ గా కలవాలి! విజయం సాధించాలి! రాద్దాంతం తప్పు, అవసరం అయినంత వేదాంతంలో మంచి తీసుకుందాం! నచ్చని వారు చెప్పినా, నచ్చిన వారు చెప్పినా, విషయాన్ని Objectiveగా చూసి నేర్చుకోవడం గొప్ప విజ్ఞత!
సర్వేజనాసుఖినోభవంతు!

Patriarchy, Matriarchy ఏది అవసరం ఈ మానవ సమాజానికి?! అసలు ఏది సహజం! మాతృస్వామ్యం, పితృస్వామ్యం ఏది మానవ జీవితాలకు కావాలి! కాలం, సందర్భం, అవసరం, అవకాశం వీటి బట్టి మారాలా? ఇప్పుడు మన భూమిపై ఎక్కువ చోట్ల ఏ వ్యవస్థ నడుస్తోంది?!

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: అన్నారు కదా! ఈ మాట మన భారతీయ సమాజం నమ్ముతుంది! కానీ అది నిజంగా జరుగుతోందా?

ఏ వ్యవస్థ ఉందో అర్ధం కావాలి అంటే, పని స్థలాల దగ్గరకు వెళ్ళాలి! పారిశ్రామిక రంగం, సినిమా రంగం, రాజకీయం…అక్కడ ఎవరి ఆధిపత్యం నడుస్తోంది? ఎవరికి సంపాదన ఎక్కువ? జీతం! డబ్బు! గౌరవం! అతిథి మర్యాదలు, రాజభోగాలు ఎవరికి ఎక్కువ దక్కుతున్నాయి! ఎవరి మాట నెగ్గుతోంది? సత్యం చూడాలి!

ఎక్కువ చోట్ల మగవారికే పెద్ద పీట వేస్తున్నారు! జగద్వితం!

కొన్ని చోట్ల మహిళల ఆధిపత్యం ఉన్నా, అది వారి వ్యక్తిగత ప్రతిభ! లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితులు కారణం!

వ్యవస్థకు రాజముద్ర ముందు మన మనస్సుల్లో పడాలి! తర్వాత అది బాహ్య ప్రపంచంలో రూపం తీసుకుంటుంది! అఫ్ఘానిస్థాన్, ఇరాన్, సౌదీ లాంటి దేశాల్లో పరిస్థితులు మనకు తెలుసు! షియా, సున్నీ ముస్లింలు ఎవరు ఉన్నా అక్కడ మహిళలకు నిజంగా దక్కుతున్న గౌరవం, హక్కులు అక్కడ సమాజం చర్చించుకోవాలి! బురఖా దగ్గర నుంచి, తలాక్ తలాక్ వరకు! ప్రస్తుతం అయితే ఒక యుద్ధమే అక్కడ జరుగుతోంది! అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం! ఇది ఎటు తెగుతుందో? చివరకు ఎవరు మిగులుతారో కొన్ని రోజుల్లో తేలిపోతుంది!

ఇంత ఆధునిక యుగంలో కూడా యుద్ధం అనివార్యం అయ్యింది అంటే, అది మానవ జాతికి ఎంత అవమానం?!

నేడు నడుస్తున్నది నాగరిక సమాజమా?! లేక అనాగరిక సమజామా?! ఇంకో లక్ష ఏళ్ల తర్వాత నిజమైన నాగరిక సమాజం ఏర్పడుతుందా? పోనీ ఇంకో ఐదు వందల ఏళ్ళు పడుతుందా? మతం మత్తు, ప్రాంతాల ఎత్తులు, అహంకారం కత్తులు…. ఎప్పుడు చల్లబడతాయో! చూస్తున్న వాస్తవాలు మనల్ని నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నాయి!

ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇక పై చెల్లదు! అని మహాకవి రాసి 90 ఏళ్ళు అయ్యింది!

బలహీనులపై బలవంతుల పెత్తనం! మహిళ బలహీనురాలు కాబట్టి, పురుషుడు పెత్తనం!

“పాఠం అప్పచెప్పకపోతే పెళ్లి చేస్తాను అని పంతులు గారు అన్నప్పుడే భయమేసింది, ఆఫీసులో నీ మొగుడు ఉంటాడు అవసరం వచ్చినా శెలవు ఇవ్వడు, వాడికేం మగమహారాజు అని ఆడా మగా వాగినప్పుడే అర్ధం అయిపోయింది! పెళ్లి అంటే నూరేళ్ళ శిక్ష అని, మొగుడు అంటే స్వేచ్ఛా భక్షకుడు అని! మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు అని!” సావిత్రి అనే గొప్ప రచయిత్రి 45 ఏళ్ల క్రితం బందిపోట్లు అనే చిన్న కవిత రాసి తెలుగు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టి చేసింది! స్త్రీవాద కవిత్వం, ఫెమినిస్ట్, ఫెమినిజం అన్నారు! అప్పటికే వెస్ట్ లో ఈ పదం మారుమ్రోగుతోంది!

తెలుగులో సౌందర్యాత్మక హింస, లేబర్ రూమ్, A call girl’s Monologue, పైటను తగిలేయాలి…అంటూ, విమల, కొండేపూడి నిర్మల, ఘంటసాల నిర్మల, జయప్రభ….మొదలైన రచయిత్రులు (రచయితలు) ఎన్నో కవితలు, గేయాలు రాశారు! త్రిపురనేని శ్రీనివాస్(చనిపోయాడు) లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేశారు! జ్వాలాముఖి లాంటి వాళ్ళు విభేదించారు! అవి అన్నీ వైయక్తిక సమస్యలు అని కొట్టి పడేశారు!

పురుషుడు కూడా ఈ పితృస్వామ్య వ్యవస్థ వల్ల బాధితుడే అని వాదించారు! ఎందుకంటే మగాడు ఏడవకూడదు, ఎంత కష్టం వచ్చినా ఆడదానిలా(!??) కన్నీళ్లు పెట్టకూడదు! ఇలా కొన్ని అసహజ tablue లు, నమూనాలు …. పితృస్వామ్య వ్యవస్థ సృష్టి చేసి లోకం మీద రుద్దింది! అందులో పడి పురుషుడు కూడా విల విల లాడుతున్నాడు అని ఎన్నో వాదనలు! ఇందులో చాలా నిజాలు ఉన్నాయి!

నేడు వివాహ వ్యవస్థ 80 శాతం కుప్పకూలి పోయి ఉంది! చట్టం రక్షణతో ఒక వ్యవస్థ ఎన్నాళ్లు నిలబడుతుంది?

అసలు మనుషులు మొనోగోమియస్(Monogamous) ఏనిమల్స్ కాదు! Human’s are Polygamous animals అనే ప్రకృతి వాస్తవాన్ని మానవ సమాజం మర్చిపోయింది! What is the nature instict? Or Natural instinct? దానిని అర్థం చేసుకోవాలి! గుడ్డిగా వ్యతిరేకించడమా? ప్రకృతి సహజాతలను అర్థం చేసుకోవడంలో మానవ సమాజం ఎంత విజయం సాధించింది అనేది ఆరోగ్య కరమైన చర్చ!

వివాహం వేరే గత్యంతరం లేక మానవ జాతిపై రుద్ద బడింది! దానికి దేవుడు, మతం, వ్రతాలు, పురాణ కథలు, పురాణ పురుషులు…, పాతివ్రత్యం, … కొంత చరిత్ర, కొన్ని జానపద కట్టు కథలు అన్ని దేశాల వాజ్మయంలో పుట్టు కొచ్చాయి!

లోకంలో ఏ వ్యవస్థ రాజ్యం చేస్తోందో చూడాలి అంటే, పని సంబంధాలు(work relations), లేదా శృంగార సంబంధాలు(Sex relationships) వీటి దగ్గర నిజాలు కనబడతాయి! పైకి కనిపించే నటన కాదు, వాస్తవంగా అసలు ఏం జరుగుతోందో చూడాలి అంటే గుండె ధైర్యం ఉండాలి!

గుండె ఆగిపోయే నిజాలు చూసే, అర్థం చేసుకునే చైతన్యం ఉండాలి.

“కడుపు దహించుకుపోయే పడుపుకత్తె రాక్షస రతిలో అర్థ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి ….” మహాకవి మాటలు ఆత్మ లోతుల్లోంచి చూడాలి!

పిల్లలు కోసం కలిసి ఉన్నట్టు నటిస్తూ, లోకాన్ని మభ్య పెడుతూ…, ఎవరి అక్రమ, సక్రమ సంబంధాలలో వారు కొనసాగుతున్నారు! ఏది సక్రమం, ఏది అక్రమం అని జడ్జి చేయడానికి మనం ఎవరు అని ప్రశ్నలు! ఇక్కడ బాధితుల కోణం, బాధ పెడుతున్న వారి కోణం, ఎవరి వైపు ధర్మం ఉందో చెప్పడం పెద్ద కష్టం కాదు! ఆ ప్రత్యేక పరిస్థితే సమాధానాలు ఇస్తుంది! లేదు ఒక గవర్నమెంట్ పాలసీ, చట్టం, Law of the land అనేది ఒక పారామీటర్!

పెళ్లి అయిన రెండో రోజే, నువ్వెంత అంటే నువ్వెంత అని మాటా మాటా పెరిగి, సూర్యాస్తమయం లోపే విడిపోతున్న జంటలు ఎందరో నేడు! ఆస్తి, ఐశ్వర్యం, లేదా గత్యంతరం లేని పరిస్థితులు వల్ల కొందరు కలిసి ఉంటున్నారు! లేదా భార్యాభర్తలు అని ఒక నటన చేస్తున్నారు! నిజమైన ప్రేమ కోసం, ధర్మం కోసం నిజాయితీగా ఉన్నవారు అతి తక్కువ!

మాతృస్వామ్యం, పితృస్వామ్యం రెండు బ్యాలెన్స్ కావాలి! గాలి, నీరు, తిండి అంత అత్యవసరం శృంగారం కూడా అనే నిజం లోకం బహిరంగంగా అంగీకరించాలి!

లైంగిక వాంఛను, ఆకర్షణను అపురూపంగా, ఆరాధనతో, గౌరవంతో, ప్రకృతి ఆశీర్వాదంగా చూసే మానసిక వికాసం మనుషుల్లో కలగాలి!

మహా ప్రవాహం, సునామీ వచ్చినప్పుడు కట్టుబాట్ల ఆనకట్టలు కొట్టుకు పోతాయి! మనుషుల రక్తం ఒక మహా సముద్రం, వంద సునామీలు సృష్టి అక్కడ జరుగుతుంది! పైకి అంతా బాగున్నట్టు ప్రశాంతంగా కనిపిస్తుంది! కానీ మనుషుల మనసుల్లో జరిగే ఘర్షణ, నిశ్శబ్ద యుద్ధం చరిత్రను మారుస్తాయి! ఆ మౌనంలో వంద యుద్ధాలు ఉంటాయి!

అన్నవు రాశులు ఒక వైపు, ఆకలి కేకలు ఒక వైపు అన్నాడు కాళోజీ, ఎందరో స్త్రీలు వివాహం అనే బంధిఖాన లో చిక్కుకు పోయి ఉన్నారు అని కొందరు రచయితలు ప్రపంచ వ్యాప్తంగా చెబుతున్నారు! వివాహం గోడలు బద్దలు గొట్టాలి అన్నారు కొందరు! మహాకవి చలం మన తెలుగులో స్త్రీ అనే గొప్ప పుస్తకం రాసి 106 సంవత్సరాలు అయ్యింది! తర్వాత రంగనాయకమ్మ, వేరే స్త్రీ వాద రచయిత్రులు దానిని కొనసాగించారు! గాలి, నీరు ఉచితంగా దొరుకుతున్నాయి! (దొరుకుతున్నాయి కదా?!) అలాగే శృంగారం, ప్రేమ కూడా స్వచ్ఛంగా మనుషుల మధ్య కలగాలి! ఉండాలి! దొరకాలి! లేదంటే ఇప్పుడు ఉన్న వందల కోట్ల మానసిక రోగుల జాబితాలో అందరం చేరిపోతాము!

మతం కోసం యుద్ధం, అహంకారం కోసం, ఆయిల్ కోసం, ఆధిపత్యం కోసం, మూర్ఘత్వం కోసం ఇన్ని లక్షల కోట్ల డాలర్లు వృథాగా పోతున్నాయి! ఎంతో పేదరికం, ఆకలి, నిరక్షరాస్యత… ఎన్నో దేశాల్లో ఉంది! UNO 17 Sustainable Goals ఎంత అమలు అవుతున్నాయో మీరే చూడండి!

యుద్ధం పేరుతో జరిగే ఈ ఖర్చు, నష్టం అసహజం కదా! లోకం తగల బడుతోంది! అగ్ని వర్షం అంటూ రోజూ వార్తలు! మహిళా దినోత్సవం! మన అమ్మ మహిళ! అమ్మ దృష్టి కోణంలో ఆలోచిద్దాం! సంస్కారం, అంతర్గత నీతి, ఔన్నత్యం… ఆడ అయినా మగ అయినా సమానం! శ్లోకం చెప్పి గౌరవం అడగ వొద్దు!

దుర్మార్గపు స్త్రీలకు, గయ్యాళి గంపలకు కూడా గౌరవం ఇవ్వాలి పూజించాలి అంటే కుదరదు! నేరాలు, హత్యలు, చీకటి తప్పులు వంద చేసి, దురహంకారంతో కంపు కొట్టే స్త్రీలకు కూడా స్త్రీ కాబట్టి శ్లోకం చెప్పి గౌరవం ఇవ్వండి అంటే చెల్లదు! నేరాలు చేసేసి, చెయ్యాల్సిన తప్పులు అన్నీ చేసేసి, అనాల్సిన మాటలు, చేతలు, తిట్లు, బూతులు అన్నీ అనేసి, woman card వెనుక, కులం కార్డు వెనుక, మతం కార్డు వెనుక దాక్కుంటున్నారు! చట్టం పేరుతో blackmailing! 498A ఎన్నో చోట్ల మిస్ యూస్ చేయడం, లేదంటే అట్రాసిటీ చట్టాలు మిస్ యూస్ చేయడం…. తప్పు! అతి తెలివి చూపిస్తూ కొందరు ఈ లొసుగులను Exploit చేసుకుంటున్నారు! ఇది దారుణం, మోసం! ఒక కుట్ర! దీని వలన నిజమైన బాధితుల వ్యథలు పలుచన అవుతాయి!

ప్రేమ సంబంధమే కానీ అధికార సంబంధం ఉండకూడదు అంటాడు చలం! ఇది స్త్రీ పురుషులు ఇద్దరికీ వర్తిస్తుంది! కాయిన్ కి రెండు వైపులా మన అక్షరాలు చూడాలి!

గౌరవం పొందేలా మహిళల ప్రవర్తన, ప్రేమ, సహనం, సంస్కారం, ఔన్నత్యం, క్యారెక్టర్ ఉండాలి! ఎందరో బాధిత మహిళలు ఈరోజుకీ ఉన్నారు! ఎందరో స్త్రీల శ్రమ, సున్నితత్వం దోపిడీకి గురి అవుతోంది! వారి వైపు నిలబడడం ధర్మం!

___________________________________________________________

5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

గురువారం ప్రత్యేకం
నేత్ర దర్శనం – పూలంగి సేవ

తిరుమలక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారం రోజుల్లో ఒక్క గురువారం మాత్రం రెండు విలక్షణ అలంకరణలతో భక్తకోటికి దర్శనమిస్తారు. అందులో ఒకటి నేత్ర దర్శనం కాగా మరొకటి పూలంగి దర్శనం. సాధారణ రోజుల్లో స్వామి వారి మూలమూర్తి కన్నులను కప్పిఉంచేవిధంగా 16 తులాల పచ్చకర్పూరం, ఒకటిన్నర తులాల కస్తూరి తో తీర్చిన వెడల్పైన నామంతో కనిపిస్తారు. ఒక్క గురువారం రోజు మాత్రం స్వామి వారి కన్నులను దర్శించుకునే విధంగా అర్చకులు తక్కువ పరిమాణంలో వినియోగించే పచ్చకర్పూరంతో సన్నటి నామాన్ని తీరుస్తారు. పైగా రోజంతా సన్నటి నామంతో కనిపించే స్వామి వారికి ఎటువంటి విశేషాభరణాలు ఉండవు. ధోవతి , ఉత్తరీయంతో వైకుంఠం వీడి వెంకటాద్రి పై అడుగుపెట్టిన సర్వసాధారణ శ్రీనివాసుడుగా దర్శనం ఇస్తారు. ఈ విలక్షణ దర్శనాన్ని నేత్ర దర్శనం అని పిలుస్తారు. అదే రోజు సాయంత్రం అర్చకులు నిలువెల్లా పూలమాలలతో కప్పి ఉంచే అలంకరణ చేస్తారు. పూలతో చేసిన అంగీ ధరించినట్టు కనిపించే ఆ దర్శనాన్ని పూలంగి దర్శనం అని పిలుస్తారు. ఉదయం సుప్రభాతం నుంచి నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అరవింద దళాయతాక్షుడైన స్వామిని సాయంత్రం పైన పూలంగి సేవలో దర్శించి తరించే భాగ్యం భక్తులకు లభిస్తుంది. మరుసటి రోజైన శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించే అభిషేక సేవ సౌలభ్యం కోసమే గురువారం స్వామిని ఆ విధంగా అలంకరిస్తారని అర్చకులు చెబుతారు. కానీ ఉదయం విప్పారిన నేత్రాలతో కనిపించే స్వామి సాయంత్రం పూలరంగడుగా అలంకరించుకుని రాత్రి కొండ దిగి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని కలిసి వస్తారని, శుక్రవారం ఉదయం ఇటు స్వామి కి, అటు అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారనే భావనను కొందరు భావుకులైన భాగవతోత్తములు వ్యక్తం చేస్తుంటారు. స్వామి సన్నటి నామధారియై, అర్ధనిమీలిత నేత్రుడై దర్శనం ఇచ్చే గురువారం రోజున తిరుమల ఆలయంలోనే కాదు మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి) లో పనిచేసే సిబ్బంది విధినిర్వహణలో తప్పులు, పొరబాట్లు చేయడానికి కూడా భయపడటం చెప్పుకోదగిన విశేషం.

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@
gmail.com

click here for more

Leave a Reply