12aprcrimealert | ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం

12aprcrimealert | ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం

12aprcrimealert | ఐదేళ్లలో 19వేల పోక్సో కేసులు
10 మాత్రమే కన్విక్షన్ రేటు నమోదు
రోజుకు 10 మంది చిన్నారులపైన లైంగిక దాడులు
99శాతం బాగా తెలిసిన వ్యక్తులే నేరస్థులు
ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం
తల్లిదండ్రలు, టీచర్లదే కీలక పాత్ర
పిల్లలు మొబైల్ వాడకంపై నిఘా పెంచాలని
పోలీసు అధికారుల సూచన

12aprcrimealert
12aprcrimealert

కఠినమైన చట్టాలు ఎన్ని తెచ్చినా కొందరు మృగాళ్లు మారడం లేదు. తమ వికృత వాంఛలకు పసి మొగ్గలను బలి చేస్తున్నారు. చాక్లెట్ ఇస్తానని, ఐస్ క్రీమ్ కొనిస్తానని ఒకడు, బొమ్మలు కొనిస్తానని మరొకడు … ఇలా ముక్కు పచ్చలారని చిన్నారులకు ఆశచూపి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో పోక్సో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజుకు 10 మంది చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఇంకా చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి వారిని దారుణంగా హతమారుస్తున్నారు. కొందరు కామాంధులు తమ పైశాచికత్వానికి బాలురను కూడా బలి చేస్తున్నారు. జీవితాంతం మరిచిపోలేని పీడకలలు చిన్నారులకు మిగిలిస్తున్నారు. పకడ్బందీగా చట్టాలు ఉన్నా, కొన్ని కేసుల్లో కఠిన శిక్షలు పడుతున్నా ఈ నేరాలు ఏయేటికాయేడు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది.

పోలీస్ గణాంకాల ప్రకారం గడిచిన ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా పోక్సో చట్టం ప్రకారం 19వేల కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు 10 మంది చిన్నారులు లైంగిక దాడులకు గురవుతున్నారన్నది సుస్పష్టం. ఆందోళనకర అంశం ఏంటంటే వీటిలో 99 శాతం కేసుల్లో బాధితులకు బాగా తెలిసిన వారే నిందితులుగా ఉంటున్నారు. వీరిలో జన్మనిచ్చిన వారితోపాటు తోబుట్టువులు కూడా ఉండటం విచారకరం. అధిక సంఖ్యలో కేసులు దాఖలైనప్పటికీ… ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులలో శిక్షా రేటు సుమారు 10 శాతం మాత్రమే నమోదవడం గమనార్హం. అయితే భరోసా కేంద్రం వంటి ప్రత్యేక కార్యక్రమాలు దీనిని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మల్కాజిగిరి కమీషనరేట్ లో అత్యధికం

పోక్సో యాక్ట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ట్రై కమిషనరేట్లు ముందు వరుసలో ఉన్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రం మొత్తం మీద 18,994 కేసులు నమోదు కాగా 2,619 కేసులతో రాచకొండ (ప్రస్తుతం మల్కాజిగిరి) కమిషనరేట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత 2,293 కేసులతో హైదరాబాద్ ఉండగా, 2026 కేసులతో సైబరాబాద్ కమిషనరేట్ మూడో స్థానంలో ఉన్నది. ఒక్క 2025లోనే పోక్సో చట్టం ప్రకారం నమోదైన కేసుల్లో చంచల్గూడ జైలుకు 4,176 మంది రిమాండ్ అయ్యారు. ఈ తరహా నేరాలు పెరిగిపోవడానికి మద్యం, గంజాయి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

మత్తులో పశువుల్లా మారుతున్న కొందరు ముక్కు పచ్చలారని చిన్నారులను తమ వికృత వాంఛలకు బలి చేస్తున్నారు. మైనారిటీ తీరని బాలురు కూడా ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రభావం అన్నది సుస్పష్టం. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థి చేతుల్లో కూడా మొబైల్ ఫోన్ ఉండడం సర్వసాధారణమై పోయింది. తెలిసీ తెలియని వయసులో సెల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తున్న వారిలో కొందరు అలాంటి అనుభవం కోసం దారుణాలకు తెగిస్తున్నారు. జన్మనిచ్చిన తండ్రులు, తోడబుట్టిన అన్నదమ్ములు, దగ్గరి బంధువులు, చదువులు చెప్పాల్సిన టీచర్లు, ట్యూషన్ మాస్టర్లు చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

శిక్షా రేటు 10 శాతం మాత్రమే

అధిక సంఖ్యలో కేసులు దాఖలైనప్పటికీ… ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులలో శిక్షా రేటు సుమారు 10 శాతం మాత్రమే నమోదవడం గమనార్హం. నిజానికి చిన్నారులు లైంగిక దాడులకు గురి కాకుండా చూసేందుకు పోక్సో చట్టాన్ని అత్యంత కఠినంగా రూపొందించారు. ఈ చట్టం ప్రకారం కేసు రిజిష్టర్ అయితే నిందితుడు తన నిర్దోషిత్వాన్ని తానే నిరూపించుకోవాల్సి ఉంటుంది. చట్టం కఠినంగా ఉన్నా కేసుల విచారణ నత్తనడకన సాగుతోంది. దీంతో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న వారిలో భయం తగ్గుతోంది. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 18,994 కేసులు పోక్సో చట్టం ప్రకారం నమోదుకాగా కేవలం 200 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. దీనిని బట్టే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, అధికారులు వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులకు పక్కా సాక్ష్యాధారాలతో ఛార్జిషీట్లు సమర్పించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్టులు కూడా వీలైనంత త్వరగా ఈ కేసుల్లో విచారణ ముగించి నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.

తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర కీలకంఎం. రమేష్, సైబారాబాద్ కమీషనర్

ఎం. రమేష్, సైబారాబాద్ కమీషనర్
ఎం. రమేష్, సైబారాబాద్ కమీషనర్

ఈ తరహా నేరాలకు చెక్ పెట్టడంలో తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర కీలకమని సైబారాబాద్ కమీషనర్, ఎం. రమేష్ సూచిస్తున్నారు. పిల్లలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన కల్పించాలని చెబుతున్నారు. ప్రతీరోజూ పిల్లలతో కనీసం ఓ గంట స్నేహపూర్వకంగా మాట్లాడాలి. ఎలాంటి సమస్య ఎదురైనా తమకు నేరుగా చెప్పగలిగే ధైర్యాన్ని వారికి అందించాలి. పిల్లలు మొబైల్ ఫోన్లను ఎలా ఉపయోగిస్తున్నారు, ఏం బ్రౌజ్ చేస్తున్నారు అనే దానిపై పర్యవేక్షణ అవసరం. అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్ చేసే సదుపాయాలు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply