గోదావరిఖని, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న నిషేధిత గంజాయి రవాణాకు రామగుండం కమిషనరేట్ పోలీసులు అడ్డుకట్ట వేశారు. పోలీసులు పక్కా సమాచారం మేరకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో తనిఖీలు చేపట్టి గంజాయిని పట్టుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల ప్రాంతంలో రూ.60లక్షల విలువచేసే 120కిలోల నిషేధిత గంజాయిని పట్టుకున్నట్లు గురువారం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న 15మందిని అరెస్టు చేయడంతో పాటు రెండు కార్లు, 5 బైకులు, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుండి మహారాష్ట్రకు రవాణా చేస్తుండగా గోదావరిఖని 11వ బొగ్గు గని వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు కార్లలో 96.770 కిలోల గంజాయి పట్టుబడిందని, వీటి విలువ రూ.48,38,500 ఉంటుందన్నారు. అలాగే గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఉదయ వీర్, రాజు లోది, కేశవ్ కారా, సుమంత్ కోరా లను అరెస్టు చేశామని, అదేవిధంగా రెండు కార్లు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా ప్రాంతంలో సీసీ కెమెరాలు అమ్మే దుకాణ సముదాయంలో గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు చాకచక్యంగా దాడి చేసి రూ.11లక్షల 75వేల విలువచేసే 23.5 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగిందన్నారు. అరెస్టు అయిన వారిలో సతీష్ కుమార్ మహమ్మద్ సమీర్ కృష్ణ చైతన్య అనుదీపు అబ్దుల్ కుబేరుడు చౌహన్ అజీజ్ రాఘవేంద్ర స్వామి గూడూరు రాము ఆతహుర్ సమీర్ ఉన్నారని చెప్పారు. ఈ కేసులో మరో పదకొండు మంది పరారీలో ఉన్నారన్నారు. వీరి నుండి 11ఫోన్లు, ఐదు బైకులు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నామన్నారు.

గంజాయి అమ్మకాలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు కమిషనరేట్ పోలీసులు వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారని, రామగుండం కమిషనరేట్ ఏరియాలో ఎక్కడ కూడా గంజాయి అమ్మకాలు లేకుండా పూర్తి స్థాయిలో నిఘా ఉంచామని, గంజాయి సాగు చేసినా, వినియోగించినా, రవాణా చేసినా సహించేదిలేదన్నారు. గంజాయి రవాణా అమ్మకాలపై సమాచారం ఇస్తే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, డీసీపీ అడ్మిన్ రాజు, ఏసీపీలు రాఘవేంద్రరావు, మడత రమేష్, రత్నాపూర్ ప్రకాష్, మల్లారెడ్డి, సిఐలు ప్రమోద్ రావు, రమేష్ బాబు, ప్రసాదరావు,రాజ్ కుమార్ తో పాటు ఎస్సైలు పాల్గొన్నారు.